World Cup 2023: వీరేంద్ర సెహ్వాగ్‌కు అరుదైన గౌరవం, తొలి భారత మహిళా క్రికెటర్‌గా ఎడుల్జీకి గౌరవం
ODI World Cup 2023: టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్, డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌కు అరుదైన గౌరవం దక్కింది.
టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్, డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ డ్యాషింగ్ ఓపెనర్... ఇప్పుడు ICC నుంచి అత్యున్నత గౌరవం అందుకున్నాడు. ప్రతిష్ఠాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌కు చోటు దక్కింది. సెహ్వాగ్‌తో పాటు భారత మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీకి కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. వీరితో పాటు శ్రీలంక దిగ్గజ ఆటగాడు అరవింద డిసిల్వా కూడా ఈ గౌరవం దక్కించుకున్నారు. వీరి ముగ్గురినీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చేర్చుతున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారత్ నుంచి 9 మంది క్రికెటర్లకు ఇప్పటి వరకూ స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఐసీసీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది.
వీరేంద్ర సెహ్వాగ్‌కు భారత క్రికెట్‌లో ప్రత్యేక స్థానం ఉంది. ఎదుట ఉన్నది ఎంతంటి బౌలరనేది లెక్కచేయకుండా 90కిపై స్ట్రెక్ రేటుతో వీరూ విధ్వంసం సృష్టించేవాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 ప్రపంచకప్ టీమిండియాకు రావడంలో డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ పాత్ర చాలా కీలకం. 2011 వరల్డ్‌కప్‌లోనూ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 1999 నుంచి 2013 మధ్య కెరీర్‌లో మొత్తం 104 టెస్టుల్లో 8, 586 పరుగులు చేసిన సెహ్వాగ్.. 251 వన్డేల్లో 8, 273 పరుగులు, 19 టీ20ల్లో 394 రన్స్ చేశాడు. టెస్టుల్లో10,441 పరుగులు, వన్డేలలో 7,929 పరుగులు, టీ20ల్లో 271 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 23 సెంచరీలు చేసిన సెహ్వాగ్.. ఆరు డబుల్ సెంచరీలు చేశాడు. ట్రిపుల్ సెంచరీ కూడా సెహ్వాగ్ పేరు మీద ఉంది. వన్డేలలో 15 సెంచరీలు చేసిన వీరూ.. ఓ డబుల్ సెంచరీ కూడా బాదేశాడు. ఆఫ్ స్పిన్నర్‌గానూ సెహ్వాగ్.. టెస్టుల్లో 40, వన్డేలలో 96 వికెట్లు పడగొట్టాడు.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 2023కి తనను ఎంపిక చేయడంపై సెహ్వాగ్ హర్షం వ్యక్తం చేశాడు. తనను ఎంపిక చేసిన ఐసీసీకి, జ్యూరీలకు కృతజ్ఞతలు చెప్పాడు. అత్యంత ఇష్టమైన క్రికెట్‌లోనే తన జీవితంలో ఎక్కువ కాలం గడిపినందుకు తనెంతో ధన్యుడినని పేర్కొన్నారు. భారత్ నుంచి తొలి మహిళా క్రికెటర్‌గా హాల్ ఆఫ్ ద ఫేమ్ జాబితాలో చోటు దక్కడంపై దిగ్గజ మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీ హర్షం వ్యక్తంచేశారు. ఈ అత్యున్నత గౌరవానికి తనను ఎంపిక చేసినందుకు ఐసీసీ, జ్యూరీలకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళ, పురుష క్రికెటర్ల గెలాక్సీలో చేరిన తొలి భారతీయ మహిళా క్రికెటర్ తానే కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ క్షణం తనకు పాటు తన కుటుంబ సభ్యులకే కాదు.. బీసీసీఐ, భారత మహిళా క్రికెట్‌కు గర్వకారణమని పేర్కొన్నారు. డయానా ఎడుల్జీ ఇండియాకు ఆడుతూ అద్భుత ప్రదర్శన చేశారు.1976 నుంచి 93 వరకూ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన డయానా ఎడుల్జీ.. తన అంతర్జాతీయ కెరీర్‌లో 109 వికెట్లు పడగొట్టారు. తన ఆటతీరుతో అనేక మంది బాలికలు క్రికెట్ వైపు ఆకర్షితులయ్యేలా చేశారు. క్రికెటర్ కావాలని యువత కలలు కనేందుకు కారణమయ్యారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ చోటు దక్కడంపై శ్రీలంక దిగ్గజ క్రికెటర్ అరవింద డిసిల్వా సంతోషం వ్యక్తం చేశారు. తనకు గొప్ప గౌరవాన్ని కల్పించిన ఐసీసీకి థాంక్స్ చెప్పారు. ఈ క్షణం తన హృదయమంతా కృతజ్ఞతాభావంతో నిండిపోయిందని పేర్కొన్నారు.