Kane Williamson Injury: గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ - కేన్ విలియమ్సన్‌కు తీవ్ర గాయం!
ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ తీవ్రంగా గాయపడ్డాడు.
Kane Williamson Injury: IPL 2023 ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ పట్టే ప్రయత్నంలో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు కేన్ విలియమ్సన్ గాయపడ్డాడు. ఆ తర్వాత కేన్ విలియమ్సన్‌ను మైదానం నుంచి తప్పించారు. కేన్ విలియమ్సన్ కుడి మోకాలికి గాయమైనట్లు చెబుతున్నారు. అయితే కేన్ విలియమ్సన్ గాయం ఎంత తీవ్రంగా ఉందో విచారణ తర్వాత తేలనుంది.
కేన్ విలియమ్సన్ ఎలా గాయపడ్డాడు?
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన షాట్ బ్యాట్‌ను మధ్యలో తాకింది. బంతి సిక్సర్ దిశగా బౌండరీని దాటుతుందని అనిపించింది. కానీ కేన్ విలియమ్సన్ బౌండరీపై నిలబడి అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శనను కనపరిచాడు.
కేన్ విలియమ్సన్ సిక్స్‌ను ఆపాడు. కానీ ఫోర్ పోకుండా ఆపలేకపోయాడు. అయితే ఈ క్రమంలో కేన్ విలియమ్సన్ గాయపడ్డాడు. దీంతో కేన్ విలియమ్సన్ ఆట మధ్యలోనే మైదానం వీడాల్సి వచ్చింది. కేన్ విలియమ్సన్‌కు తీవ్ర గాయం అయినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
కేన్ విలియమ్సన్ గాయం ఎంత తీవ్రంగా ఉంది?
కేన్ విలియమ్సన్ గాయం ఎంత తీవ్రంగా ఉందో తెలియదు. కేన్ విలియమ్సన్ గాయం తీవ్రంగా ఉంటే గుజరాత్ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. అయితే ఇన్వెస్టిగేషన్ రిపోర్టు వచ్చిన తర్వాత కేన్ విలియమ్సన్ గాయం ఎంత తీవ్రంగా ఉందో తేలిపోతుంది. గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్ ఆడుతోంది. కానీ హార్దిక్ పాండ్యా జట్టుకు మంచి విషయం ఏమిటంటే బ్యాకప్‌గా అనేక విదేశీ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్నమ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓ మోస్తరు స్కోరును సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ధోని సేన 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ (92: 50 బంతుల్లో, నాలుగు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ విజయానికి 120 బంతుల్లో 179 పరుగులు కావాలి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై బ్యాటింగ్‌కు దిగింది. చెన్నైకి ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డెవాన్ కాన్వేను (1: 6 బంతుల్లో) మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 14 పరుగులకే చెన్నై మొదటి వికెట్ కోల్పోయింది. కానీ వన్‌డౌన్‌లో వచ్చిన మొయిన్ అలీ (23: 17 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (92: 50 బంతుల్లో, నాలుగు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు) మెరుపు వేగంతో ఆడారు. వీరు రెండో వికెట్‌కు 21 బంతుల్లోనే 36 పరుగులు జోడించారు. చెన్నై సూపర్ కింగ్స్ 5.4 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును చేరుకుంది. కానీ ఈ దశలో రషీద్ ఖాన్ చెన్నైని గట్టి దెబ్బ కొట్టాడు. వరుస ఓవర్లలో మొయిన్ అలీ, బెన్ స్టోక్స్‌లను (7: 6 బంతుల్లో, ఒక ఫోర్) అవుట్ చేశాడు. దీంతో చెన్నై 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
అనంతరం వచ్చిన అంబటి రాయుడు (12: 12 బంతుల్లో, ఒక సిక్సర్), రుతురాజ్ గైక్వాడ్‌కు చక్కటి సహకారం అందించాడు. వీరు నాలుగో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. అల్జారీ జోసెఫ్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు కొట్టడం విశేషం. వీరి భాగస్వామ్యం చెన్నైని భారీ స్కోరు దిశగా తీసుకెళ్తున్న దశలో రాయుడు అవుటయ్యాడు. దీంతో రుతురాజ్ గైక్వాడ్ కూడా నెమ్మదించాడు. భారీ షాట్లకు ప్రయత్నించి సెంచరీకి దగ్గరలో అవుటయ్యాడు. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని (14 నాటౌట్: 7 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఒక ఫోర్, ఒక సిక్సర్ కొట్టి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. దీంతో చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులకే పరిమితం అయింది.