DC vs RR: తగ్గేదేలే అంటున్న వార్నర్! 'తగ్గిస్తాం లే' అని అశ్విన్, బౌల్ట్ ఛాలెంజ్!
David Warner vs R Ashwin: దిల్లీ, రాజస్థాన్ మ్యాచులో డేవిడ్ వార్నర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్ మధ్య సమరం ఆసక్తికరంగా ఉండనుంది.
![DC vs RR: తగ్గేదేలే అంటున్న వార్నర్! 'తగ్గిస్తాం లే' అని అశ్విన్, బౌల్ట్ ఛాలెంజ్! ipl 2022 dc vs rr matchups Ravichandran Ashwin trent boult combo can struggle david warner DC vs RR: తగ్గేదేలే అంటున్న వార్నర్! 'తగ్గిస్తాం లే' అని అశ్విన్, బౌల్ట్ ఛాలెంజ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/21/ef684118320ab2203acafcbd82ce4516_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఐపీఎల్ అంటేనే మైండ్‌గేమ్! అవతలి ఆటగాళ్ల బలహీనతలను గమనించి పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తారు ప్రత్యర్థులు! అలాగే తమ వీక్‌నెస్ అవతలి వారికి బలం కాకూడదనీ ఇవతలి వాళ్లూ అనుకుంటారు. అలాంటప్పుడే మ్యాచ్ అప్స్ రసవత్తరంగా అనిపిస్తాయి. శుక్రవారం జరిగే దిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచులోనూ ఇలాంటివి చాలానే ఉన్నాయి.
దిల్లీ క్యాపిటల్స్‌కు శిఖర్ ధావన్ లేని లోటును డేవిడ్ వార్నర్ తీరుస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అతడు అత్యంత విజయవంతమైన విదేశీ ఆటగాడు. ప్రతి జట్టుపైనా పరుగులు చేస్తూనే ఉంటాడు. రాజస్థాన్ పైనా అలాగే అనుకుంటాడు. కానీ అతడికి ఇద్దరి రూపంలో ముప్పు ఎదరవుతోంది. వారే ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్.
నేటి మ్యాచులో రాజస్థాన్ విజయం అందుకోవాలంటే కచ్చితంగా డేవిడ్ వార్నర్‌ను ఆపాల్సిందే. ఇందుకోసం వాళ్లు అశ్విన్, బౌల్ట్‌ను ప్రయోగిస్తారు. ఎందుకంటే వీరిద్దరి బౌలింగ్‌లో అతడు కాస్త ఇబ్బంది పడతాడు. యాష్ బౌలింగ్‌లో 127 బంతులాడిన డేవిడ్ భాయ్ 125 స్ట్రైక్‌రేట్‌తో 159 పరుగులు చేశాడు. ఏకంగా 5 సార్లు ఔటయ్యాడు. ఇక బౌల్ట్ బౌలింగ్‌లో 45 బంతుల్లో 38 పరుగులు చేసి 2 సార్లు ఔటయ్యాడు. అందుకే పవర్‌ప్లేలో వీరిద్దరి చేత సంజు కచ్చితంగా బౌలింగ్ చేయిస్తాడు.
మరో ఓపెనర్ పృథ్వీ షా ఇన్‌స్వింగ్ డెలివరీలకు ఇబ్బంది పడుతున్నాడు. ట్రెట్ బౌల్ట్ వీటిని అద్భుతంగా విసరగలడు, లక్నోతో మ్యాచులో అతడు కేఎల్ రాహుల్‌ను ఎలా ఔట్ చేశాడో మనందరికీ తెలుసు. బౌల్ట్ బౌలింగ్‌లో 18 బంతులాడిన షా కేవలం 19 పరుగులు చేసి 3 సార్లు ఔటయ్యాడు.
సమవుజ్జీలే
ఇండియన్ ప్రీమియర్ లీగులో ఈ రెండు జట్లు 24 సార్లు తలపడ్డాయి. 12-12తో రెండూ సమవుజ్జీలుగా ఉన్నాయి. చివరి ఐదు మ్యాచుల్లో దిల్లీదే ఆధిపత్యం. నాలుగు గెలిచి జోష్‌లో ఉంది. ఇప్పుడు రెండు జట్లూ సమాన బలంతో ఉండటంతో మ్యాచ్‌పై ఉత్కంఠ కలుగుతోంది.
DC vs RR Probable XI
దిల్లీ క్యాపిటల్స్ (DC Playing XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, లలిత్ యాదవ్, రోమన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్
రాజస్థాన్ రాయల్స్ (RR Playing XI): జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్, షిమ్రన్ హెట్‌మైయిర్, కరుణ్ నాయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఒబెడ్ మెక్‌కాయ్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
ఇక వరుస సెంచరీలు కొడుతున్న జోస్ బట్లర్‌ను ఆపాల్సిన అవసరం దిల్లీకి ఉంది. అతడిని అడ్డుకొనేందుకు కుల్‌దీప్ యాదవ్‌ను ప్రయోగిస్తుంది. అతడి బౌలింగ్‌లో 35 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 36 పరుగులే చేసి 2సార్లు ఔటయ్యాడు. కానీ ఈ మధ్యన బట్లర్ తన వ్యూహం మార్చాడు. తానను ఇబ్బంది పెట్టే బౌలర్లను గౌరవిస్తున్నాడు. కేకేఆర్ మ్యాచులో నరైన్‌పై ఇలాగే చేశాడు. అతడి బౌలింగ్‌లో సింగిల్స్ తీసుకొని మిగతా వాళ్లను అటాక్ చేశాడు. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ మీద శార్దూల్‌కు మంచి రికార్డు ఉంది. 19 బంతుల్లో అతడిని 3 సార్లు ఔట్ చేశాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)