RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!
ఐపీఎల్ 2022 సీజన్‌లో క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో బెంగళూరుపై ఏడు వికెట్లతో విజయం సాధించి రాజస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టింది.
ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సెంచరీ చేసిన జోస్ బట్లర్ (106 నాటౌట్: 60 బంతుల్లో, 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆదివారం జరగనున్న ఫైనల్‌లో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.
ఆఖర్లో తడబడ్డ బెంగళూరు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు బ్యాటింగ్ పేలవంగా ప్రారంభం అయింది. విరాట్ కోహ్లీ మరోసారి విఫలం అయ్యాడు. అయితే మరో ఓపెనర్ రజత్ పాటీదార్, కెప్టెన్ ఫాఫ్ డుఫ్లెసిస్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. రజత్ పాటీదార్ వేగంగా ఆడగా... ఫాఫ్ తనకు చక్కటి సహకారం అందించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. ఆ తర్వాత వేగంగా ఆడే క్రమంలో ఫాఫ్ అవుటయ్యాడు.
డుఫ్లెసిస్ వికెట్ పడ్డాక క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ ఉన్నంత సేపు మెరుపులు మెరిపించినా... ఎక్కువ సేపు ఆడలేకపోయాడు. అర్థ సెంచరీ తర్వాత రజత్ పాటీదార్ కూడా అవుటయ్యాడు. ఈ రెండు వికెట్ల తర్వాత ఆర్సీబీ కోలుకోలేకపోయింది. దినేష్ కార్తీక్‌ను ప్రసీద్ కృష్ణ ఎక్కువ సేపు క్రీజులో ఉండనివ్వలేదు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో ప్రసీద్ కృష్ణ, ఒబెడ్ మెకాయ్ మూడేసి వికెట్లు తీయగా... ట్రెంట్ బౌల్ట్, అశ్విన్‌లకు చెరో వికెట్ దక్కింది.
బట్లర్ షో..
158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు ఫ్లయింగ్ స్టార్ట్ లభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (21: 13 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు), జోస్ బట్లర్ (106 నాటౌట్: 60 బంతుల్లో, 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు) మొదటి వికెట్‌కు 5.1 ఓవర్లలోనే 61 పరుగులు జోడించింది. ఇన్నింగ్స్ వేగాన్ని పెంచే క్రమంలో యశస్వి జైస్వాల్ అవుటైనా... కెప్టెన్ సంజు శామ్సన్‌తో (23: 21 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) కలిసి బట్లర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఈ జోడి రెండో వికెట్‌కు 52 పరుగులు జోడించింది.
అనంతరం సంజు శామ్సన్ అవుటైనా అప్పటికే మ్యాచ్ రాజస్తాన్ చేతిలోకి వచ్చేసింది. ఆ తర్వాత వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ (9: 12 బంతుల్లో) విఫలం అయ్యాడు. ఈలోపే జోస్ బట్లర్ సెంచరీ కూడా పూర్తయింది. అనంతరం సిక్సర్‌తో మ్యాచ్‌ను కూడా ముగించాడు. జోస్ బట్లర్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఈ సెంచరీతో 2016లో విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీల రికార్డును కూడా జోస్ బట్లర్ సమం చేశాడు. బెంగళూరు బౌలర్లలో జోష్ హజిల్‌వుడ్‌కు రెండు, వనిందు హసరంగకు ఒక వికెట్ లభించాయి.