IND vs Eng: ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కి నరకం చూపించాలి... రెండో ఇన్నింగ్స్‌కి ముందు జట్టుతో కోహ్లీ
లార్డ్స్‌లో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే ముందు టీమిండియా ఆటగాళ్లతో కోహ్లీ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య లార్డ్స్ వేదికగా భారత్Xఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు ముగిసింది. తాజాగా లార్డ్స్‌లో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే ముందు టీమిండియా ఆటగాళ్లతో కోహ్లీ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ‘ఈ 60 ఓవర్లలో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు నరకం కనబడాలి' అంటూ కోహ్లీ ఎంతో కసిగా టీమిండియా ఆటగాళ్లకు సూచించాడు.
— pant shirt fc (@pant_fc) August 16, 2021
కోహ్లీ చెప్పినట్లుగానే భారత పేసు దళం ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ పై నిప్పులు చెరిగింది. దీంతో నిజంగానే ప్రత్యర్థులు నరకం చూశారు. బుల్లెట్లలా దూసుకొచ్చే ఒక్కో బంతిని ఎదుర్కొలేక ఇంగ్లీష్ జట్టు 120 పరుగులకే కుప్పకూలడంతో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో కోహ్లీ సేన విజయంతో బోణీ కొట్టింది. ఆఖరి రోజు ఆటలో మొదట బ్యాటింగ్‌లో మెరిసిన మన పేసర్లు(షమీ, బుమ్రా) తిరిగి బౌలింగ్‌లోనూ రాణించడంలో కీలకపాత్ర పోషించారు. దీంతో లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి, 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
చివరి రోజు సోమవారం ఆటలో టీమిండియా టెయిలెండర్లు షమీ(70 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) అద్భుత పోరాట పటిమ కనబర్చడంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 298 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో చివరి రెండు సెషన్లలో భారత విజయానికి 10 వికెట్ల అవసరమవ్వగా.. ఇంగ్లండ్ గెలవాలంటే 60 ఓవర్లలో 272 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మైదానంలోకి దిగే ముందు కెప్టెన్ కోహ్లి జట్టు సభ్యులతో మాట్లాడాడు. తన మోటివేషనల్ స్పీచ్‌తో సహచరుల్లో స్పూర్తిని రగిలించాడు. ఈ 60 ఓవర్లు ఇంగ్లండ్ ఆటగాళ్లకు నరకం చూపించాలనే మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
అన్నట్లుగానే, టీమిండియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచే వికెట్లు కోల్పోతూ వచ్చింది. భారత పేసర్ల దూకుడు ముందు ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. ఏ దశలో ఇంగ్లండ్ ఆటగాళ్లు కోలుకునే పరిస్థితి కనపడలేదు. భారత పేస్ దళం క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ.. ప్రత్యర్ధి పతనాన్ని శాసించింది. ఆట ముగియడానికి మరో 9.1 ఓవర్లు మాత్రమే ఉండగా, ఇంగ్లండ్ చేతిలో 3 వికెట్లు ఉండటంతో మ్యాచ్ డ్రా అవుతుందేమోనని అందరూ భావించారు. కానీ, రాబిన్సన్ (9)ను అవుట్ చేసి బుమ్రా టీమిండియా గెలుపుకు బాటలు వేయగా.. ఒకే ఓవర్లో బట్లర్ (25), అండర్సన్ (0)లను పెవిలియన్ పంపించి సిరాజ్ మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. ఈ మ్యాచ్‌లో 19 వికెట్లు భారత పేసర్ల ఖాతాలో పడడం విశేషం.