India Wins U19 World Cup: యువ క్రికెట్‌లో ఎదురు లేని భారత్, ఐదోసారి అండర్-19 కప్ కైవసం, అదరగొట్టిన కుర్రాళ్లు!
అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌పై అత్యధికంగా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఇంగ్ల్ండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదోసారి కప్‌ను ముద్దాడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 47.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ ఈ కప్‌ను ఐదోసారి గెలవడం విశేషం. ఏ జట్టుకైనా ఇదే అత్యధికం. భారత్ తర్వాత ఆస్ట్రేలియా అత్యధికంగా మూడు సార్లు ఈ కప్‌ను విజయం సాధించింది.
అందరూ రాణించారు
190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు మొదటి ఓవర్లోనే చుక్కెదురైంది. ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ రఘువంశీ (0: 2 బంతుల్లో) డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ హర్నూర్ సింగ్ (21: 46 బంతుల్లో, మూడు ఫోర్లు), వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (50: 84 బంతుల్లో, ఆరు ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో హర్నూర్ అవుటయ్యాడు.
మరో వికెట్ పడితే ఛేదన కష్టం అవుతుందన్న దశలో సెమీస్‌లో జట్టును ఆదుకున్న రషీద్, కెప్టెన్ యష్ ధుల్ (17: 32 బంతుల్లో, ఒక ఫోర్) మళ్లీ జట్టును ఆదుకున్నారు. వీరు మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించి లక్ష్యాన్ని మరింత చేరువ చేశారు. అయితే రెండు ఓవర్ల వ్యవధిలో రషీద్, ధుల్ ఇద్దరూ అయ్యారు. దీంతో టీమిండియా మరోసారి కష్టాల్లో పడింది.
అయితే ఈ దశలో నిషాంత్ సింధు (50 నాటౌట్: 54 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీసిన రాజ్ బవా (35: 54 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. లక్ష్యానికి చేరువ అయ్యాక రాజ్ బవా, కౌశల్ తాంబే (1: 9 బంతుల్లో) అవుట్ అయ్యారు. కానీ నిషాంత్, దినేష్ బనా (13: 5 బంతుల్లో, రెండు సిక్సర్లు) ఎటువంటి ఒత్తిడికి లోనవకుండా మ్యాచ్ ముగించారు.
వణికించిన పేసర్లు
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు తమ నిర్ణయం తప్పని తెలియడానికి ఎంతో సేపు పట్టలేదు. భారత పేస్ బౌలర్లు రాజ్ బవా, రవి కుమార్‌లు ఇంగ్లండ్‌ను వణికించారు. దీంతో 13 ఓవర్లలో 47 పరుగులకే ఇంగ్లండ్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇంగ్లండ్ కనీసం 100 పరుగులు అయినా చేస్తుందా అనే అనుమానాలు వచ్చాయి.
జేమ్స్ రూకు (95: 116 బంతుల్లో, 12 ఫోర్లు) కాసేపు సహకరించిన రెహాన్ అహ్మద్, అలెక్స్ హోర్టన్‌లు కూడా అవుట్ కావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ ఏడు వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. అయితే జేమ్స్ సేల్స్, జేమ్స్ రూ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు ఏకంగా 93 పరుగులు జోడించడం విశేషం. సెంచరీకి ఐదు పరుగుల ముంగిట జేమ్స్ రూ అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ ఆ తర్వాత వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది. 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది.