Hockey Junior World Cup: రిక్త హస్తాలతో వెనుదిరిగిన యువ భారత్ , కాంస్య పతకపోరులోనూ తప్పని ఓటమి
Hockey Junior World Cup: పురుషుల జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో భారత్ రిక్తహస్తాలతో వెనుదిరిగింది. కాంస్య పతక పోరులోనూ యువ భారత్ చేతులెత్తేసింది.
పురుషుల జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో భారత్ రిక్తహస్తాలతో వెనుదిరిగింది. కాంస్య పతక పోరులోనూ యువ భారత్ చేతులెత్తేసింది. పటిష్టమైన స్పెయిన్ చేతిలో 1-3 తేడాతో పరాజయం పాలై వెనుదిరిగింది. 2021లో జరిగిన జూనియర్ హాకీ వరల్డ్‌కప్‌లోనూ నాలుగోస్థానంతోనే సరిపెట్టుకున్న యువ భారత్.. ఈసారి అదే స్థానంతో వెనుదిరిగింది. చివరిసారిగా 2016లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.
జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో మూడోసారి కప్పు అందుకోవాలన్న యువ భారత్ ఆశలు ఈసారి కలలుగానే మిగిలిపోయాయి. అద్భుత విజయాలతో సెమీస్ వరకు వచ్చిన టీమిండియా... కీలకమైన మ్యాచ్‌లో చేతులెత్తేసింది. సెమీఫైనల్లో పటిష్టమైన జర్మనీ ముందు నిలవలేక పోయింది. కప్పు కలను నెరవేర్చుకునే క్రమంలో అడుగు దూరంలోనే ఆగిపోయింది. పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలో దారుణంగా విఫలమైన టీమిండియా.. సెమీస్‌లో 1-4తో జర్మనీ చేతిలో చిత్తుగా ఓడింది. ఆట ఆరంభమైన కాసేపటికే జర్మనీ ఆటగాడు బెన్ హస్బాచ్ గోల్ చేశాడు. దీంతో జర్మనీ 0-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ భారత ఆటగాడు సుదీప్ చిర్మకో 11 వ నిమిషంలో గోల్ సాధించి భారత్‌కు శుభారంభం అందించాడు. ఈ గోల్‌తో స్కోర్లు 1-1తో సమం అయ్యాయి. కానీ 30 వ నిమిషంలో జర్మనీ తరఫున బెన్ హస్బాచ్ మరో గోల్ చేయగా... పాల్ గ్లాండెర్ 41వ నిమిషంలో.. ఫ్లోరియన్ స్పెర్లింగ్ 58వ నిమిషంలో గోల్స్ చేశారు. ఈ గోల్స్‌తో జర్మనీ 4-1తో తిరుగులేని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లు భారత్‌కు 12 పెనాల్టీ కార్నర్‌లు లభించగా ఒక్క కూడా గోల్ కూడా కొట్టలేకపోయారు. కానీ జర్మనీ తనకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్‌గా మలిచింది. జర్మనీ జట్టు ప్రత్యర్థికి బంతి దొరక్కుండా వ్యూహాత్మకంగా ఆడింది. ఈ ఏడాది జర్మనీతో ఆడిన ఐదో మ్యాచ్‌లోనూ భారత్‌కు ఓటమే ఎదురైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ముచ్చటగా మూడోసారి కప్పు సాధించాలన్న భారత కల కలగానే మిగిలిపోయింది.
జూనియర్ వరల్డ్‌కప్ హాకీలో ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పటిష్టమైన నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యువ భారత్ ప్రదర్శన అబ్బురపరిచింది. ఆరంభంలో నెదర్లాండ్స్ దూకుడు ముందు తేలిపోయిన భారత యువ ఆటగాళ్లు కీలక సమయంలో పుంజుకుని 4-3తో విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో యువ భారత్ విజయం కష్టమని చాలామంది అంచనా వేయగా... బలమైన నెదర్లాండ్స్‌ను టీమిండియా ఓడించింది. ప్రత్యర్థి రక్షణ శ్రేణి ఎంత బలంగా ఉన్నా చొచ్చుకుపోయే సత్తా కలిగిన జట్టు నెదర్లాండ్స్‌ను ఓడించిన యువ భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్‌లో యువ భారత్- నెదర్లాండ్స్ హోరాహోరీగా తలపడ్డాయి. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన నెదర్లాండ్స్ అయిదో నిమిషంలోనే గోల్ చేసి టీమిండియాకు షాక్ ఇచ్చింది.
44వ నిమిషంలో నెదర్లాండ్స్ ఆటగాడు ఒలివర్ గోల్ చేయడంతో డచ్ జట్టు మళ్లీ 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మరో ఎనిమిది నిమిషాలకు సౌరభ్ కుష్యాహా చేసిన అద్భుత గోల్‌తో భారత్ స్కోరును 3-3తో సమం చేసింది. ఇక సమయం ముగుస్తుందనుకున్న దశలో భారత కెప్టెన్ ఉత్తమ్‌సింగ్ గోల్ చేసి టీమిండియాను 4-3తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఈ గోల్ తర్వాత నెదర్లాండ్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మరో గోల్ సాధించలేకపోయింది. ఓటమి ఖాయమనుకున్న దశలో జూనియర్ హాకీ జట్టు అద్భుత విజయంతో సెమీస్‌లోకి చేరింది. కానీ సెమీస్‌లో బలమైన జర్మనీ చేతిలో పరాజయం పాలైంది.