FIFA WC 2022 QATAR: స్పెయిన్ పై జపాన్ అద్భుత విజయం- నాకౌట్ కు అర్హత
FIFA WC 2022 QATAR: ఫిఫా ప్రపంచకప్ లో జపాన్ చరిత్ర సృష్టించింది. గ్రూప్- ఈ లో తనకంటే బలమైన జట్లు ఉన్నా.. మెరుగైన ఆటతో అగ్రస్థానంలో నిలిచి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది.
FIFA WC 2022 QATAR: ఫిఫా ప్రపంచకప్ లో జపాన్ చరిత్ర సృష్టించింది. గ్రూప్- ఈ లో తనకంటే బలమైన జట్లు ఉన్నా.. మెరుగైన ఆటతో అగ్రస్థానంలో నిలిచి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. తన తొలి మ్యాచులో 4సార్లు ఛాంపియన్ అయిన జర్మనీకి షాకిచ్చిన జపాన్... చివరి మ్యాచులో మరో మాజీ ఛాంపియన్ స్పెయిన్ ను ఓడించింది. దీంతో జర్మనీ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు గ్రూప్-హెచ్ నుంచి దక్షిణ కొరియా అనూహ్యంగా నాకౌట్లో అడుగు పెట్టింది. ఆ జట్టు తన చివరి మ్యాచ్‌లో పోర్చుగల్‌ను ఓడించి ఉరుగ్వే అవకాశాలకు గండి కొట్టింది. తన చివరి మ్యాచ్‌లో ఉరుగ్వే.. ఘనాను ఓడించినా ఫలితం లేకపోయింది.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రత్యర్థి మెరుగైన స్థానంలో ఉన్నా... జపాన్ ఆటగాళ్లు పోరాడిన తీరు అద్భుతంగా ఉంది. పోరాటాన్నే నమ్ముకున్న జపాన్ సంచలనం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 2-1 తేడాతో 2010 ప్రపంచకప్ విజేత స్పెయిన్‌ను ఓడించింది. రిత్సు డోన్ (48వ నిమిషంలో), తనక (51వ) చెరో గోల్ కొట్టారు. స్పెయిన్ తరపున మొరాటా (11వ) గోల్ చేశాడు. శక్తిమంతమైన ఐరోపా జట్టుపై నెగ్గిన ఈ ఆసియా జట్టు గ్రూప్‌లో అగ్రస్థానం (2 విజయాలు, ఓ ఓటమితో 6 పాయింట్లు)తో సగర్వంగా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఆ జట్టు తొలిసారి వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో నాకౌట్‌కు చేరింది.
ఓడినా నాకౌట్ కు స్పెయిన్
స్పెయిన్ ఓడినా రెండో స్థానంతో రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. స్పెయిన్, జర్మనీ ఒక్కో విజయం, గెలుపు, డ్రా చొప్పున నమోదు చేసి 4 పాయింట్లతో సమానంగా నిలిచాయి. కానీ మెరుగైన గోల్ అంతరంతో జర్మనీ (1)ని స్పెయిన్ (6) వెనక్కినెట్టింది. తన తొలి మ్యాచ్‌లో కోస్టారికాపై 7-0తో విజయం సాధించడం స్పెయిన్‌కు కలిసొచ్చింది. జపాన్‌పై స్పెయిన్ గెలిచి.. కోస్టారికాపై తాము నెగ్గితే జర్మనీకి నాకౌట్ చేరే అవకాశం ఉండేది. కానీ జపాన్.. స్పెయిన్‌కు షాకిచ్చింది.
ఆధిపత్యం స్పెయిన్ దైనా... విజయం జపాన్ దే
మ్యాచ్‌లో బంతిపై నియంత్రణ, గోల్‌పోస్టుపై దాడులు.. ఇలా అన్ని రకాలుగా స్పెయిన్‌దే ఆధిపత్యం. తొలి గోల్ కూడా ఆ జట్టుదే. సీజర్ నుంచి పాస్ అందుకున్న మొరాటా తలతో బంతిని నెట్‌లోకి పంపించాడు. కానీ విరామం తర్వాత జపాన్ జోరందుకుంది. ద్వితీయార్ధం ఆరంభంలో నాలుగు నిమిషాల్లోనే 2 గోల్స్ కొట్టింది. సబ్‌స్టిట్యూట్‌గా రిత్సు వచ్చి రాగానే పెనాల్టీ ప్రదేశం బయట నుంచి కళ్లుచెదిరే రీతిలో ఎడమ కాలితో బంతిని గోల్‌కీపర్ అందుకోలేని విధంగా లోపలికి పంపించాడు. ఆ వెంటనే తనక కొట్టిన గోల్‌తో జపాన్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆ గోల్ వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత స్కోరు సమం చేసేందుకు స్పెయిన్ చేసిన ప్రయత్నాలను జపాన్ ఆటగాళ్లు సమర్థంగా అడ్డుకున్నారు. నాకౌట్ చేరామన్న సంతోషంతో ఆనందబాష్పాలతో మైదానాన్ని వీడారు. నాకౌట్‌లో క్రొయేషియాతో జపాన్, మొరాకోతో స్పెయిన్ తలపడతాయి.
జపాన్ వివాదాస్పద గోల్
స్పెయిన్‌తో మ్యాచ్‌లో జపాన్ చేసిన రెండో గోల్ వివాదాస్పదమైంది. ఈ గోల్‌తోనే ఆ జట్టు నాకౌట్లో అడుగుపెట్టింది. గోల్‌పోస్టు పక్కన గీత దాటి పోతున్న బంతిని మిటోమా అద్భుతంగా డైవ్ చేసి లోపలికి తన్నాడు. అక్కడే ఉన్న తనక గోల్ చేశాడు. కానీ బంతి గీత దాటిందనే అనుమానంతో రిఫరీ.. వీడియో సమీక్ష (వార్)ను సంప్రదించాడు. చాలాసేపు పరిశీలించిన తర్వాత గోల్ అని ప్రకటించారు. కానీ దీనిపై చర్చలు జోరందుకున్నాయి. బంతి గీత దాటి వెళ్లిపోయిందని, ఎలా గోల్ ఇస్తారనే? ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Never. Stop. Believing. 🇰🇷#FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 2, 2022