IND vs ENG 5th Test: కొత్త కెప్టెన్లు, కొత్త కోచ్‌లు - నిర్ణయాత్మక టెస్టులో ఏ జట్టు బలమేంటి?
IND vs ENG 5th Test: సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లిష్ నేలపై ఆంగ్లేయులను టీమిండియా ఓడించిన దాఖలాలే లేవు. అలాంటిది ఈ సారి 2-1తో ఆధిపత్యంలో ఉంది. మరి ఎడ్జ్‌బాస్టన్‌లో బూమ్.. బూమ్ సేన 'ఎడ్జ్' సాధిస్తుందా?
IND vs ENG 5th Test: కొత్త కెప్టెన్టు! కొత్త కోచులు! ఫ్లాట్‌గా మారిన వికెట్లు.. ఇదీ ఇంగ్లాండ్, భారత్ ఐదో టెస్టుకు ముందు సిచ్యువేషన్! అందుకే ఈ మ్యాచుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లిష్ నేలపై ఆంగ్లేయులను ఓడించిన దాఖలాలే లేవు. అలాంటిది ఈ సారి 2-1తో టీమ్‌ఇండియా ఆధిపత్యంలో ఉంది. మరి ఎడ్జ్‌బాస్టన్‌లో బూమ్.. బూమ్ సేన 'ఎడ్జ్' సాధిస్తుందా? సిరీస్‌ను అందుకుంటుందా?
కెప్టెన్‌గా బుమ్రా
గతేడాది టెస్టు సిరీసుకు ఇప్పటికీ రెండు జట్లలో ఎన్నో అంశాలు మారాయి. టీమ్‌ఇండియా కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. రెండున్నరేళ్లుగా సెంచరీ చేయలేదు. ఫామ్‌లో తడబాటు కనిపిస్తోంది. తొలి నాలుగు మ్యాచుల్లో భారీ స్కోర్లు చేసిన రోహిత్ శర్మ కొవిడ్‌తో, కేఎల్ రాహుల్ గాయంతో జట్టులో లేరు. ఓపెనర్లుగా ఎవరొస్తారో తెలియడం లేదు. వెరసి భారత శిబిరంలో సందిగ్ధం నెలకొంది.
టాప్ స్కోరర్లు లేరు
శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్‌కు రావడమైతే ఖాయం! అతడికి తోడుగా పుజారా, మయాంక్‌లో ఎవరొస్తారో చూడాలి. పరిస్థితులను బట్టి కేఎస్ భరత్, హనుమ విహారి వచ్చినా ఆశ్చర్యం లేదు. శ్రేయస్ అయ్యర్, కోహ్లీ, విహారి, పంత్‌తో మిడిలార్డరైతే బలంగానే కనిపిస్తోంది. స్వింగ్, పేస్‌ను సమర్థంగా ఎదుర్కొంటే భారీ స్కోర్లు చేయొచ్చు. గత సిరీసులో అశ్విన్‌కు ఒక్కసారైనా ఛాన్స్ ఇవ్వలేదు. ఈసారి పిచ్‌లు ఫ్లాట్‌గా మారడంతో శార్దూల్, యాష్ మధ్య పోటీ నెలకొంది. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం, వ్యూహాలు, బౌలింగ్ అత్యంత కీలకం అవుతాయి.
బెన్‌స్టోక్స్‌కు పగ్గాలు
ఇంగ్లాండ్ జట్టులోనూ అనూహ్య మార్పులు వచ్చాయి. జో రూట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. బెన్‌స్టోక్స్ పగ్గాలు అందుకున్నాడు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మెక్‌కలమ్ కోచ్‌గా వచ్చాడు. యాషెస్, వెస్టిండీస్, భారత్ చేతుల్లో పరాభవం పాలైన ఆంగ్లేయులు న్యూజిలాండ్‌పై గెలుపుతో జోష్‌లో కనిపిస్తున్నారు. వారి బ్యాటింగ్ సగటు, స్కోరింగ్ రేటు పెరిగాయి. ముఖ్యంగా జానీ బెయిర్‌స్టో విధ్వంసకరమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. గతేడాది ఈ సిరీసులో ఇండియాపై 48.93 సగటుతో 184 పరుగులు కొట్టాడు. ఈ మధ్యే కివీస్‌పై 3 టెస్టుల్లో 120 స్ట్రైక్‌రేట్‌తో 394 దంచాడు. పరిస్థితులు అతడికి అనుకూలంగానూ ఉన్నాయి. తమకు అచ్చొ్చిన ఎడ్జ్‌బాస్టన్‌లో ఆడుతుండటం ఆంగ్లేయులకు కలిసొచ్చే అంశం.
గెలిచిన దాఖలాల్లేవ్
ఎడ్జ్‌బాస్టన్ పిచ్ గట్టిగా ఉండటమే కాకుండా పచ్చికతో కనిపిస్తోంది. తొలిరోజు మధ్యాహ్నం, రెండో రోజు ఉదయం చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. అలాంటప్పుడు స్వింగ్ బౌలింగ్ కీలకం అవుతుంది. ఈ మైదానంలో టీమ్‌ఇండియా ఒక్క మ్యాచైనా గెలవలేదు. 6 ఓడింది. 1986లో ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. బ్యాటర్లు ఇంగ్లాండ్ పిచ్‌లపై 2021లో 28.25 సగటు, 2.9 ఎకానమీతో పరుగులు చేయగా ఇప్పుడా గణాంకాలు 37.11, 3.8గా మారాయి.
ENG vs IND 5th Test Playing XI
ఇంగ్లాండ్: అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, సామ్ బిల్లింగ్స్, మాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్
భారత్: శుభ్‌మన్ గిల్, చెతేశ్వర్ పుజారా / మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ / అశ్విన్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా