Team India Schedule 2022: ఏడాదంతా క్రికెట్ పండగే! టీమ్‌ఇండియాకు వరుసగా కీలక సిరీసులు.. ప్రపంచకప్
కోహ్లీ ,రోహిత్ నాయకత్వంలోని జట్లు విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఐసీసీ ట్రోఫీ దక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ ఏడాది టీమ్‌ఇండియాకు ఏయే సిరీసులు ఉన్నాయింటే?
Team India Full Schedule 2022: కొత్త సంవత్సరం వచ్చేసింది. 2022కు టీమ్‌ఇండియా ఘనంగా స్వాగతం పలికింది. ఎప్పటిలాగే ఈ ఏడాదీ అభిమానులకు పండగే! సంవత్సరం పొడవుగా క్రికెట్ సంబరాలు కొనసాగుతూనే ఉంటాయి. అంతర్జాతీయ క్రికెట్ సిరీసులతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లు క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేయనున్నాయి.
కోహ్లీ సారథ్యంలోని టెస్టు జట్టు, రోహిత్ నాయకత్వంలోని పరిమిత ఓవర్ల జట్టు పోటాపోటీగా విజయాలు సాధించాలని అంతా కోరుకుంటున్నారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఐసీసీ ట్రోఫీ దక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ ఏడాది టీమ్‌ఇండియాకు ఏయే సిరీసులు ఉన్నాయింటే?
దక్షిణాఫ్రికా పర్యటన
ఇప్పటికే దక్షిణాఫ్రికాలో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు గెలిచింది. జొహానెస్ బర్గ్‌లో జనవరి 3-7 రెండో టెస్టు, కేప్‌టౌన్‌లో 11-15 మధ్య మూడో టెస్టు ఉన్నాయి. జనవరి 19, 21, 23న వరుసగా వన్డేలు ఉన్నాయి.
భారత్‌కు వెస్టిండీస్
దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన వెంటనే టీమ్‌ఇండియా స్వదేశానికి వచ్చేస్తుంది. వెస్టిండీస్ భారత్ పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో రెండు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాయి. ఫిబ్రవరి 6, 9, 12న అహ్మదాబాద్, జైపుర్, కోల్‌కతాలో మూడు వన్డేలు జరుగుతాయి. ఫిబ్రవరి 15, 18, 20న కటక్, విశాఖ పట్నం, త్రివేండ్రంలో పొట్టి క్రికెట్ మ్యాచులు ఉంటాయి.
శ్రీలంకతో టెస్టు, టీ20లు
వెస్టిండీస్‌తో సిరీసు ముగియగానే శ్రీలంక భారత్‌కు వచ్చేస్తుంది. రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు తొలి టెస్టు జరుగుతుంది. మార్చి 5-9 మొహాలిలో రెండో టెస్టు ఉంటుంది. 13న అక్కడే తొలి టీ20 జరుగుతుంది. మార్చి 15, 18న ధర్మశాల, లఖ్‌నవూలో పొట్టి క్రికెట్ మ్యాచులు ఉంటాయి.
ఐపీఎల్ పండగ
ఏప్రిల్, మేలో టీమ్‌ఇండియాకు ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్ సిరీసులు ఉండవు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలవుతుంది. ఈ సారి పది జట్లతో లీగ్ కళకళలాడనుంది.
భారత్‌కు దక్షిణాఫ్రికా
జూన్‌లో సఫారీ సేన భారత్‌లో అడుగుపెడుతుంది. ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది. జూన్ 9, 12, 14, 17, 19న చెన్నై, బెంగళూరు, నాగ్‌పుర్, రాజ్‌కోట్, దిల్లీలో మ్యాచులు ఉంటాయి.
మళ్లీ ఇంగ్లాండ్‌కు
జూన్‌లోనే టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌లో అడుగు పెడుతుంది. గతేడాది కొవిడ్ వల్ల నిలిచిపోయిన ఆఖరి టెస్టును ఆడనుంది. జులై 7, 9, 10న సౌథాంప్టన్, బర్మింగ్ హామ్, నాటింగ్‌హామ్‌లో టీ20 మ్యాచులు ఆడుతుంది. జులై 12, 14, 17న లండన్, మాంచెస్టర్‌లో వన్డేల్లో తలపడుతుంది.
టీ20 ప్రపంచకప్
అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియాలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ జరుగుతుంది. ఈ టోర్నీకి ముందు టీమ్‌ఇండియా వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఆసియాకప్ ఆడనుంది. తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ప్రపంచకప్ తర్వాత జరిగే బంగ్లా పర్యటన తేదీలూ ఇంకా ఖరారు చేయలేదు.