Ind vs SL 2nd T20I: సిరీస్ పై కన్నేసిన గబ్బర్ సేన... India vs Srilanka మధ్య రెండో T20 నేడే
శ్రీలంక పర్యటనలో భారత్ వరుసగా రెండో సిరీస్‌పై గురిపెట్టింది. తొలి పోరులో శ్రీలంకను చిత్తుచేసిన గబ్బర్ సేన రెండో మ్యాచ్‌లో నెగ్గి టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది.
శ్రీలంక పర్యటనలో భారత్ వరుసగా రెండో సిరీస్‌పై గురిపెట్టింది. తొలి పోరులో శ్రీలంకను చిత్తుచేసిన గబ్బర్ సేన రెండో మ్యాచ్‌లో నెగ్గి టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మంగళవారం జరిగే రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో టీమ్‌ఇండియా తలపడనుంది.
ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లకు విశ్రాంతినివ్వాలని జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయిస్తే తప్ప రెండో మ్యాచ్‌లో భారత జట్టులో మార్పులు చేయకపోవచ్చు. అయితే ఇద్దరు ఆటగాళ్లు మంగళవారం మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. ఈ పోరుతోనే సిరీస్ సొంతమైతే మూడో మ్యాచ్‌కు పృథ్వీ, సూర్యలకు విశ్రాంతినివ్వడం ఖాయం. జట్టు మేనేజ్‌మెంట్ మదిలో రెండో ఆలోచన ఉంటే ఈ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్‌లకు అవకాశం రావొచ్చు.
ఏదేమైనా ఇప్పుడు అందరి దృష్టి సంజు శాంసన్‌పైనే ఉంది. అద్భుతమైన ప్రతిభావంతుడిగా పేరున్న సంజు పొట్టి ఫార్మాట్‌లో తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. ఇప్పటి వరకు 8 టీ20 మ్యాచ్‌లాడిన సంజు 110 పరుగులే చేశాడు. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా రాణిస్తున్నాడు. ఇషాన్ కిషన్ అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. వికెట్ కీపర్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ద్రవిడ్ శిష్యుడు సంజు మిగిలిన రెండు మ్యాచ్‌ల్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ ఫామ్ టీమ్‌ఇండియాకు ఆందోళన కలిగిస్తోంది. తొలి మ్యాచ్‌లో సత్తాచాటిన భువనేశ్వర్ సారథ్యంలోని బౌలింగ్ విభాగంపై టీమ్‌ఇండియా ఆత్మవిశ్వాసంతో ఉంది.
రెండో టీ20కి భారత్ తుది జట్టు (అంచనా): శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా/ రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్/రుతరాజ్ గైక్వాడ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేందర్ చాహల్, వరుణ్ చక్రవర్తి.
చాహల్‌ని ఊరిస్తోన్న రికార్డు
భారత బౌలర్ యుజ్వేంద్ర చాహల్‌ను లంక గడ్డపై ఓ రికార్డు ఊరిస్తోంది. శ్రీలంక పై పొట్టి పార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలవడానికి అతడు కేవలం ఒకే ఒక వికెట్ దూరంలో ఉన్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్లో చాహల్ ఒక్క వికెట్ తీస్తే T20ల్లో లంకపై అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటికి 14 వికెట్లతో ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్ జోర్దాన్‌తో సమానంగా ఉన్నాడు. మరి ఈ రోజు మ్యాచ్లో చాహల్ ఒక్క వికెట్ తీసి తన పేరిట రికార్డు నమోదు చేస్తాడో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ రోజు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.