IPL Auction Date: పది జట్ల ఐపీఎల్‌కు అంకురార్పణ.. అక్టోబర్ 17నే ఫ్రాంచైజీల వేలం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో రెండు జట్లకు అక్టోబర్ 17న వేలం జరగనుంది! ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని సమాచారం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో రెండు జట్లకు అక్టోబర్ 17న వేలం జరగనుంది! ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని సమాచారం. ఆశ్చర్యకరంగా బిడ్డింగ్‌పై వివరాలు, సందేహాలు తెలుసుకొనేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 21గా ప్రకటించడం గమనార్హం. బిడ్ పత్రాలను తీసుకెళ్లేందుకు అక్టోబర్ 5 చివరి తేదీ.
ప్రస్తుతం ఐపీఎల్ ఎనిమిది జట్లతో జరుగుతోంది. గతంలో ఒకసారి పది జట్లతో లీగ్ నిర్వహించినా ఆ తర్వాత రెండేళ్లు తొమ్మిది జట్లతో జరిగింది. క్రమంగా ఎనిమిది ఫ్రాంచైజీలకు పరిమితమైంది. బీసీసీఐ అధ్యక్షకార్యదర్శులుగా గంగూలీ, జే షా ఎంపికవ్వడంతో బోర్డులో మార్పులు జరిగాయి. మళ్లీ పది జట్లతో లీగ్ నిర్వహించేందుకు ఐపీఎల్ పాలక మండలి, బీసీసీఐ నిర్ణయించాయి. బోర్డు వార్షిక సమావేశంలోనూ దీనిపై చర్చించారు. 2022 నుంచి పది జట్లతోనే ఐపీఎల్ జరగనుంది.
అందుకే మరో రెండు జట్లను ఎంపిక చేసేందుకు బీసీసీఐ వేలం నిర్వహించనుంది. అక్టోబర్ 17ను ఇందుకు ముహూర్తంగా ఖరారు చేసిందని బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే ఆగస్టు 31న రెండు ఫ్రాంచైజీల్లో ఒకదానిని విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానించింది.
"టెండర్ ఆహ్వాన పత్రాల్లో (ఐటీటీ)' బిడ్ల సమర్పణ, మూల్యాంకణం గురించి వివరాలు ఉంటాయి. ఫ్రాంచైజీ ఎంపికకు అర్హత, బిడ్లను సమర్పించే ప్రక్రియ, కొత్త జట్ల అధికారులు, నిబంధనలు తదితర వివరాలూ ఉంటాయి. రూ.10 లక్షలు చెల్లించి బిడ్ పత్రాలను తీసుకోవచ్చు. చెల్లించే మొత్తంపై జీఎస్‌టీ అదనం' అని బీసీసీఐ తెలిపింది.
ఐటీటీ పత్రాలు అక్టోబర్ 5 వరకు అందుబాటులో ఉంటాయి. ఫ్రాంచైజీలపై ఆసక్తిగల సంస్థలు బిడ్ పత్రాలు కొనుగోలు చేసేందుకు ittipl2021@bcci.tvకి మెయిల్ పంపించాలి. మెయిల్ సబ్జెక్టులో 'ఐపీఎల్ రెండు కొత్త జట్లలో ఒక దానిని సొంతం చేసుకొనేందుకు ఐటీటీ ఇవ్వగలరు' అని పెట్టాల్సి ఉంటుంది.
ఐటీటీ కోసం ఎవరు కోరినా.. నిర్దేశించిన ప్రమాణాలకు అర్హత సాధించాలి. అప్పుడే బిడ్ వేసేందుకు అర్హులుగా ప్రకటిస్తారు. బిడ్డింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులు చేసేందుకైనా బీసీసీఐకి అన్ని అధికారాలు ఉంటాయి.
Also Read: IPL 2021: ఎరుపు రంగు నుంచి నీలి రంగు జెర్సీకి మారిన ఆర్‌సీబీ.. ఎందుకో తెలుసా?