ENG vs AUS, Match Highlights: జోస్ బట్లర్ షో.. ఆస్ట్రేలియాపై ఎనిమిది వికెట్లతో ఇంగ్లండ్ విజయం!
ICC T20 WC 2021, ENG vs AUS: ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్లతో విజయం సాధించింది.
టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో కేవలం 125 పరుగులకు ఆలౌటయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జోస్ బట్లర్ (71 నాటౌట్: 32 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 11.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. క్రిస్ జోర్డాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
దారుణంగా ఆసీస్ బ్యాటింగ్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు మొదట్లోనే చాలా ఎదురుదెబ్బలు తగిలాయి. రెండో ఓవర్లలో వార్నర్ (1: 2 బంతుల్లో), మూడో ఓవర్లో స్మిత్ (1: 5 బంతుల్లో), నాలుగో ఓవర్లో మ్యాక్స్‌వెల్ (6: 9 బంతుల్లో) అవుట్ కావడంతో ఆస్ట్రేలియా 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. వీరిలో వార్నర్, మ్యాక్స్‌వెల్‌ల వికెట్లు క్రిస్ వోక్స్‌కు దక్కగా.. స్మిత్‌ను క్రిస్ వోక్స్ అవుట్ చేశాడు. ఫించ్ (44: 49 బంతుల్లో, నాలుగు ఫోర్లు) నెమ్మదిగా ఆడటంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 21 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత ఏడో ఓవర్లో స్టోయినిస్ (0: 4 బంతుల్లో)ను ఆదిల్ రషీద్ అవుట్ చేశాడు. పరుగుల వేగం మరింత మందగించింది. మొదటి 10 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 41 పరుగులను మాత్రమే ఆస్ట్రేలియా చేయగలిగింది.
వేడ్ (18: 18 బంతుల్లో, రెండు ఫోర్లు), అస్టిన్ అగర్ (20: 20 బంతుల్లో, రెండు సిక్సర్లు), ప్యాట్ కుమిన్స్ (12: 3 బంతుల్లో, రెండు సిక్సర్లు), స్టార్క్ (13: 6 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కాస్త మెరుగ్గా ఆడటంతో చివరి 10 ఓవర్లలో ఆస్ట్రేలియా 84 పరుగులు చేసింది. అయితే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే ఉండటంతో 20 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీయగా, క్రిస్ వోక్స్, టైమల్ మిల్స్ రెండేసి వికెట్లు తీశారు. లివింగ్ స్టోన్, ఆదిల్ రషీద్‌లకు చెరో వికెట్ దక్కింది.
ఆస్ట్రేలియాను ఆడుకున్న బట్లర్
126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జోస్ బట్లర్ (71 నాటౌట్: 32 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు) చెలరేగి ఆడటంతో లక్ష్యఛేదన సులభం అయిపోయింది. జోస్ బట్లర్, జేసన్ రాయ్ (22: 20 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్).. వికెట్ ఇవ్వకుండా ఆడటంతో పవర్ ప్లే ఆరు ఓవర్లలోనే 66 పరుగులు చేసింది. తర్వాత రాయ్, మలన్(8: 8 బంతుల్లో, ఒక ఫోర్) అవుటైనా.. జానీ బెయిర్ స్టో (16: 11 బంతుల్లో, రెండు సిక్సర్లు)తో కలిసి బట్లర్ 11.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాడు.
Also Read: IPL 2022 Retention Rules: కొత్త రూల్స్ ఇవే! ఐపీఎల్ జట్లు ఎంతమందిని అట్టిపెట్టుకోవచ్చంటే..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి