IPL 2022 : కేన్ మామా! అదే వీక్‌నెస్ అదే జట్టు - ప్లేఆఫ్స్ చేరగలవా!
Sunrisers Hyderabad: ఐపీఎల్ వేలం ముగిశాక సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానుల్లో ఉత్సాహమే కనిపించలేదు. చెప్పుకోవడానికి ఒక్క స్టార్ ప్లేయరైనా లేడు! కష్టాల్లో నిలబడే ఆటగాడే కనిపించడం లేదు. మరీ జట్టుతో వాళ్లు ప్లేఆఫ్స్ చేరగలరా?
IPL 2022, Sunrisers Hyderabad: ఐపీఎల్ మెగా వేలం (IPL 2022 Mega Auction) ముగియగానే అన్ని జట్లలో ఆనందం కనిపించింది. కోరుకున్న ఆటగాళ్లలో కొందరైనా దక్కారన్న సంతృప్తి వెల్లివిరిసింది. సీనియర్లు, స్టార్ క్రికెటర్లతో కోర్ గ్రూప్ నిర్మించుకున్నామన్న ధీమా వ్యక్తం చేశాయి. 2016 విజేత 'సన్‌రైజర్స్ హైదరాబాద్'లో (Sunrisers Hyderabad) మాత్రం నిస్తేజం ఆవరించింది. చెప్పుకోవడానికి ఒక్క స్టార్ ప్లేయరైనా లేడు! కష్టాల్లో నిలబడే ఆటగాడే కనిపించడం లేదు. మరీ జట్టుతో వాళ్లు ప్లేఆఫ్స్ చేరగలరా?
కొద్ది తేడాతో వదిలేసింది
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం జరిగిన రెండు రోజులూ సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానుల్లో ఉత్సాహమే లేదు! అసలు ఫ్రాంచైజీ వ్యూహకర్తలు ఎలాంటి వ్యూహం అనుసరిస్తున్నారో అర్థమే కాలేదు. స్టార్ ప్లేయర్లను మిగతా వాళ్లు సొంతం చేసుకుంటుంటే అదేమీ పట్టనట్టుగా కూర్చుండిపోయారు! ఇషాన్ కిషన్ వంటి కుర్రాళ్లను కొద్ది తేడాతో వదిలేసుకుంది. దాదాపుగా 30 మందిలో 17 మందిని 10, 20, 30 లక్షల తేడాతో కాదనుకుంది. కనీసం ఒక్కరంటే ఒక్క స్టార్ ఆటగాడు, అనుభవం ఉన్న ఇండియన్ క్రికెటర్‌ను తీసుకోలేదు. పోనీ స్థానిక కుర్రాళ్లైనా ఒడిసిపట్టిందా అంటే అదీ లేదు. అంబటి రాయుడు, కేఎస్ భరత్‌ను వదిలేసుకుంది. ఆఖరికి అనుభవం, నిలకడ లేని కరీబియన్లను కోట్లు పోసి కొనుక్కుంది!
ఎక్కువ డబ్బున్నా లాభమేదీ
వేలంలో పంజాబ్ కింగ్స్ తర్వాత ఎక్కువ డబ్బుంది సన్‌రైజర్స్ వద్దే. రూ.68 కోట్లతో రంగంలోకి దూకింది. అలాంటప్పుడు ఇద్దరో, ముగ్గురో స్టార్లను ఎక్కువ డబ్బుతో కొనుచ్చు కదా! అదీ చేయలేదు. ఏ మాత్రం నిలకడలేని, బలహీనతలు ఉన్న నికోలస్ పూరన్‌కు రూ.10.75 కోట్లు చెల్లిస్తోంది. రొమారియో షెపర్డ్‌కు రూ.7.75 కోట్లు ఎందుకు పోసిందో తెలియదు. కొన్న ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠి, కార్తీక్ త్యాగీ, అయిడెన్ మార్‌క్రమ్, మార్కో జన్‌సెన్ కాస్త బెటర్ అనిపిస్తోంది. పూరన్ ఎప్పుడెలా ఆడతాడో తెలియదు. మిగతా వాళ్లను నమ్మలేం!
అదే బలహీనత
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎప్పట్లాగే మళ్లీ ఒకే బలహీనతను ప్రదర్శించింది. ఎక్కువ మంది బౌలర్లపై ఇన్వెస్ట్ చేసింది. సరైన బ్యాటింగ్ ఆర్డర్‌ను పట్టించుకోలేదు. క్రికెట్ ఒక బృంద క్రీడ. అలాంటప్పుడు అన్ని విభాగాలు బలంగానే ఉండాలి. ఉదాహరణకు కెప్టెన్ కేఎన్ విలియమ్సన్ ఇప్పుడు మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. ఒకవేళ అతడు అందుబాటులో లేకుంటే జట్టును నడిపించేదెవరో తెలియదు. విదేశీయులను కోట్లు పెట్టి కొన్నా జట్టులో ఆడేది చివరికి నలుగురే. అలాంటప్పుడు అనుభవం లేని ఆటగాళ్లతో సమన్వయం, జట్టు కూర్పు కుదరడం కష్టం.
విలియమ్సన్ లేకుంటే
కేన్ విలియమ్సన్ కోలుకుంటాడో లేదో తెలియదు. బ్యాటింగ్ లైనప్‌లో రాహుల్ త్రిపాఠి ఓకే. నికోలస్ పూరన్, మార్‌క్రమ్ మంచి ఆటగాళ్లే కానీ గతేడాది పంజాబ్ కింగ్స్‌లో గెలవాల్సిన మ్యాచులను వీరు గెలిపించలేదు. ముఖ్యంగా షార్ట్‌పిచ్ బంతులకు తడబడే పూరన్ వీక్‌నెస్ అందరికీ తెలిసిపోయింది. ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జన్‌సెన్, సుందర్, రొమారియో షెపర్డ్ కుర్రాళ్లే! వీరితో మిడిలార్డర్‌ను ఎలా నిర్మిస్తారో తెలియదు. పదేపదే విలియమ్సన్ మీదే భారం పడుతుంది. భువీ, నటరాజన్, కార్తీక్ త్యాగీ, శ్రేయస్ గోపాల్, సీన్ అబాట్‌తో బౌలింగ్ ఫర్వాలేదు. కానీ మైదానంలో వీరి ప్రదర్శన ఎలా ఉంటుందో తెలియదు.
Sunrisers Hyderabad Possible XI
అయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్