IND vs ENG 1st ODI: చితక్కొట్టిన హిట్‌మ్యాన్! 18.4 ఓవర్లకే టీమ్‌ఇండియా గ్రేట్ విక్టరీ
IND vs ENG, 1st ODI, The Oval Stadium: గెలుపంటే ఇదీ! అన్నట్టుగా చెలరేగింది టీమ్‌ఇండియా. ఆంగ్లేయులకు తమ సొంతగడ్డపైనే కనీవినీ ఎరగని పరాభవం రుచిచూపించింది.
IND vs ENG, 1st ODI, The Oval Stadium: గెలుపంటే ఇదీ! అన్నట్టుగా చెలరేగింది టీమ్‌ఇండియా. ఆంగ్లేయులకు తమ సొంతగడ్డపైనే కనీవినీ ఎరగని పరాభవం రుచిచూపించింది. మొదట జస్ప్రీత్ బుమ్రా (6/19), మహ్మద్ షమి (3/31) దెబ్బకు ఇంగ్లాండ్ కేవలం 25.2 ఓవర్లకే 110 పరుగులకే కుప్పకూలింది. చరిత్రలోనే టీమ్‌ఇండియా చేతిలో అత్యల్ప స్కోరుకు ఆలౌటైంది. జోస్ బట్లర్ (30; 32 బంతుల్లో 6x4), డేవిడ్ విలే (21; 26 బంతుల్లో 3x4) టాప్ స్కోరర్లంటేనే మన బౌలర్ల అటాక్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు! ఆ తర్వాత రోహిత్ శర్మ (76; 58 బంతుల్లో 7x4, 5x6), శిఖర్ ధావన్ (31; 54 బంతుల్లో 4x4) ఇద్దరే కలిసి 10 వికెట్ల తేడాతో గెలిపించేశారు. విజయం కోసం కేవలం 18.4 ఓవర్లే తీసుకున్నారు.
ఫామ్‌లోకి హిట్‌మ్యాన్
ఎదురుగా 111 పరుగుల స్వల్ప లక్ష్యం! ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పరుగుల వరదకు అనుకూలించే పిచ్! ఇంకేముంది టీమ్‌ఇండియా సునాయాసంగా టార్గెట్ ఛేదించేసింది. టీ20 సిరీసులో ఫామ్‌లోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) దూకుడుగా ఆడాడు. 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. సొగసైన బౌండరీలు, కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు. చాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన శిఖర్ ధావన్ (Shikar Dhawan) ఆచితూచి ఆడాడు. హిట్‌మ్యాన్‌కే ఎక్కువ స్ట్రైక్ అందించాడు. సెకండ్ ఫెడల్ ప్లే చేశాడు. దాంతో 10 ఓవర్లకు ముందే టీమ్‌ఇండియా స్కోరు 50కి చేరుకుంది. ఆ తర్వాత వికెట్ పడకుండా జట్టును గెలుపు తీరానికి చేర్చారు.
ఇంగ్లాండ్‌కు అత్యల్ప స్కోరు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు టీమ్‌ఇండియా పేసర్లు చుక్కలు చూపించారు. చల్లని వాతావరణం, పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. కఠినమైన లైన్ అండ్ లెంగ్తుల్లో బంతులేశారు. బంతి అందుకున్న క్షణం నుంచే జస్ప్రీత్ బుమ్రా ప్రత్యర్థులను భయపెట్టేశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ జేసన్ రాయ్, జో రూట్‌ను డకౌట్ చేసేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే బెన్‌స్టోక్స్‌ను పరుగుల ఖాతా తెరవకముందే మహ్మద్ షమీ ఔట్ చేశాడు. దాంతో 7 పరుగులకే ఆ జట్టు 3 వికెట్లు చేజార్చుకుంది.
టాప్-4లో ముగ్గురు డకౌట్ కావడం ఇంగ్లాండ్ చరిత్రలో ఇది రెండోసారి. ఆ తర్వాతా పతనం ఇలాగే కొనసాగింది. 17 స్కోర్ వద్ద బెయిర్‌స్టో (7)ను బుమ్రాయే పెవిలియన్ చేర్చాడు. లియామ్ లివింగ్ స్టన్ (0)ను అతడే ఔట్ చేశాడు. కీలకమైన బట్లర్, ఓవర్టన్‌ను షమి పెవిలియన్‌కు పంపాడు. మొయిన్ అలీ (14) వికెట్ ప్రసిద్ధ్‌కు దక్కింది. దాంతో 103 పరుగులకే ఇంగ్లాండ్ 9 వికెట్లు నష్టపోయింది. ఆఖర్లో కేర్స్ (15)ను ఔట్ చేసి బుమ్రా ఆరు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఆంగ్లేయులకు భారత్‌పై ఇదే అత్యల్ప స్కోరు.
110 all out.
— England Cricket (@englandcricket) July 12, 2022
Bumrah takes six.
Scorecard/clips: https://t.co/CqRVzsJNwk
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/dzC4nynFQI