CSK vs KKR, Match Highlights: థ్రిల్లర్‌ను మించి ధోనీసేన విజయం.. ఆఖర్లో జడ్డూ అద్భుతం
ఐపీఎల్ రెండో అంచెలో వరుసగా మూడో మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసింది. కోల్‌కతా నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ఆఖరి బంతికి ఛేదించింది.
మ్యాచ్ అంటే ఇలాగే ఉండాలేమో! మజా అంటే ఇదేనేమో! ఆడితే ఈ రేంజ్‌లో ఆడాలేమో! అప్పటి వరకు ఒక జట్టుది ఆధిపత్యం.. మరో బంతికే ఇంకో జట్టుది పైచేయి. బంతి బంతికీ నువ్వా నేనా అన్నంత పోటీ! ఆఖరి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి!
ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్ అద్భుతం చేసింది. అభిమానులను మునికాళ్లపై నిలబెట్టింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఉత్కంఠకర విజయం అందుకుంది. రెండో అంచెలో వరుసగా మూడో మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసింది. ప్రత్యర్థి నిర్దేశించిన 172 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించింది. రవీంద్ర జడేజా తిరుగులేని పోరాటంతో 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది.
కోల్‌కతాలో రాహుల్ త్రిపాఠి (45; 33 బంతుల్లో 4x4, 1x6), నితీశ్ రాణా (37*; 27 బంతుల్లో 3x4, 1x6), దినేశ్ కార్తీక్ (26; 11 బంతుల్లో 3x4, 1x6) రాణించగా చెన్నైలో రుతురాజ్ గైక్వాడ్ (40; 28 బంతుల్లో 2x4, 3x6), డుప్లెసిస్ (43; 30 బంతుల్లో 7x4), మొయిన్ అలీ (32; 28 బంతుల్లో 2x4, 1x6), రవీంద్ర జడేజా (22; 8 బంతుల్లో 2x4, 2x6) దుమ్మురేపారు.
Also Read: ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. టీ20ల్లో తొలి భారత క్రికెటర్‌గా రికార్డ్
ఆఖరి వరకు థ్రిల్
భారీ ఛేదనకు దిగిన చెన్నైకి అదిరే ఆరంభం లభించింది. రుతరాజ్, డుప్లెసిస్ ఒకరితో ఒకరు పోటీ పడుతూ కళ్లు చెదిరే సిక్సర్లు, బౌండరీలు బాదేశారు. తొలి వికెట్‌కు ఏకంగా 74 పరుగుల భాగస్వామ్యం అందించారు. మందకొడి పిచ్‌పై ఛేదన కష్టమనుకుంటే.. వీరిద్దరూ అద్భుతమైన ఫుట్‌వర్క్‌తో దొరికిన బంతుల్ని దంచికొట్టారు. తొమ్మిదో ఓవర్లో రసెల్ రుతురాజ్‌ను ఔట్ చేసినా.. మొయిన్ అలీతో కలిసి డుప్లెసిస్ రెండో వికెట్‌కు 28 పరుగుల భాగస్వా్మ్యం అందించాడు. జట్టు స్కోరు 102 వద్ద డుప్లెసిస్‌ను ప్రసిద్ధ్ ఔట్ చేయడంతో స్కోరు వేగం మందగించింది. నిలదొక్కుకున్న మొయిన్ 16.4f బంతికి ఫెర్గూసన్ ఔట్ చేశాడు. అంబటి రాయుడు, సురేశ్ రైనా, ఎంఎస్ ధోనీ నిరాశపరిచారు. 12 బంతుల్లో 26 పరుగులు అవసరమైన తరుణంలో ప్రసిద్ధ్ వేసిన 19వ ఓవర్ ఆఖరి 4 బంతుల్ని జడేజా 6,6,4,4 బాదేసి మొత్తం 22 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో స్కోరు సమం కావడం.. వెంటవెంటనే జడ్డూ, కరన్ ఔటవ్వడంతో టెన్షన్ వేసింది. ఆఖరి బంతికి దీపక్ చాహర్ సింగిల్ తీసి విజయం అందించాడు.
Also Read: ఆస్ట్రేలియా మహిళల జట్టుపై రెండు వికెట్ల తేడాతో భారత్ విజయం.. 26 వరుస విజయాలకు బ్రేక్!
ఆరంభం.. ఆఖర్లో మెరుపుల్
కోల్‌కతా తొలి ఓవర్లోనే దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయింది. అనవసర పరుగుకు యత్నించి గిల్ ఔటయ్యాడు. ఈ క్రమంలో వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి ఐదు ఓవర్లకే స్కోరును 50 దాటించారు. వెంకటేశ్‌ను ఠాకూర్ ఔట్ చేయడం.. మోర్గాన్ విఫలమవ్వడంతో స్కోరు వేగం తగ్గింది. ఐతే నితీశ్ రాణా సాయంతో త్రిపాఠి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. జట్టు స్కోరు 89 వద్ద అతడిని జడ్డూ ఔట్ చేసినా.. రాణా సాయంతో రసెల్ మెరుపులు మెరిపించాడు. దాంతో 18.2 ఓవర్లకు స్కోరు 150కి చేరుకుంది. త్రిపాఠి, రసెల్ ఔటయ్యాక దినేశ్ కార్తీక్ వరుస బౌండరీలు బాది స్కోరును 171/6కు చేర్చాడు.
Also Read: సన్‌రైజర్స్ ఇంటికే.. ఐదు పరుగులతో పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ!