Harmanpreet Kaur: జ్వరంలో కూడా తీవ్రంగా పోరాడినా భారత కెప్టెన్ - ఆ ఒక్క తప్పు జరగకుండా ఉంటే?
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ జ్వరంతో కూడా భారీ ఇన్నింగ్స్ ఆడింది.
WT20 WC SF, Harmanpreet Kaur: మహిళల టీ20 ప్రపంచకప్ గెలవాలన్న టీమిండియా కల చెదిరిపోయింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఐదు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 173 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అర్థ సెంచరీ సాధించింది. కేవలం 34 బంతుల్లోనే 52 పరుగులు చేసింది. ఇందులో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్లు కూడా ఉన్నాయి. హర్మన్ ప్రీత్ కౌర్‌తో పాటు జెమీమా రోడ్రిగ్స్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడింది. తను 24 బంతుల్లోనే 43 పరుగులు కొట్టింది. ఇందులో ఆరు ఫోర్లు కూడా ఉన్నాయి. అయితే టీమ్ ఇండియా లక్ష్యానికి ఐదు పరుగుల దూరంలో ఆగిపోయింది.
మ్యాచ్‌లో కీలకమైన సమయంలో హర్మన్ ప్రీత్ కౌర్ అనుకోని విధంగా రనౌట్ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. నిజానికి అప్పటి వరకు మ్యాచ్ టీమిండియా చేతిలోనే ఉంది. రెండు పరుగులు సులభంగా పూర్తి చేసేలా కనిపించినప్పటికీ ఆఖరి క్షణంలో బ్యాట్ క్రీజు బయట స్టక్ అవ్వడంతో హర్మన్ ప్రీత్ వెనుదిరగాల్సి వచ్చింది.
జ్వరంతో కూడా అదరగొట్టిన హర్మన్ ప్రీత్
ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అసలు ఆడటమే అనుమానాస్పదంగా పరిగణించబడింది. నిజానికి భారత కెప్టెన్ జ్వరంతో బాధపడుతోంది. కానీ జ్వరం తనను మ్యాచ్ నుంచి దూరం చేయలేక పోయింది. హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్‌లో ఆడడమే కాకుండా కంగారూ బౌలర్లను భారీ షాట్లు కూడా కొట్టింది.
మరోవైపు ఐసీసీ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆధిపత్యం నిరంతరం కనిపిస్తూనే ఉంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఐదు పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి వరుసగా ఏడో సారి ఫైనల్‌కు చేరుకుంది. గత టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించి ఆస్ట్రేలియా మహిళల జట్టు కప్ గెలుచుకుంది.
2009లో తొలి టీ20 ప్రపంచకప్ ఆడినప్పుడు సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీని తర్వాత 2010 టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ఆటతీరుతో తొలిసారి ఫైనల్స్‌కు చేరుకుని ఆ తర్వాత కప్ గెలుచుకుంది.
దీని తర్వాత ఆస్ట్రేలియా జట్టు 2012, 2014 సంవత్సరాల్లో కూడా మహిళల టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. 2016 టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్‌కు చేరుకుంది. అయితే వెస్టిండీస్ మహిళల జట్టు చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. 2018, 2020ల్లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో మరోసారి ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శన కనబర్చి కప్‌ను కైవసం చేసుకుంది.
ఇప్పుడు ఆస్ట్రేలియన్ జట్టు ఫైనల్లో ఏ జట్టుతో తలపడుతుందనేది దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత తేలిపోనుంది. ఈ టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 26వ తేదీన జరగనుంది.
హర్మన్‌ప్రీత్ కౌర్ కేవలం 34 బంతుల్లోనే 52 పరుగులు చేసింది. తన ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్ కూడా ఉంది. అయినా భారత జట్టు మ్యాచ్‌ను గెలవలేకపోయింది. కానీ హర్మన్‌ప్రీత్ కౌర్ ధైర్యం ఆస్ట్రేలియాను భయపెట్టింది. టీమ్ ఇండియా ఓటమి పాలైనప్పటికీ, సోషల్ మీడియాలో అభిమానులు హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.