Ind vs SL 2nd T20I: రెండో టీ20లో భారత్ పరాజయం... పర్వాలేదనిపించిన యువ జట్టు.. ఇవాళ మ్యాచ్‌కు రెడీ
శ్రీలంక టూర్‌లోని భారత్ జట్టుకి మరో పరాజయం ఎదురైంది. భారత్ జట్టుపై 4 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం సాధించింది.
శ్రీలంక టూర్‌లోని భారత్ జట్టుకి మరో పరాజయం ఎదురైంది. కొలంబో వేదికగా బుధవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో భారత్ నిరాశపరిచింది. దీంతో భారత్ జట్టుపై 4 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమవగా.. విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్ గురువారం రాత్రి కొలంబో వేదికగానే జరగనుంది.
మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (40: 42 బంతుల్లో 5x4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (21), దేవదత్ పడిక్కల్ (29) నిరాశపరచగా.. సంజు శాంసన్ (7), నితీశ్ రాణా (9) తేలిపోయారు. దాంతో.. నామమాత్రపు స్కోరుతో భారత్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
133 పరుగుల ఛేదనలో శ్రీలంకకి ఓపెనర్ మినోద్ భానుక (36: 31 బంతుల్లో 4x4) మెరుగైన ఆరంభమివ్వగా.. ధనంజయ డిసిల్వా (40 నాటౌట్: 34 బంతుల్లో 1x4, 1x6) సమయోచితంగా ఆడి ఆ జట్టుని గెలిపించాడు. శ్రీలంక వికెట్లని వరుస విరామాల్లో తీస్తూ వచ్చిన భారత బౌలర్లు.. ఆ జట్టుని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అవిష్కా ఫెర్నాండో (11), సమరవిక్రమ (8), కెప్టెన్ దసున్ షనక (3), హసరంగ (15), రమేశ్ మెండిస్ (2) కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకున్నారు. కానీ.. చివర్లో కరుణరత్నె (12 నాటౌట్), డిసిల్వా జోడీ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే గెలుపు లాంఛనాన్ని 133/6తో పూర్తి చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా.. రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి, చేతన్ సకారియా, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.
కృనాల్ పాండ్యాకి మంగళవారం కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. అతనితో క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న ఆటగాళ్లు పృథ్వీ షా, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ తదితరులు ఐసోలేషన్‌కి పరిమితమయ్యారు. టీమిండియా ఈ మ్యాచ్‌లో ఆరు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌తో టీ20 జట్టులోకి దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, చేతన్ సకారియా, నితీశ్ రాణా అరంగేట్రం చేశారు.
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ చేజెక్కించుకుంది. గత శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. ఇరు జట్ల మధ్య మూడు T20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమజ్జీవులుగా ఉన్నారు. మరి, ఈ రోజు జరిగే నిర్ణయాత్మక చివరి T20లో ఏ జట్టు విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంటుందో చూడాలి.
సొంత గడ్డపై వన్డే సిరీస్‌ను కోల్పోయిన లంక T20 సిరీస్ నెగ్గి పరువు దక్కించుకుంటుందా?. ఈ రోజు రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. బుధవారం రెండో టీ20 ఆడిన జట్టుతోనే భారత్ గురువారం ఫైనల్ టీ20 ఆడే అవకాశం ఉంది. నవదీప్ సైనీకి గాయపడ్డాడు కాబట్టి అతని స్థానంలో మరొకరు వస్తారా? లేక గాయం నుంచి కోలుకుని అతడే ఆడతాడా అన్న దానిపై స్పష్టత లేదు.