Ronaldo SIU Celebration: అర్జెంటీనాపై సౌదీ విజయం - SIU (సియు) వేడుకలు చేసుకున్న అభిమానులు
Ronaldo SIU Celebration: ప్రపంచవ్యాప్తంగా 51వ ర్యాంకులో ఉన్న సౌదీ, పటిష్టమైన అర్జెంటీనాను 2-1 తేడాతో ఓడించింది. ఈ సంచలన విజయంతో సౌదీ అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటాయి.
Ronaldo SIU Celebration: ఫిఫా ప్రపంచకప్ లో తన మొదటి మ్యాచులో అర్జెంటీనా సౌదీ అరేబియా చేతిలో కంగుతింది. ప్రపంచవ్యాప్తంగా 51వ ర్యాంకులో ఉన్న సౌదీ, పటిష్టమైన అర్జెంటీనాను 2-1 తేడాతో ఓడించింది. ఈ సంచలన విజయంతో సౌదీ అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటాయి. అలాగే వారు సియోల్ మైదానం వెలుపల 'సియు (siu)' వేడుకలు చేసుకున్నారు.
'సియు (siu)' అంటే ఏమిటి?
'సియు' అనేది ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో యొక్క సిగ్నేచర్ గెలుపు సంబరం. రొనాల్డో గోల్ కొట్టగానే పైకి ఎగిరి సీ అంటూ గట్టిగా అరచి సంబరాలు చేసుకుంటాడు. ఒక్కోసారి దాన్ని 'సియు (siu)' అని కూడా అంటారు. సియు అంటే స్పానిష్ భాషలో అవును అని అర్థం. 2014లో బాలన్ డీఓర్ వేడుకలో లియోనల్ మెస్సీ కంటే ముందుగా ట్రోఫీని గెలుచుకున్న రొనాల్డో అలానే సంబరాలు చేసుకున్నాడు. వేదికపై సీ అని గట్టిగా అరిచాడు. ఇప్పుడు తమ జట్టు మెస్సీ టీంపై గెలిచిన సందర్భంగా సౌదీ అభిమానులు కూడా సియు వేడుకలు జరుపుకున్నారు.
గత ప్రపంచకప్ లలో సౌదీ అరేబియా అర్జెంటీనా చేతిలో 5-0, 8-0 తేడాతో పరాజయం పాలైంది. అయితే ఈసారి ఆ చిన్న జట్టు అర్జెంటీనాకు షాక్ ఇచ్చింది. తమ విజయం చరిత్రలో నిలిచిపోయేలా చేసింది.
ప్రపంచకప్ లలో సంచలన విజయాలు
1990 ప్రపంచ కప్ ప్రారంభ గేమ్‌లో డియెగో మారడోనా నేతృత్వంలోని అర్జెంటీనా జట్టుపై కామెరూన్ 1-0 విజయం నమోదు చేసింది. అలాగే 2002లో టైటిల్ హోల్డర్ ఫ్రాన్స్‌పై, సెనెగల్ జట్టు 1-0తో విజయం సాధించింది. యునైటెడ్ స్టేట్స్ 1950లో 1-0 తో ఇంగ్లాండ్‌ను ఓడించింది.
సౌదీ గెలిచిందిలా
దాదాపు 89 వేలకు పైగా హాజరైన ఫుట్ బాల్ అభిమానుల మధ్య జరిగిన అర్జెంటీనా- సౌదీ అరేబియా మ్యాచ్ జరిగింది. సౌదీ అరేబియా గోల్ కీపర్ ఆల్ ఓవైస్ ఈ మ్యాచ్ లో హీరోగా నిలిచాడు. అర్జెంటీనా ఆటగాళ్లు గోల్‌పోస్టు వైపు కొట్టిన బంతులను అద్భుతంగా అడ్డుకొన్నాడు. ఆట ప్రారంభమైన పదో నిమిషంలోనే పెనాల్టీ రూపంలో వచ్చిన అవకాశాన్ని మెస్సి గోల్‌గా మలిచాడు. తొలి అర్ధ భాగంలో అర్జెంటీనా ఆటగాళ్లు పదేపదే గోల్‌పోస్టు వైపు దూసుకెళ్లారు. అయితే సౌదీ గోల్‌కీపర్ సమర్థంగా అడ్డుకొన్నాడు. ఆ తర్వాత రెండో అర్ధభాగంలో సౌదీ అరేబియా దాడి మొదలుపెట్టింది. 48వ నిమిషంలో సలేహ్ ఆల్ షెహ్రి, 53వ నిమిషంలో సలీమ్ ఆల్ డాసరి గోల్స్ చేసి అర్జెంటీనాను కంగుతినిపించారు. ఆ తర్వాత మరింత జాగ్రత్తగా ఆడిన సౌదీ అరేబియా ప్రత్యర్థి జట్టుకు అవకాశం ఇవ్వలేదు. ప్రత్యర్థి ఆటగాళ్లు పదేపదే గోల్ పోస్టులపై దాడి చేసినా సౌదీ డిఫెన్స్ ఆటగాళ్లు సమర్థంగా అడ్డుకున్నారు. చివరి వరకు ఆధిపత్యాన్ని కాపాడుకుని సంచలన విజయాన్ని నమోదు చేశారు. కాగా, అర్జెంటీనా తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం మెక్సికోతో తలపడుతుంది.
Saudi Arabia fans do Cristiano Ronaldo's SIU after beating Lionel Messi's Argentina. Wicked!!pic.twitter.com/umBzhCkAze
— UtdFaithfuls (@UtdFaithfuls) November 22, 2022