RR vs GT: జీటీపై టాస్ గెలిచిన సంజూ.. మ్యాచ్ గెలుస్తాడా?
RR vs GT: ఐపీఎల్ 2023లో శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ టాస్ వేశారు. టాస్ గెలిచిన సంజూ శాంసన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
RR vs GT, IPL 2023:
ఐపీఎల్ 2023లో శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ టాస్ వేశారు. టాస్ గెలిచిన సంజూ శాంసన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌ను అంచనా వేయడం కష్టంగా ఉందన్నాడు. కాసేపు బ్యాటింగ్ చేశాక ఎలా ఉంటుందో చూస్తామన్నాడు. తాము ఆడుతున్న క్రికెట్ స్థాయి బాగుందని పేర్కొన్నాడు.
'మేము మొదట బ్యాటింగ్ చేస్తాం. ఈ పిచ్‌ను అంచనా వేయడం కష్టం. కొన్ని ఓవర్లు ఆడాక ఎలా ఉంటుందో చూస్తాం. మేం అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్రికెట్ ఆడుతున్నాం. జైశ్వాల్ నుంచి ఇలాంటి ప్రదర్శనలే ఆశిస్తున్నాం. రెండు మూడేళ్లుగా అతడిపై శ్రద్ధ పెట్టాం. జేసన్ హోల్డర్ స్థానంలో ఆడమ్ జంపా వస్తున్నాడు' అని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు.
'మేమూ మొదట బ్యాటింగే చేయాలనుకున్నాం. హోమ్ గ్రౌండ్ కెప్టెన్‌ను ఏం ఎంచుకోవాలో తెలియనప్పుడు మేమూ అంతే! కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసి పిచ్‌ను గమనిస్తాం. మేం అత్యుత్తమంగా ఆడాలనుకుంటున్నాం. జట్టులో మార్పులేమీ చేయడం లేదు' అని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నాడు.
రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైశ్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్, షిమ్రన్ హెట్‌మైయిర్, ధ్రువ్ జోరెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్య, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, మొహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమి, జోషువా లిటిల్
🚨 The line-ups are IN for @rajasthanroyals & @gujarat_titans❗️
— IndianPremierLeague (@IPL) May 5, 2023
Follow the match ▶️ https://t.co/tilu6n2vD3#TATAIPL | #RRvGT pic.twitter.com/NiKDoNH4q3
సంజూపై ఆశలు!
సవాయ్ మాన్ సింగ్ స్టేడియం నెమ్మదిగా ఉంటుంది. లో స్కోరింగ్ వికెట్! ఇలాంటి స్టేడియంలోనూ రాజస్థాన్ రాయల్స్ మెరుపులు మెరిపిస్తోంది. దాన్ని ఓడించడం అంత ఈజీగా ఉండదు. పైగా ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. స్పిన్ బౌలింగ్‌ను ఉతికారేస్తున్నాడు. కాస్త స్లో డౌన్ అయిన జోస్ బట్లర్ నిలబడితే ఎంత డేంజరో తెలిసిందే! సంజూ శాంసన్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. కాస్త నిలదొక్కుకుంటే రషీద్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తాడు. మిడిలార్డర్ పటిష్ఠంగానే ఉంది. దేవదత్ పడిక్కల్, షిమ్రన్ హెట్‌మైయిర్, ధ్రువ్ జోరెల్, అశ్విన్ సిక్సర్లు బాదేస్తున్నారు. ఇక పేస్ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్‌కు ఎదురులేదు. అతడికి కుల్‌దీప్ సేన్ లేదా కుల్‌దీప్ యాదవ్ అండగా ఉంటారు. సందీప్ శర్మ అదరగొడుతున్నాడు. యాష్, యూజీ స్పిన్ ఎంత ప్రమాదకరమో తెలియందికాదు! ఈ మ్యాచ్ గెలిస్తే సంజూ సేన టేబుల్ టాపర్ అవ్వొచ్చు.
పరిమిత వనరులతోనే పటిష్ఠమైన జట్టుగా ఎదిగింది గుజరాత్ టైటాన్స్! ఆటగాళ్లను బలంగా నమ్ముతోంది. అండగా నిలబడుతోంది. అందుకు తగ్గట్టే వాళ్లు రాణిస్తున్నారు. ఓపెనింగ్‌లో సాహా విఫలమవుతున్నా గిల్ మాత్రం అదరగొడుతున్నాడు. అయితే వన్‌డౌన్‌లోకి మారాక హార్దిక్ పాండ్య నిలబడుతున్నాడు. పిచ్‌ను బట్టి తన బ్యాటింగ్ శైలిని మార్చుకుంటున్నాడు. పరుగులూ చేస్తున్నాడు. విజయ్ శంకర్‌ను చూస్తే ముచ్చటేస్తోంది. చివరి సీజన్లో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డ అతడే.. ఈసారి డెత్ ఓవర్లలో డిస్ట్రక్టివ్ బ్యాటింగ్‌తో విజృంభిస్తున్నాడు. 209 స్ట్రైక్‌రేట్‌తో దంచికొడుతున్నాడు. డేవిడ్ మిల్లర్ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడుతున్నాడు. రాహుల్ తెవాతియా అదరగొడుతున్నాడు. ఇక బౌలింగ్ డిపార్ట్‌మెంట్ గురించి చెప్పాల్సిన పన్లేదు. మహ్మద్ షమిని కొత్త బంతితో ఆడటం ఎంతో కష్టం. మోహిత్ శర్మ డెత్ ఓవర్లలో పరిణతి ప్రదర్శిస్తున్నాడు. రషీద్ స్పిన్ అదుర్స్! పాండ్య బాడీలైన్ బంతులకు ప్రత్యర్థి దగ్గర సమాధానం ఉండటం లేదు.