Hanuma Vihari: కెరీర్‌నే రిస్క్ చేసిన హనుమ విహారి - ఎందుకో చెప్పేశాడు!
తన కెరీర్‌ను కూడా పణంగా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో హనుమ విహారి చెప్పాడు.
![Hanuma Vihari: కెరీర్‌నే రిస్క్ చేసిన హనుమ విహారి - ఎందుకో చెప్పేశాడు! Hanuma Vihari: Physio advised Hanuma not to bat after getting injured know why he put his career at stake Hanuma Vihari: కెరీర్‌నే రిస్క్ చేసిన హనుమ విహారి - ఎందుకో చెప్పేశాడు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/02/02b2e51570ed911fdf200288e0db06d51675356472568265_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hanuma Vihari on his Fractured Wrist: రంజీ ట్రోఫీ 2022-23 నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ కెప్టెన్ హనుమ విహారి విరిగిన మణికట్టుతో బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. ఆంధ్ర, మధ్యప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మణికట్టు విరగడంతో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ చేతిలో హనుమ విహారి గాయపడ్డాడు. ఇప్పుడు ఫిజియో తనను బ్యాటింగ్ చేయవద్దని చెప్పారని విహారి వెల్లడించాడు.
బ్యాటింగ్‌కు వెళ్లే ముందు ఫిజియో ఎలా చెప్పాడనే దాని గురించి విహారి చెప్పాడు, ‘నేను బ్యాటింగ్‌కు వెళితే, నా కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఫిజియో హెచ్చరించారు.’ అని తెలిపాడు. అయితే దీని తర్వాత కూడా బ్యాటింగ్ కోసం మైదానంలోకి వచ్చిన హనుమ విహారి ఎడమచేతి వాటం బ్యాటింగ్ చేశాడు.
ఈ విషయమై హనుమ విహారి మాట్లాడుతూ, 'నేను బ్యాటింగ్‌కు వెళ్లాలని చెప్పినప్పుడు, మళ్లీ ఆ చేతికి తగిలితే నా కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఫిజియో 10 సార్లు చెప్పారు.’ అన్నారు. అయితే దానికి సమాధానంగా ఫిజియోతో 'ఈ మ్యాచ్ తర్వాత క్రికెట్ ఆడకపోయినా పర్వాలేదు, కానీ ఈ మ్యాచ్‌లో ఆంధ్ర కోసం బరిలోకి దిగకపోతే, ఆ బాధ ఎప్పటికీ నా గుండెల్లో ఉంటుంది' అని చెప్పాను.
ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులు చేసింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో తడబడిన ఆ జట్టు 100 పరుగుల మార్కును కూడా దాటలేకపోయింది. ఆ జట్టు కేవలం 93 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 245 పరుగుల లక్ష్యాన్ని మధ్యప్రదేశ్ ఐదు వికెట్ల నష్టానికి ఛేదించింది.
తొలి ఇన్నింగ్సులో 37 బంతుల్లో 16 పరుగులతో ఉన్నప్పుడు విహారి మణికట్టు విరిగింది. దాంతో అతడు స్కానింగ్‌కు వెళ్లాడు. వైద్యులు మణికట్టులో చీలిక వచ్చిందని వెల్లడించారు. నాలుగు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాంతో జట్టు యాజమాన్యం అతడితో అవసరమైతే తప్ప బ్యాటింగ్ చేయించొద్దని భావించింది.
తొలి ఇన్నింగ్సులో రికీ భుయ్ (149), కరణ్ షిండె (110) సెంచరీలు చేయడంతో ఆంధ్రా 323/2తో పటిష్ఠ స్థితిలో కనిపించింది. వారిద్దరూ ఔటయ్యాక వెంటవెంటనే వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. 328/4తో ఉన్న జట్టు 353/9కు చేరుకుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విరిగిన చేత్తోనే హనుమ విహారీ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఎడమ చేతి స్టాన్స్ తీసుకొని ఒక్క కుడి చేత్తోనే బంతులు ఎదుర్కొన్నాడు. నంబర్ 9 ఆటగాడు లలిత్ మోహన్‌తో కలిసి దాదాపుగా పది ఓవర్లు ఆడిన అతడు 26 పరుగులు చేసి లంచ్‌కు వెళ్లాడు. విరామం తర్వాత ఆడిన మొదటి బంతికే 27 పరుగులకు ఎల్బీ అయ్యాడు.
జట్టు కోసం మరోసారి గాయంతోనే బరిలోకి దిగానని హనుమ విహారి అన్నాడు. ఎప్పుడూ ఓటమిని అంగీకరించొద్దని వెల్లడించాడు. అభినందనలు తెలియజేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. సినీ నటి సయామీ సైతం అతడిని అభినందించింది. 'అతడి మణికట్టు విరిగింది. అయితే ఒంటిచేత్తోనే బ్యాటింగ్ చేశాడు. గొప్ప యోధుడు! హనుమ విహారి ఆస్ట్రేలియాలోని క్రీడాస్ఫూర్తినే రంజీ మ్యాచులోనూ చూపించాడు' అని ట్వీట్ చేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)