IND vs PAK World Cup 2023: ఇండియాతో మ్యాచ్ ముఖ్యమే కానీ మా ప్రాధాన్యమదే - బాబర్ ఆజమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్ మరికొద్దిరోజుల్లో భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
IND vs PAK World Cup 2023: క్రికెట్ లో టోర్నీ ఏదైనా వేదిక ఎక్కడైనా భారత్ - పాక్ మ్యాచ్ లకు ఉండే క్రేజే వేరు. ఇక ఐసీసీ ట్రోఫీలైతే అది మరింత రసవత్తరం. ఈ క్రేజ్ కు కొనసాగింపా అన్నట్టుగా దాయాది దేశాల మధ్య అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ జరుగనుంది. మెగా టోర్నీలో ఇదే బిగ్గెస్ట్ మ్యాచ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ మ్యాచ్ పై భారీ హైప్ వచ్చింది. తాజాగా దీనిపై పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ స్పందించాడు. తమకు భారత్ తో మ్యాచ్ ముఖ్యమే అయినా వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ కీలకమే అని చెప్పాడు.
ఈ నెలలో పాకిస్తాన్.. శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బాబర్ మాట్లాడాడు. ‘మేం అక్కడికి (భారత్ కు) వెళ్లేది ప్రపంచకప్ ఆడటానికే తప్ప ఇండియాతో మాత్రమే ఆడటానికి కాదు. భారత్ తో పాటు మేం మరో 8 టీమ్స్ తో కూడా ఆడాలి. మాుక భారత్ తో మ్యాచ్ ఎంత ముఖ్యమో మిగిలిన 8 టీమ్స్ తో ఆడే మ్యాచులు కూడా అంతే ముఖ్యం. మా ప్రత్యర్థులపై బాగా ఆడి విజయం సాధించాలన్నదే మా ప్లాన్..’అని తెలిపాడు.
We are going to play World Cup, not only India: Babar Azam
— King Babar Azam Army (@kingbabararmy) July 6, 2023
'There are other nine teams as well we need to beat, in order to reach final'#BabarAzam #CWC23 #BabarAzam𓃵
pic.twitter.com/b7XkCk8isX
వేదికలపై..
కొద్దిరోజుల క్రితం పాకిస్తాన్.. వన్డే వరల్డ్ కప్ లో తాము ఆడబోయే వేదికలను మార్చాలని బీసీసీఐ, ఐసీసీలను కోరడంపై బాబర్ స్పందించాడు. ‘ప్రొఫెషనల్ క్రికెటర్లుగా మేం క్రికెట్ ఎక్కడ, ఎప్పుడు ఆడినా మెరుగైన ప్రదర్శన చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఒక ఆటగాడిగా, సారథిగా ప్రతి దేశంలోనూ, ఆడిన ప్రతి మైదానంలో పరుగులు సాధిస్తూ పాకిస్తాన్ ను గెలిపించడం మీదే నేను దృష్టి సారిస్తాను. దాని గురించి మాత్రమే నేను ఆలోచిస్తున్నాను..’ అని బాబర్ చెప్పుకొచ్చాడు.
పీసీబీపై..
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. అధ్యక్షుడిగా నజమ్ సేథీ మార్పు, జకా అష్రఫ్ సీన్ లోకి రావడం, ఆసియా కప్ పై కాబోయే చీఫ్ కామెంట్స్ చేయడం చర్చకు దారితీసింది. దీనిపై బాబర్ మాట్లాడుతూ.. ‘పీసీబీలో ఏం జరుగుతుందనేది మాకు అవసరం లేదు. మేం క్రికెట్ మీద మాత్రమే దృష్టి పెట్టాం. మాకు శ్రీలంకతో ఆడబోయే షెడ్యూల్ గురించి పూర్తి అవగాహన ఉంది. వాటిని గెలవడమే మా ముందున్న లక్ష్యం..’ అని వ్యాఖ్యానించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ ను పాకిస్తాన్.. శ్రీలంకతో సిరీస్ తోనే ఆరంభించనుంది. జులై 16 నుంచి శ్రీలంకతో పాకిస్తాన్ టెస్టు సిరీస్ మొదలుకానుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial