Rishabh Pant Test Record: 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన పంత్ - కేవలం 28 బంతుల్లోనే!
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొత్త రికార్డు సృష్టించాడు. కేవలం 28 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించాడు.
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో అత్యంత వేగంగా అర్థ సెంచరీ సాధించాడు. కేవలం 28 బంతుల్లోనే పంత్ అర్థ సెంచరీ సాధించడం విశేషం. ఇంతకుముందు రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉంది. ఆయన 30 బంతుల్లోనే 50 పరుగులు సాధించాడు. 1982లో పాకిస్తాన్‌తో కరాచీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో కపిల్ ఈ రికార్డు సాధించారు. దాదాపు 40 సంవత్సరాల పాటు సురక్షితంగా ఉన్న రికార్డును పంత్ బద్దలు కొట్టాడు.
అయితే అర్థ సెంచరీ చేసిన వెంటనే రిషబ్ పంత్ అవుటయ్యాడు. రెండో రోజు రెండో సెషన్ ముగిసేసరికి భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. దీంతో ఇప్పటికి మొత్తంగా 342 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.
శ్రేయస్ అయ్యర్ (18 బ్యాటింగ్: 25 బంతుల్లో, ఒక ఫోర్), రవీంద్ర జడేజా (10 బ్యాటింగ్: 19 బంతుల్లో, ఒక ఫోర్) క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో ప్రవీణ్ జయవిక్రమ మూడు వికెట్లు తీయగా... ధనంజయ డిసిల్వ, లసిత్ ఎంబుల్దెనియకు చెరో వికెట్ దక్కింది.
అంతకుముందు శ్రీలంక తొలి ఇన్సింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌట్ అయింది. ఏంజెలో మాధ్యూస్ (43: 85 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రాకు ఐదు వికెట్లు దక్కగా... అశ్విన్, షమిలకు రెండేసి వికెట్లు, అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది.
View this post on Instagram