GT Vs LSG: లక్నో బౌలర్లను చితక్కొట్టిన గుజరాత్ - సూపర్ జెయింట్స్ ముందు భారీ టార్గెట్!
ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.
Gujarat Titans vs Lucknow Super Giants: ఐపీఎల్ 2023 సీజన్ 51వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ (GT) 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (94 నాటౌట్: 51 బంతుల్లో, రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ వృద్థిమాన్ సాహా (81: 43 బంతుల్లో, 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాడు.
లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా ఎనిమిది బౌలింగ్ ఆప్షన్లను ప్రయత్నించింది. అయినా పరుగుల ఫ్లో ఆగలేదు. మొహ్‌సిన్ ఖాన్, అవేష్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ విజయానికి 120 బంతుల్లో 228 పరుగులు కావాలి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా గుజరాత్‌కు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి బంతి నుంచే చిచ్చరపిడుగుల్లా చెలరేగారు. బౌండరీలు, సిక్సర్లతో పరుగుల వరద పారించారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది.
తర్వాత కూడా గుజరాత్ జోరు తగ్గలేదు. ఈ క్రమంలోనే వృద్ధిమాన్ సాహా అర్థ సెంచరీ పూర్తయింది. 10 ఓవర్లలో గుజరాత్ వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. మొదటి వికెట్‌కు 142 పరుగులు జోడించిన అనంతరం అవేష్ ఖాన్ బౌలింగ్‌లో సాహా అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కాసేపు మెరుపులు మెరిపించాడు. చివరి ఓవర్లలో శుభ్‌మన్ గిల్ సిక్సర్లతో చెలరేగాడు. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.
పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్ర స్థానంలోనూ, లక్నో సూపర్ జెయింట్స్ మూడో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరనుంది. మరోవైపు గెలిచినా ఓడినా గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలోనే కొనసాగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే గుజరాత్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే.
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, కరణ్ శర్మ, కృనాల్ పాండ్యా (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, స్వప్నిల్ సింగ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్
లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ఆయుష్ బదోని, అమిత్ మిశ్రా, డేనియల్ సామ్స్, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
అల్జారీ జోసెఫ్, దాసున్ షనక, కేఎస్ భరత్, శివం మావి, జయంత్ యాదవ్.