Rohit Sharma: ఇంగ్లాండ్‌తో తొలి టీ20కి ముందు రోహిత్ సెన్సేషనల్ కామెంట్స్!!
IND vs ENG 1st T20: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొనే ప్రతి సిరీస్ ఆడతామని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అంటున్నాడు.
IND vs ENG 1st T20: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొనే ప్రతి సిరీస్ ఆడతామని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అంటున్నాడు. ఇంగ్లాండ్ సిరీసును సన్నాహకంగా తీసుకోవడం లేదని పేర్కొన్నాడు. మెగా టోర్నీకి ముందే అన్నీ సరిదిద్దుకోవాల్సి ఉంటుందని వెల్లడించాడు. ప్రతి మ్యాచూ తమకు ముఖ్యమేనని స్పష్టం చేశాడు. ఆంగ్లేయులతో తొలి టీ20 మ్యాచుకు ముందు హిట్‌మ్యాన్ మీడియాతో మాట్లాడాడు.
'నిజమే, మేం కచ్చితంగా ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుంటాం. ఇంగ్లాండ్ సిరీస్ అందుకు సన్నాహకమే అని నేను చెప్పను. భారత్ ఆడే ప్రతి మ్యాచ్ మాకు ముఖ్యమే. మేమిక్కడికి వచ్చి ప్రతి అంశాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాం. అన్నీ సవ్యంగా పూర్తి చేయాలని అనుకుంటున్నాం అంతే' అని రోహిత్ శర్మ అన్నాడు.
Also Read: అసలే బట్లర్ ఆపై కెప్టెన్ అయ్యాడు! హిట్‌మ్యాన్ ఆపగలడా?
ఐపీఎల్, రాష్ట్రాల తరఫున రాణించిన కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వడం తమ బాధ్యతని హిట్‌మ్యాన్ తెలిపాడు. అందుకు వారు అర్హులేనని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ సిరీస్ వారికి సవాలేనని అంచనా వేశాడు.
'అవును, దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు చాలా మంది కుర్రాళ్లకు వస్తున్నాయి. ఎందుకంటే వారు ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నారు. అవకాశాలకు వారు కచ్చితంగా అర్హులే. ఇంగ్లాండ్ జట్లుతో సిరీస్ మాకు సవాలే. కుర్రాళ్లు ఇక్కడికొచ్చి కాస్త సమయం గడిపారు. ముందుగా ఐర్లాండ్‌కు వెళ్లారు. ఇక్కడా ప్రాక్టీస్ మ్యాచులు ఆడారు. అందుకే మేమిప్పుడు ఈ సిరీస్ పట్ల ఆసక్తిగా ఉన్నాం. ఆ తర్వాత వన్డే సిరీస్ ఆడతాం' అని రోహిత్ అన్నాడు.
జమ్ము ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ టీమిండియా టీ20 ప్రణాళికల్లో ఉన్నాడని హిట్‌మ్యాన్ చెప్పాడు. జట్టు అవసరాలేంటో అతడు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొన్నాడు.
'అవును, మేం కచ్చితంగా కొత్త కుర్రాళ్లతో ప్రయోగాలు చేయాల్సిందే. అందులో ఉమ్రాన్ మాలిక్ ఒకడు. మేం ప్రపంచకప్‌పై కన్నేశాం. అందుకు అతడేం చేస్తాడో మేం చూడాలి. తన వేగంతో అతడు ఆసక్తి రేకెత్తిస్తున్నాడు. అందులో సందేహం లేదు. ఐపీఎల్‌లో మేమది గమనించాం. అతడికి బాధ్యతలు అప్పగించడమే కీలకం' అని పేర్కొన్నాడు.
Gearing up for the T20Is 💪#TeamIndia | #ENGvIND pic.twitter.com/YHqaaQ0G0R
— BCCI (@BCCI) July 6, 2022