Gukesh: చరిత్ర సృష్టించిన గుకేశ్, మురిసిపోతున్న చెస్ ప్రపంచం
Candidates Chess 2024: భారత యువ సంచలనం గుకేశ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సంచలన ప్రదర్శనతో ఫిడే క్యాండిడేట్స్ టోర్నీలో విజయం సాధించాడు.
Gukesh Emerges Youngest Candidates Winner: భారత యువ సంచలనం గుకేశ్(Gukesh) సరికొత్త చరిత్ర సృష్టించాడు. కెనడా వేదికగా జరిగిన ఫిడే క్యాండిడేట్స్ చెస్(Candidates Chess 2024) టోర్నీలో టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్లకే ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్ దక్కించుకున్న అతిపిన్న వయస్కుడిగా గుకేశ్ రికార్డుల్లోకెక్కాడు.
13వ రౌండ్ నాటికి మొత్తం 8.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచిన అతడు.. అమెరికాకు చెందిన హికరు నకమురతో జరిగిన 14వ రౌండ్‌ను డ్రా చేసుకున్నాడు. దీంతో అతడి ఖాతాలో 9 పాయింట్లు చేరాయి. నెపోమ్నియాషి (రష్యా) - ఫాబియానో కరువానా (అమెరికా) మధ్య మ్యాచ్ కూడా డ్రా అయింది. వారిద్దరూ 8.5 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో భారత యువ చెస్ ప్లేయర్ గుకేశ్ టైటిల్‌ను సాధించాడు. ఈ విజయంతో ప్రపంచ చాంపియన్ టైటిల్ పోరుకు అర్హత సాధించిన రెండో భారతీయుడిగా, మొదటి టీనేజర్‌గా గుకేశ్ నిలిచాడు.
చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫిడే క్యాండిడేట్స్ టైటిల్‌ను నెగ్గిన రెండో భారత ఆటగాడిగా గుకేశ్ నిలిచాడు. క్లాసికల్ వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్‌తో తలపడనున్నాడు. అందులోనూ విజయం సాధిస్తే అతి పిన్న వయస్సులో ఛాంపియన్‌గా నిలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. గతంలో మాగ్నస్ కార్ల్‌సన్, కాస్పరోవ్ 22 ఏళ్ల వయసులో ఛాంపియన్లుగా నిలిచారు. అంతకు ముందు ఈక్లాసికల్ వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్ టోర్నికి భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ క్వాలిఫై అయ్యారు.
గుకేశ్ నువ్వో అద్భుతం: విశ్వనాథన్ ఆనంద్
అత్యంత పిన్న వయస్కుడిగా క్యాండిడేట్స్ టోర్నీ టైటిల్ గెలిచిన గుకేశ్‌కు విశ్వనాథన్ ఆనంద్(Viswanadhan Anand) శుభాకాంక్షలు తెలిపాడు. చెస్ కుటుంబమంతా గుకేశ్ ఘనతకు గర్వపడుతోందని అన్నాడు. క్లిష్టపరిస్థితులను ఎదుర్కొని విజేతగా నిలవడం అభినందనీయమని ఆనంద్ పొగడ్తల వర్షం కురిపించారు. గుకేశ్ 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించి.. గతేడాది ఆనంద్‌ను వెనక్కి నెట్టి భారత్ టాప్ చెస్ ర్యాంకర్‌గా నిలిచాడు.
అప్పుడు ఆనంద్- ఇప్పుడు గుకేశ్..
ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ 2014లో ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టైటిల్ నెగ్గిన పదేళ్ల తరువాత గుకేశ్ అదే ఘనతను సాధించగలిగాడు. టాప్ సీడ్ ఫేబియానో కరూనా- రష్యన్ గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నెపోమినిచ్ ల ఆఖరి రౌండ్ గేమ్ డ్రాగా ముగియడం, నకామురాతో పోరును గుకేశ్ డ్రాగా ముగించడంతోనే ఫలితం తేలిపోయింది. 12 సంవత్సరాల చిరుప్రాయంలోనే గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన చెన్నైకు చెందిన గుకేశ్ ప్రపంచ క్యాండిడేట్స్ టైటిల్ నెగ్గడం ద్వారా ప్రపంచ రికార్డుతో సరికొత్త చరిత్ర సృష్టించడంతో పాటు..2025 ప్రపంచ చెస్ టైటిల్ గెలుచుకొనే అవకాశాన్ని సంపాదించాడు. గుకేశ్ సాధించిన ఈ ఆపురూప విజయం చూసి భారత చదరంగ అభిమానులు మురిసిపోతున్నారు. సందేశాలతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.