IND vs ENG, 1st Test: ఐదో రోజు బ్యాటింగ్ చేసిన వరుణుడు.. ఫస్ట్ టెస్టు మ్యాచ్ డ్రా.. భారత్‌కి చేజారిన ఛాన్స్
India vs England,1st Test:
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజు టీమ్‌ఇండియా విజయానికి 157 పరుగులే అవసరమైనా వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడలేదు.
భారత్, ఇంగ్లాండ్ మధ్య నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ఆదివారం డ్రాగా ముగిసింది. 209 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా శనివారం ఆట ముగిసే సమయానికి 52/1తో నిలవగా.. విజయానికి ఇంకా 157 పరుగులు చేయాల్సి ఉంది. అప్పటికి క్రీజులో రోహిత్ శర్మ (12 బ్యాటింగ్: 34 బంతుల్లో), చతేశ్వర్ పుజారా (12 బ్యాటింగ్: 13 బంతుల్లో 3x4). కానీ.. మ్యాచ్‌లో చివరి రోజైన ఆదివారం వర్షం కారణంగా కనీసం ఒక బంతి కూడా పడలేదు. ఈ కారణంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఆదివారం మ్యాచ్ ప్రారంభం కోసం చివరి సెషన్ వరకూ ఎదురుచూశారు. తప్పనిసరి పరిస్థితుల్లో అంపైర్లు చివరి రోజు ఆటను రద్దు చేశారు. ఇండియా విజయం సాధించాల్సిన తొలి టెస్టు డ్రాతో తుడిచి పెట్టుకుపోయింది.
ఇంగ్లాండ్ శనివారం రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (109; 172 బంతుల్లో 14x4)శతకంతో చెలరేగాడు. మరోవైపు భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు తీయగా సిరాజ్, శార్ధూల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. షమి ఒక వికెట్ తీశాడు. అనంతరం టీమ్‌ఇండియా 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజు 52/1తో నిలిచింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (26; 38 బంతుల్లో 6x4) ఔటైనా రోహిత్ శర్మ (12; 34 బంతుల్లో), చెతేశ్వర్ పుజారా (12; 13 బంతుల్లో 3x4) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.
ఇక చివరి రోజు భారత విజయానికి 157 పరుగులే అవసరం ఉంది. కానీ వరుణుడు అడ్డుగా మారాడు. ఈ కారణంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 183 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లోనూ రూట్ (64; 108 బంతుల్లో 4x4) హఫ్ సెంచరీతో రాణించాడు. ఆపై భారత్ తొలి ఇన్నింగ్స్ ఆడగా 278 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (84: 214 బంతుల్లో 12x4), రవీంద్ర జడేజా (56: 86 బంతుల్లో 8x4, 1x6) అర్ధశతకాలతో రాణించారు. ఇంగ్లిష్ బౌలర్లలో రాబిన్‌సన్ ఐదు, అండర్సన్ నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 95 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ఆదివారం భారత్ గెలుపు ఖాయమని అంతా ఊహించారు. కానీ.. వరుణుడు దెబ్బతీశాడు.
- ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 183 ఆలౌట్: జో రూట్ 64, బుమ్రా 4 వికెట్లు
- భారత్ తొలి ఇన్నింగ్స్: 278 ఆలౌట్: కేఎల్ రాహుల్ 84, రాబిన్‌సన్ 5 వికెట్లు
- ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 303 ఆలౌట్; జో రూట్ 109, బుమ్రా 5 వికెట్లు
- భారత్ రెండో ఇన్నింగ్స్: 52/1: కేఎల్ రాహుల్ 26, బ్రాడ్ 1 వికెట్