IPL 2023: క్వాలిఫయర్ 2లో ముంబై ఓడింది ఇక్కడే - ఇవి జరగకుండా చూసుకుని ఉంటే!
ఐపీఎల్ క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ ఓటమికి కారణాలు ఇవే.
IPL 2023 Gujarat Titans vs Mumbai Indians: ఐపీఎల్ 2023 రెండో క్వాలిఫైయర్‌లో ముంబై ఇండియన్స్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో 62 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం పాలైంది. గుజరాత్ విజయం, ముంబై ఓటమి వెనుక చాలా పెద్ద కారణాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ప్రారంభం చాలా దారుణంగా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, నెహాల్ వధెరా వెంటనే ఔటయ్యారు. కానీ గుజరాత్‌కు మాత్రం మంచి ఆరంభం లభించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చెలరేగి ఆడాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 233 పరుగులు చేసింది. ఈ సమయంలో శుభ్‌మన్ 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. గిల్ ఇన్నింగ్స్‌లో 10 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి. సరైన సమయంలో గిల్‌ను అవుట్ చేయడంలో ముంబై బౌలర్లు విఫలమయ్యారు. ముంబై ఓటమికి ఇదొక ముఖ్య కారణం. గిల్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. అతని పరుగుల వేగాన్ని ఏ బౌలర్ ఆపలేకపోయాడు.
పర్వతం లాంటి లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ముంబైకి బ్యాడ్ స్టార్ట్ లభించింది. ఓపెనర్ రోహిత్ ఎనిమిది పరుగులు, నేహాల్ నాలుగు పరుగుల వద్ద ఔటయ్యారు. ఇది కూడా వారి ఓటమికి కారణమైంది. దీని తర్వాత కామెరూన్ గ్రీన్, విష్ణు వినోద్, టిమ్ డేవిడ్ వంటి ఆటగాళ్లు తమ ప్రత్యేకతను చాటలేకపోయారు. మ్యాచ్ సందర్భంగా కామెరాన్ గ్రీన్ గాయపడ్డాడు. కాసేపటికి మైదానం నుంచి బయటకు వెళ్లాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చాడు. ముగ్గురు ముంబై బ్యాట్స్‌మెన్ మినహా అందరూ విఫలమయ్యారు.
ఇక ముంబై బౌలింగ్ ఎటాక్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వారి బౌలింగ్ విభాగం కూడా అట్టర్ ఫ్లాప్‌గానే అనిపించింది. పీయూష్ చావ్లా, క్రిస్ జోర్డాన్ అత్యంత ఖరీదైన బౌలర్లుగా నిలిచారు. పీయూష్ చావ్లా మూడు ఓవర్లలో 45 పరుగులు సమర్పించుకున్నాడు. అతను ఒక వికెట్ తీసుకున్నాడు. అదే సమయంలో క్రిస్ జోర్డాన్ నాలుగు ఓవర్లలో 56 పరుగులు సమర్పించుకున్నాడు. ఆకాష్ మధ్వాల్ శుభ్‌మన్ గిల్‌ను అవుట్ చేశాడు. కానీ అతను వికెట్ తీసే సమయానికి చాలా ఆలస్యమైంది. ఆకాష్ మధ్వాల్ 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చాడు.
ఐపీఎల్ 2023 సీజన్ క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ భారీ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 233 పరుగులు సాధించింది. అనంతరం ముంబై ఇండియన్స్ 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో గుజరాత్ టైటాన్స్ 62 పరుగులతో విజయం సాధించింది. మే 28వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌లో తలపడనుంది.
ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (61: 38 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ తన స్పెల్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. ఇక గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (129: 60 బంతుల్లో, ఏడు ఫోర్లు, 10 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.