IPL 2022, GT vs RR Final: బట్లర్ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్ ఉన్నాడోచ్!
IPL 2022, GT vs RR Final: ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచులో అటు టైటాన్స్ ఇటు రాయల్స్‌లో మంచి ఆటగాళ్లే ఉన్నారు. అయితే కొందరి మధ్య పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది.
IPL 2022 gt vs rr final jos buttler has threat from rashid khan : ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచుకు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ (GT vs RR final) రెడీ! ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్రమోదీ స్టేడియంలో ట్రోఫీ ముద్దాడాలని రెండు జట్లు కలగంటున్నాయి. అటు టైటాన్స్ ఇటు రాయల్స్‌లో మంచి ఆటగాళ్లే ఉన్నారు. అయితే కొందరి మధ్య పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. రషీద్ బౌలింగ్‌లో బట్లర్, అశ్విన్ స్పిన్‌ను మిల్లర్ ఎలా ఆడతారోనన్న ఉత్కంఠ నెలకొంది. మరి మెగా పోరులో మ్యాచప్స్, రికార్డుల గురించి చూసేద్దామా!
బట్లర్‌పై 'అఫ్గన్'
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ (Jos Buttler) ఈ సీజన్లో ఎన్నడూ లేనంత ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే నాలుగు సెంచరీలు బాదేశాడు. 16 మ్యాచుల్లో 151 స్ట్రైక్‌రేట్, 58 సగటుతో ఏకంగా 824 పరుగులు చేశాడు. ఒక్కడే 78 బౌండరీలు, 45 సిక్సర్లు దంచికొట్టాడు. ఈ సారి ప్రతి బౌలర్‌పై అటాకింగ్ చేస్తున్నాడు. అలాంటిది అఫ్గాన్ స్పిన్‌గన్, గ్లోబల్ సూపర్ స్టార్ రషీద్ ఖాన్ (Rashid Khan) బంతులకు ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే టీ20ల్లో బట్లర్‌ను అతడి కన్నా ఎక్కువసార్లు ఎవరూ ఔట్ చేయలేదు. ఐపీఎల్‌లో 3 సార్లు, మొత్తంగా 4 సార్లు ఔట్ చేశాడు. బట్లర్ 8 ఇన్నింగ్సుల్లో 60 కన్నా తక్కువ స్ట్రైక్‌రేట్‌తో 25 పరుగులే చేశాడు.
బట్లర్ ఈ సీజన్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న తొలి పది బంతులకు 81 స్ట్రైక్‌రేట్‌తో ఆడుతున్నాడు. అదే ఛేజింగ్‌లోనైతే 169కి మారుతున్నాడు. అందుకే ఫైనల్లో రషీద్ ఖాన్ కీలకం అవుతాడు. బట్లర్‌ను త్వరగా పెవిలియన్ పంపించేందుకు హార్దిక్ కచ్చితంగా అతడిని వినియోగిస్తాడు. ఇక సాయి కిషోర్ సైతం పరుగులు ఇవ్వకుండా బౌలింగ్ చేస్తున్నాడు. వీరిద్దరి వల్లే గుజరాత్ మిడిల్ ఓవర్లలో 7 కన్నా తక్కువ పరుగులు ఇస్తోంది.
కిల్లర్‌కు యాష్ గండం
గుజరాత్ టైటాన్స్ కిల్లర్ 'డేవిడ్ మిల్లర్' ఈ సీజన్లో బాగా ఆడటానికి ఓ కారణం ఉంది. స్పిన్ బౌలింగ్‌తో అతడి బ్యాటింగ్ మరింత మెరుగైంది. 144 స్ట్రైక్‌రేట్, 96 సగటుతో పరుగులు చేస్తున్నాడు. అశ్విన్ బౌలింగ్‌లో మాత్రం మూడుసార్లు ఔటయ్యాడు. పైగా లెఫ్ట్‌హ్యాండర్. అతడి బౌలింగ్‌లో 116 బంతులాడి 85 పరుగులే చేశాడు. అందుకే అతడు క్రీజులోకి రాగానే సంజూ శాంసన్ యాష్‌ను ప్రయోగిస్తాడనడంలో సందేహం లేదు.
* ఈ సీజన్లో మూడో స్థానం తర్వాత వచ్చి డేవిడ్ మిల్లర్ కన్నా ఎక్కువ పరుగులు ఎవరూ చేయలేదు. 449 రన్స్ కొట్టాడు. మిగతావాళ్లు 142 వద్దే ఆగిపోయారు.
* ఈ సీజన్లో పవర్‌ప్లేలో ఎక్కువ వికెట్లు తీసిన పేసర్ మహ్మద్ షమి. 11 వికెట్లు పడగొట్టాడు. అతడు వికెట్ తీసిన 12 మ్యాచుల్లో టైటాన్స్ 11 గెలిచారు. విచిత్రంగా వికెట్లు తీయని మూడుసార్లూ ఓడిపోయారు.
* ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు డేవిడ్ వార్నర్. 2016లో సన్‌రైజర్స్ తరఫున 848 పరుగులు చేశాడు. ఆ రికార్డు బద్దలు కొట్టేందుకు జోస్ బట్లర్‌కు మరో 25 పరుగులే అవసరం.
* ఒక వికెట్ పడగొడితే యుజ్వేంద్ర చాహల్ మళ్లీ పర్పుల్ క్యాప్ అందుకుంటాడు. వనిందు హసరంగ (26)ను వెనక్కి నెట్టేస్తాడు.
Like a boss, like a beast. 🔥😍#RoyalsFamily | #HallaBol pic.twitter.com/iNaLu7LgOm
— Rajasthan Royals (@rajasthanroyals) May 28, 2022