WI vs NED WC Qualifiers: అయ్యో! విండీస్ బతుకు ఆగమాయే - నెదర్లాండ్స్ విజయంతో వన్డే వరల్డ్ కప్‌కు డౌటే!
‘సంచలనం’అన్న పదానికి నెదర్లాండ్స్ సరికొత్త అర్థాన్ని చెప్పింది. రెండు సార్లు వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్స్‌కు కోలుకోలేని షాకిచ్చింది.
WI vs NED WC Qualifiers: అయిపోయింది.. అంతా అయిపోయింది. ఏదైతే జరుగకూడదని వెస్టిండీస్ అభిమానులు అనుకున్నారో అదే జరిగింది. రెండు సార్లు వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న వెస్టిండీస్ జట్టు మరోసారి ఐసీసీ ట్రోఫీకి అర్హత సాధించడం ఇక గగనమే.. జింబాబ్వే వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్ సంచలన విజయం నమోదుచేసి విండీస్‌కు కోలుకోలేని షాకిచ్చింది. ఇరు జట్లూ విజయం కోసం చివరిదాకా హోరాహోరి పోరాడినా ఆఖర్లో డచ్ (నెదర్లాండ్స్) ఆల్ రౌండ్ ఆటతో విండీస్‌కు చెక్ పెట్టింది. సూపర్ ఓవర్ ద్వారా తేలిన ఫలితంలో నెదర్లాండ్స్ సంచలన విజయంతో వరల్డ్ కప్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
భారీగా బాదినా..
హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్.. విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆ జట్టు ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (81 బంతుల్లో 76, 13 ఫోర్లు), ఛార్లెస్ (55 బంతుల్లో 54, 9 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడారు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరూ 101 పరుగులు జోడించారు. కెప్టెన్ షై హోప్ (38 బంతుల్లో 47, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించాడు. స్టార్ హిట్టర్ నికోలస్ పూరన్ (65 బంతుల్లో 104 నాటౌట్, 9 ఫోర్లు, 6 సిక్సర్లు) రెచ్చిపోయి ఆడాడు. చివర్లో కీమో పాల్ (25 బంతుల్లో 46, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా వీరబాదుడు బాదడంతో విండీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది.
వాళ్లూ తగ్గలే..
375 పరుగుల లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ కూడా తక్కువ తిన్లేదు. ఓపెనర్లు విక్రమ్‌జీత్ సింగ్ (37), మాక్స్ ఓడౌడ్ (36) లు తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించారు. ఆ తర్వాత వెస్లీ బరెసి (27) , బస్ డి లీడ్ (33) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. కానీ ఆంధ్రాలోని విజయవాడలో పుట్టి పెరిగి, అంతర్జాతీయ స్థాయిలో నెదర్లాండ్స్‌కు ఆడుతున్న యువ క్రికెటర్ తేజ నిడమమనూరు విండీస్ బౌలర్లను ఆటాడుకున్నాడు. 76 బంతుల్లోనే 11 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేశాడు. అతడికి తోడుగా కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (47 బంతుల్లో 67, 6 ఫోర్లు, 1 సిక్సర్) నిలబడ్డాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 153 పరుగులు జోడించారు. అయతే ఆఖరి ఓవర్లో నెదర్లాండ్స్ విజయానికి 9 పరుగులు కావాల్సి ఉండగా ఆ జట్టు 8 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
Logan van Beek in the Super Over against West Indies:
— ICC (@ICC) June 26, 2023
With the bat: 4 6 4 6 6 4 💥
With the ball: 8/2 with one ball to spare 👊
SENSATIONAL 🤩#CWC23 | #WIvNED: https://t.co/nJHz2HouZx pic.twitter.com/FXuUd0R56J
సూపర్ ఓవర్‌లో ఇలా..
సూపర్ ఓవర్ లో డచ్ ఆటగాడు వాన్ బీక్.. జేసన్ హోల్డర్ బౌలింగ్‌ను ఆటాడుకున్నాడు. ఈ ఓవర్లో 4,6,4,6,6,4తో 30 పరుగులు రాబట్టాడు. 31 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్.. 8 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది. దీంతో 22 పరుగుల తేడాతో డచ్ టీమ్ విజయఢంకా మోగించింది. నెదర్లాండ్స్ తరఫున సూపర్ ఓవర్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా వాన్ బీక్ చేయడం విశేషం.
విండీస్ కథ కంచికేనా..?
ఈ ఓటమితో వెస్టిండీస్ వన్డే వరల్డ్ కప్ క్వాలిఫై రౌండ్ ఆశలను దాదాపుగా వదిలేసుకున్నట్టే. లీగ్ స్టేజ్ లో టాప్ -3లో ఉన్న జట్లు క్వాలిఫై రౌండ్ ఆడినా ఇందులో పాయింట్లు సూపర్ సిక్సెస్ స్టేజ్ లో కలుస్తాయి. గ్రూప్ - ఎలో జింబాబ్వే (8), నెదర్లాండ్స్ (6), వెస్టిండీస్ (4) లు సూపర్ సిక్సెస్ కు అర్హత సాధించినా జింబాబ్వే.. నాలుగు, నెదర్లాండ్స్ 2 పాయింట్స్ తో సూపర్ సిక్సెస్‌లోకి అడుగుపెట్టాయి. విండీస్‌కు ఇప్పుడు సూపర్ సిక్సెస్ లో ఆడబోయే మూడు మ్యాచ్‌లు గెలవడంతో పాటు జింబాబ్వే, నెదర్లాండ్స్ ఫలితాల మీద కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే విండీస్ వరల్డ్ కప్ ఆశలను దాదాపుగ వదిలేసుకున్నట్టే..!