Steve smith Records: క్రికెట్ మక్కా లార్డ్స్‌లో స్టీవ్ స్మిత్ రికార్డుల వర్షం, 99 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టిన స్టార్ బ్యాటర్
డబ్ల్యూటీసీ ఫైనల్ మొదటి రోజునే ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ లార్డ్స్ లో 99 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టాడు. బ్రాడ్‌మన్, గ్యారీ సోబర్స్, సచిన్ రికార్డులు బద్ధలయ్యాయి.

WTC Final 2025 : 'క్రికెట్ కా మక్కా' అని పిలుచుకునే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో సాధించే ఘనత క్రికెటర్లకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ స్టేడియంలో చిన్న రికార్డు నమోదైన, పాత రికార్డు బద్దలైనా ప్లేయర్లకు అది ఆ క్షణం ఒక చరిత్ర అవుతుంది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మొదటి రోజున చారిత్రాత్మక ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ చేస్తూ, 99 సంవత్సరాల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. 1926లో ఆస్ట్రేలియాకు చెందిన వారెన్ బార్డ్స్లీ సాధించిన రికార్డును బద్ధలుకొట్టాడు స్మిత్.
ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ను పేలవంగా మొదలుపెట్టింది. మొదటి రోజు ప్రారంభంలోనే కేవలం ఏడు ఓవర్లలోనే జట్టులోని ఇద్దరు స్టార్ బ్యాటర్లు ఔటయ్యారు. అయితే స్టీవ్ స్మిత్ ఒక ఎండ్‌లో క్రీజులో నిలబడి ఓపికగా బ్యాటింగ్ చేశాడు. అతను 112 బంతుల్లో 10 ఫోర్ల సహాయంతో 66 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
లార్డ్స్ మైదానంలో చరిత్ర
స్మిత్ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాకు స్కోరు అందించడమే కాకుండా, లార్డ్స్‌లో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాట్స్‌మన్ గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ వారెన్ బార్డ్స్లీ పేరిట ఉంది, అతను 1909 నుండి 1926 వరకు లార్డ్స్‌లో 5 టెస్ట్ మ్యాచ్‌ల 7 ఇన్నింగ్స్‌లలో 575 పరుగులు చేశాడు. స్మిత్ 591 పరుగులు చేశాడు. స్మిత్ ఈ మైదానంలో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు సాధించాడు.
Steven Smith's legendary net sessions, his almost obsessive dedication to practice, spoke of a man who believed that mastery was solely forged in the fires of personal exertion
— ESPNcricinfo (@ESPNcricinfo) June 11, 2025
Greg Chappell writes 👇 https://t.co/zBGqznrsPA
బ్రాడ్‌మన్, సోబర్స్‌ను కూడా వెనక్కి నెట్టాడు
ఈ మ్యాచ్ సందర్భంగా స్మిత్ క్రికెట్ చరిత్రలో ఇద్దరు గొప్ప ఆటగాళ్లు అయిన సర్ డాన్ బ్రాడ్‌మన్, గ్యారీ సోబర్స్‌ను కూడా అధిగమించాడు. బ్రాడ్‌మన్ లార్డ్స్‌లో 4 టెస్ట్ మ్యాచ్‌ల 8 ఇన్నింగ్స్‌లలో 551 పరుగులు చేశాడు. గ్యారీ సోబర్స్ 5 టెస్ట్‌ల 9 ఇన్నింగ్స్‌లలో 571 పరుగులు చేశాడు. తన తదుపరి ఇన్నింగ్స్‌లో మరో 9 పరుగులు చేస్తే, లార్డ్స్ లో టెస్ట్ క్రికెట్‌లో 600 పరుగులు చేసిన ప్రపంచంలోని మొదటి బ్యాటర్ అవుతాడు.
స్మిత్ పేరిట మరొక రికార్డు
స్మిత్ లార్డ్స్ మైదానంలో రికార్డుల వర్షం కురిపించాడు. ఇంగ్లాండ్‌లో అత్యధికంగా యాభైకి పైగా స్కోర్లు సాధించి, అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పుడు అతని పేరు మీద 23 టెస్ట్ మ్యాచ్‌లలో 18 సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డు ఉంది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన అలన్ బోర్డర్ (25 టెస్ట్‌లలో 17 సార్లు), వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ (24 టెస్ట్‌లలో 17 సార్లు) లాంటి దిగ్గజాల పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్ ద్వారా స్టీవ్ స్మిత్ ఆ ఇద్దరినీ అధిగమించాడు. లార్డ్స్ వంటి ప్రతిష్టాత్మకస్టేడియంలో స్మిత్ పేరు ఇప్పుడు సువర్ణ అక్షరాలతో లిఖించుకుంటున్నాడు. ఒకటి రెండు కాదు పలు రికార్డులను స్టీమ్ స్మిత్ తన పేరిట నమోదు చేసుకుంటున్నాడు.





















