IPL 2023: ఢిల్లీకి చెలగాటం - చెన్నైకి ప్రాణ సంకటం - సూపర్ కింగ్స్ జాగ్రత్తగా ఆడాల్సిందే!
ఐపీఎల్ 2023లో ఢిల్లీతో జరగాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జాగ్రత్తగా ఆడాల్సి ఉంది.
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో బుధవారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ప్లేఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించి ఉండవచ్చు. కానీ ఇతర జట్లలో ఆందోళనలను లేవనెత్తింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాతి మ్యాచ్ ఆడనుంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో చెన్నై మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంది.
మే 20వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొంటుంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచుల్లో 15 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ స్పాట్ ఇంకా కన్‌ఫర్మ్ అవ్వలేదు. CSK ఢిల్లీపై గెలిస్తే, దాని ప్లేఆఫ్ టిక్కెట్‌ను పొందినట్లు పరిగణించవచ్చు.
అయితే ఢిల్లీతో ఓడిపోతే సీఎస్‌కే ప్రయాణం గ్రూప్ దశలోనే ముగిసే ప్రమాదం కూడా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢిల్లీ ఓడించగలిగితే, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేరుగా లాభపడతాయి. ప్లేఆఫ్ రేసులో ఈ మూడు జట్లు పటిష్టంగా ఉన్నాయి.
లక్నో సూపర్ జెయింట్ ప్రస్తుతం 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. చివరి మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్ల పట్టికలో లక్నో రెండో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ స్థానాన్ని ఖాయం చేసుకుంటుంది. లక్నో ఓడిపోయినా, నెట్ రన్ రేట్ ఆధారంగా చెన్నై సూపర్ కింగ్స్ పోటీ ఇవ్వగలదు.
RCB మరియు ముంబై ఇండియన్స్ చెరో 14 పాయింట్లతో ప్లే ఆఫ్ రేసులో పటిష్టంగా ఉన్నాయి. చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆర్సీబీ ప్లే ఆఫ్ టిక్కెట్‌ను గెలుచుకోవచ్చు. మరోవైపు గ్రూప్ దశలోని చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి సవాల్ ఎదురుకానుంది. ముంబై గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరడం ఖాయం.
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ అవకాశాలను ఢిల్లీ క్లిష్టతరం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఉత్కంఠభరితంగా ఈ నిర్ణయాత్మక మ్యాచ్ జరిగింది. పంజాబ్ విజయానికి చివరి ఓవర్లో 33 పరుగులు కావాలి. క్రీజులో సెటిలైన లియాం లివింగ్ స్టోన్ (94: 48 బంతుల్లో, ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు) ఉన్నాడు. మొదటి బంతికే ఇషాంత్ డాట్‌గా విసిరాడు. దీంతో ఢిల్లీ విజయం దాదాపు లాంఛనం అయింది. లియాం లివింగ్‌స్టోన్ రెండో బంతిని సిక్సర్‌గానూ, మూడో బంతిని ఫోర్‌గానూ తరలించాడు. ఇషాంత్ శర్మ వేసిన నాలుగో బంతి లియామ్ లివింగ్‌స్టోన్ నడుం పైనుంచి వెళ్లడం, దాన్ని అతను సిక్సర్ కొట్టడం జరిగిపోయాయి. దీంతో సమీకరణం మూడు బంతుల్లో 16 పరుగులుగా మారింది. కానీ లివింగ్‌స్టోన్ తర్వాతి మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోతాడు. దీంతో ఢిల్లీ 15 పరుగులతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 198 పరుగులకు పరిమితం అయింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 15 పరుగులతో విజయం సాధించింది.