PAK vs SA: ఆ ఒక్క నిర్ణయం సానుకూలంగా వచ్చుంటే... "అంపైర్ కాల్"పై హర్భజన్ మండిపాటు
ODI World Cup 2023: అంపైర్ కాల్ నిర్ణయంపై టర్బోనేటర్ హర్భజన్ సహా నెటిజన్లు మండిపడుతున్నారు. పాకిస్థాన్ ఓటమికి అంపైరింగ్ తప్పిదాలు, బ్యాడ్ రూల్స్ కారణం అయ్యాయని హర్భజన్ ట్వీట్ చేశాడు.
దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ మ్యాచ్‌లో అది ప్రేక్షకులంతా ఊపిరి బిగపట్టి చూస్తున్న సమయం. ప్రొటీస్ విజయానికి 28 బంతుల్లో 11 పరుగులు కావాలి. పాకిస్థాన్‌కు ఒకే ఒక్క వికెట్ కావాలి. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో విజయానికి కేవలం ఒకే వికెట్ దూరంలో పాక్ ఉంది. అప్పటికే తొమ్మిదో వికెట్ నేలకూల్చిన రౌఫ్.. అదే ఒవర్ చివరి బంతిని మంచి లైన్ అండ్ లెంత్‌లో వేశాడు. అది నేరుగా వెళ్లి బ్యాటర్ షంసీ ప్యాడ్‌కు తాకడంతో ఎల్బీ కోసం పాక్ ఫీల్డర్లు అప్పీల్ చేశారు. కానీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. వెంటనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రివ్యూ కోరాడు. అల్ట్రా ఎడ్జ్‌లో బ్యాట్ తాకలేదని తేలడంతో పాకిస్థాన్ ఆటగాళ్లు ఔట్ అనే ధీమాలో ఉన్నారు. కానీ బాల్ ట్రాకింగ్‌లో పాకిస్థాన్‌ను దురదృష్టం వెంటాడింది. బంతి లెగ్ స్టంప్‌కు ఆనుకుంటూ వెళ్తున్నట్లు తేలింది. దీంతో థర్డ్ అంపైర్.. అంపైర్ కాల్ అని ప్రకటించాడు. అంతకు ముందు ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో షంసీ బతికిపోయాడు. అదే అంపైర్ ఔట్ ఇస్తే షంసీ అవుటయ్యేవాడు... పాక్ విజయం సాధించేది. కానీ అంపైర్ కాల్ కావడంతో షంసీ బతికిపోవడంతో కేశవ్ మహరాజ్ ఫోర్ కొట్టి ప్రొటీస్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.
అయితే అంపైర్ కాల్ నిర్ణయంపై టర్బోనేటర్ హర్భజన్ సహా నెటిజన్లు మండిపడుతున్నారు. పాకిస్థాన్ ఓటమికి అంపైరింగ్ తప్పిదాలు, బ్యాడ్ రూల్స్ కారణం అయ్యాయని హర్భజన్ ట్వీట్ చేశాడు. బంతి వికెట్‌కు తాకుతున్నట్లు తేలితే అంపైర్ నిర్ణయంతో సంబంధం లేకుండా ఔట్ ఇవ్వాలని ఐసీసీకి సూచించాడు. అలా ఇవ్వలేనప్పుడు టెక్నాలజీతో ఉపయోగం ఏంటని ప్రశ్నించాడు. పాకిస్థాన్ గెలవాల్సిన మ్యాచ్‌లో అంపైర్ సౌతాఫ్రికాను గెలిపించారంటూ నెటిజన్లు అంపైర్ నిర్ణయంపై మండిపడుతున్నారు. అంపైర్ అవుట్ ఇస్తే పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించేదని ట్వీట్ చేస్తున్నారు. అంపైర్లలో మరింత పారదర్శకత అవసమరని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక ప్రపంచకప్‌లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం వాకిట బోర్లా పడింది. పాక్ విజయానికి ఒకే ఒక్క వికెట్ దూరంలో నిలిచింది.
సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. పాక్ బ్యాటర్లలో సారధి బాబర్ ఆజమ్ 50, సౌద్ షకీల్ 52, షాదాబ్ ఖాన్ 43 పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రీజ్ షమీ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. 271 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 47.2 ఓవర్లలో కష్టంగా మ్యాచ్‌ను ముగించింది. అయిడెన్ మార్‌క్రమ్ (91: 93 బంతుల్లో 7×4,3×6)) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. సారధి బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ పాక్‌ను ఆదుకున్నారు. 31 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన మహ్మద్ రిజ్వాన్‌ను కాట్జే అవుట్ చేసి దెబ్బ కొట్టడంతో 86 పరుగుల వద్ద పాకిస్థాన్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. అనంతరం ఇఫ్తికార్ అహ్మద్‌తో కలిసి బాబర్ ఆజమ్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. 129 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన పాక్.... ఆ తర్వాత కాసేపటికే క్రీజులో స్థిరపడ్డ సారధి బాబర్ ఆజమ్ వికెట్‌ను కోల్పోయి కష్టాల్లో పడింది. 65 బంతుల్లో సరిగ్గా 50 పరుగులు చేసిన బాబర్ ఆజమ్‌ను షంషీ అవుట్ చేశాడు. సౌద్ షకీల్ పాక్‌ను ఆదుకున్నాడు. 52 బంతుల్లో 7 ఫోర్లతో 52 పరుగులు చేసి సౌద్ షకీల్ అవుటయ్యాడు. ప్రొటీస్ బౌలర్లు వరుసగా వికెట్లను తీయడంతో పాక్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. 271 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 47.2 ఓవర్లలో చివరి వికెట్‌కు విజయం సాధించింది.