(Source: ECI/ABP News/ABP Majha)
IND vs AUS Final 2023: రోహిత్ ఆ ఒక్క షాట్ ఆడకపోయుంటే, మ్యాచ్‌లో అదే మలుపు అంటున్న మాజీలు
ODI World Cup 2023: స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో భారత్ తుది మెట్టుపై బోల్తాపడింది. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ల ముందు తలవంచింది. ఫైనల్లో భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Indian Cricket Team Lost: స్వదేశంలో జరిగిన ప్రపంచకప్(World Cup)లో భారత్(Bharath) తుది మెట్టుపై బోల్తాపడింది. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ల ముందు తలవంచింది. ఫైనల్లో భారత్‌పై ఆస్ట్రేలియా(Austrelia) 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ ఓటమి మైదానంలో ఉన్న లక్ష మందికిపైగా అభిమానులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలను కలచివేసింది. టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ ముగిశాక రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli), మహ్మద్ సిరాజ్(Siraj) కన్నీళ్లు పెట్టుకున్నారు. రోహిత్ శర్మ పెవిలియన్‌కు తిరిగి వస్తుండగా అతని కళ్ల నుంచి నీళ్లు కనిపించాయి. అదే సమయంలో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కూడా చాలా ఎమోషనల్ అయినట్టు కనిపించారు. అద్భుతంగా ఆడి తుది మెట్టుపై బోల్తాపడిన సందర్భంలో ఇలాంటివి సహజమే. కానీ రోహిత్ శర్మ ఆడిన ఒకే ఒక్క షాట్ మ్యాచ్‌ను మలుపు తిప్పిందని మాజీలు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రపంచకప్‌లో మొదటి నుంచి రోహిత్ శర్మ ధాటిగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. జట్టుకు దాదాపుగా అన్ని మ్యాచ్‌ల్లో శుభారంభాలు ఇచ్చాడు. వేగంగా ఆడి ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బకొడుతూ తర్వాత వచ్చే బ్యాటర్లకు రోహిత్ గట్టి పునాది వేశాడు. ఫైనల్లోనూ రోహిత్ ఇదే వ్యూహంతో సాగాడు. హేజిల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో రోహిత్ బాదుడు మొదలెట్టాడు. హేజిల్‌వుడ్ తర్వాతి ఓవర్లో వరుసగా 6, 4 దంచాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో వరుసగా 6, 4 సాధించాడు. 31 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. ఇక మరోసారి భారీ స్కోరు చేయడం ఖాయమని, ఛేదనలో ఆసీస్‌కు కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లోనే మరో షాట్‌కు ప్రయత్నించి, గురి తప్పడంతో రోహిత్ పెవిలియన్ చేరాడు. కవర్స్ నుంచి వెనక్కి పరుగెడుతూ, డైవ్ చేసి హెడ్ అందుకున్న అద్భుతమైన క్యాచ్‌తో రోహిత్ కథ ముగిసింది.
అంతే అక్కడి నుంచి భారత ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. 10 ఓవర్లకు 80/2తో టీ20లాగా సాగిన మన జట్టు బ్యాటింగ్ ఒక్కసారిగా టెస్టు ఇన్నింగ్స్‌లాగా మారింది. రోహిత్ వికెట్‌తో భారత్ ఒత్తిడిలో పడిపోగా.. అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ చెలరేగిన ఆసీస్ బౌలర్లు టీమ్‌ఇండియాను కట్టడి చేశారు. మధ్యలో 97 బంతుల వరకూ ఒక్క బౌండరీ కూడా రాలేదు. రోహిత్ మరికొంత సేపు క్రీజులో ఉండి ఉంటే.. మరిన్ని బంతులు ఆడి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. జట్టు మరో 40 పరుగులైనా ఎక్కువ చేసేదనే చెప్పాలి. అప్పుడు ఛేదనలో ఆసీస్‌కు గట్టిపోటీనిచ్చే అవకాశముండేది.
రోహిత్ ఔట్ కావడమే ఫైనల్లో టర్నింగ్ పాయింట్ అని మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. అప్పటివరకూ మంచి లయతో ఆడుతున్న రోహిత్ ఆ ఓవర్లో అప్పటికే ఒక సిక్సర్, ఫోర్ కొట్టి పది పరుగులు రాబట్టాడని గుర్తు చేశాడు. ఆ దశలో ఆ షాట్‌కి వెళ్లకుండా ఉండాల్సిందని గవాస్కర్ అన్నాడు. సరిగ్గా తాకితే అది సిక్సర్ పోయేదేనని కానీ... అలా జరగలేదని అన్నాడు. తర్వాత ఎలాగూ అయిదో బౌలర్ వచ్చేవాడు. అతణ్ని టార్గెట్ చేయాల్సిందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.