GT Vs MI: ముంబైకి మోహిత్ భారీ షాక్ - ఫైనల్స్‌లో చెన్నైతో తలపడనున్న గుజరాత్!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 62 పరుగులతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
Gujarat Titans vs Mumbai Indians, Qualifier 2: ఐపీఎల్ 2023 సీజన్ క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ భారీ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 233 పరుగులు సాధించింది. అనంతరం ముంబై ఇండియన్స్ 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో గుజరాత్ టైటాన్స్ 62 పరుగులతో విజయం సాధించింది. మే 28వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌లో తలపడనుంది.
ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (61: 38 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ తన స్పెల్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. ఇక గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (129: 60 బంతుల్లో, ఏడు ఫోర్లు, 10 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
తిలక్, సూర్య పోరాడినా...
234 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇన్నింగ్స్ నిరాశాజనకంగా ప్రారంభం అయింది. ఓపెనర్లు నెహాల్ వధేరా (4: 3 బంతుల్లో, ఒక ఫోర్), రోహిత్ శర్మ (8: 7 బంతుల్లో, ఒక ఫోర్) స్కోరు బోర్డుపై 21 పరుగులు చేరేసరికి పెవిలియన్ బాట పట్టారు. కామెరాన్ గ్రీన్ (30: 20 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) కూడా గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే తిలక్ వర్మ (43: 14 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు)వచ్చీ రావడంతోనే హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగాడు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (61: 38 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) కేవలం 22 బంతుల్లోనే 51 పరుగులు జోడించారు. రషీద్ ఖాన్ తన మొదటి ఓవర్లోనే తిలక్ వర్మను అవుట్ చేసి ముంబైకి గట్టి షాక్ ఇచ్చాడు.
తర్వాత కామెరాన్ గ్రీన్ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చాడు. కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ రన్ ఛేజ్‌ను ముందుకు తీసుకెళ్లారు. వీరు నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలోనే అవుట్ కావడంతో ముంబై కష్టాల్లో పడింది. టిమ్ డేవిడ్ (2: 3 బంతుల్లో), విష్ణు వినోద్ (5: 7 బంతుల్లో) కూడా అవుట్ కావడంతో ముంబై గెలుపు ఆశలు ముగిసిపోయాయి. ఆ తర్వాత ముంబై ఎక్కువ సేపు నిలబడలేదు. 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ ఐదు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీ, రషీద్ ఖాన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. జాషువా లిటిల్ ఒక వికెట్ తీశాడు.
శుభ్‌మన్ గిల్ సూపర్ షో
టాస్‌కు ముందు వర్షం కురవడంతో ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. తేమను ఉపయోగించుకొని వికెట్లు తీయాలని భావించింది. వారి ప్లాన్‌ను పటాపంచలు చేశాడు శుభ్‌మన్ గిల్! కళ్లు చెదిరే సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పవర్ ప్లే ముగిసే సరికి జీటీని వికెట్ నష్టపోకుండా 50తో నిలిపాడు. పియూష్ చావ్లా వేసిన 6.2వ బంతికి వృద్ధిమాన్ సాహా (18)ని ఇషాన్ స్టంపౌట్ చేశాడు. దాంతో స్కోరు నెమ్మదిస్తుందేమో అనుకుంటే.. అదీ జరగలేదు. సాయి సుదర్శన్‌తో కలిసి రెండో వికెట్‌కు 64 బంతుల్లో 138 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు గిల్!
తొమ్మిది ఓవర్లకు స్ట్రాటజిక్ టైమౌట్ తీసుకొనేప్పటికీ గుజరాత్ స్కోరు 80/1. బ్రేక్ నుంచి రాగానే బౌండరీ కొట్టి 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు గిల్. ఆ తర్వాత భీకరమైన హిట్టింగ్ చేశాడు. బంతి పట్టుకున్న ప్రతి బౌలర్‌ను అటాక్ చేశాడు. ఎలాంటి బంతులు వేసినా స్టాండ్స్‌లోకి పంపించాడు. దాంతో 14 ఓవర్లకు 147/1 వద్ద ముంబయి రెండో టైమౌట్ తీసుకోవాల్సి వచ్చింది. ఎన్ని బ్రేక్‌లు వచ్చినా గిల్ అటాకింగ్ మాత్రం ఆపలేదు. 49 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. జట్టు స్కోరు 192 వద్ద అతడిని ఆకాశ్ మధ్వాల్ ఔట్ చేశాడు. 214 వద్ద సుదర్శన్ రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్య (28*; 13 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి స్కోరును 233/3కు చేర్చాడు.