World Cup 2023: మళ్లీ అదే లొల్లి - వరల్డ్ కప్‌లో తటస్థ వేదిక అయితేనే ఆడతామంటూ పాక్ క్రీడా మంత్రి కామెంట్స్
IND vs PAK: భారత్‌లో అక్టోబర్ నుంచి జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనడంపై పాకిస్తాన్ ఇప్పుడప్పుడే ‘యెస్’ చెప్పేలా లేదు. ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ లా సా...గుతోంది.
World Cup 2023: ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ కు సంబంధించి ఐసీసీ ఇదివరకే ఫైనల్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే 9 జట్లూ.. ప్రపంచకప్ లో ఎలా ఆడాలి..? పిచ్ లు ఎలా స్పందిస్తాయి..? ప్రత్యర్థులను ఎలా కట్టడి చేయాలి..? అనేదానిపై దృష్టిసారిస్తే పాకిస్తాన్ మాత్రం ఇంకా ‘మేం ఇండియాకు వెళ్లాలా..? వదా..?’ అన్న మీమాంసలోనే ఉంది. ఇన్నాళ్లు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఏదో ఓ కామెంట్స్ చేసి ఈ అంశాన్ని నిత్యం రగిలిస్తూనే ఉండగా తాజాగా ఇది పాకిస్తాన్ ప్రభుత్వం వద్దకు చేరింది.
ఇండియాలో వరల్డ్ కప్ ఆడటంపై పాకిస్తాన్ క్రీడా శాఖ మంత్రి ఎహ్సాన్ మజారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యలో మజారీ మాట్లాడుతూ.. ‘నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నా మంత్రిత్వ శాఖ పరిధిలోకే వస్తుంది. ఆసియా కప్ ఆడేందుకు ఇండియా పాకిస్తాన్‌కు రాలేదు. వాళ్లు తటస్థ వేదిక కోరుకున్నారు. ఇప్పుడు మేం కూడా అదే అడుగుతున్నాం. ఇండియాలో జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో కూడా మేం (పాక్) ఆడబోయే మ్యాచ్‌లకు తటస్థ వేదికలు కావాలి’అని వ్యాఖ్యానించారు.
మజారీ వ్యాఖ్యలతో మరోసారి వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ పాల్గొంటుందా..? లేదా..? అన్న అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్‌లో జరగాల్సి ఉన్న ఆసియా కప్‌కు భద్రతా కారణాల దృష్ట్యా తాము పాక్‌కు రాబోమని బీసీసీఐ తేల్చి చెప్పడంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో జరుపనున్నారు. ఆగస్టు చివరివారంలో పాకిస్తాన్, శ్రీలంకలలో ఆసియా కప్ జరుగనుంది. అయితే పాకిస్తాన్ అధికారిక ఆతిథ్య దేశం అయినా ఈ టోర్నీలో పాక్‌కు దక్కిన మ్యాచ్‌లు నాలుగు మాత్రమే. లంకలో భారత మ్యాచ్‌లతో పాటు మొత్తం 9 మ్యాచ్‌లు అక్కడే జరుగనున్నాయి. దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, ప్రభుత్వం కూడా ఆగ్రహంగా ఉంది.
రెండ్రోజుల క్రితమే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. వన్డే వరల్డ్ కప్‌లో పాక్ టీమ్ పాల్గొనడంపై 11 మంది మంత్రులతో హై ప్రొఫైల్ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో జదారితో పాటు ఎహ్సాన్ కూడా ఉన్నారు. ఈ కమిటీ కొద్దిరోజుల్లోనే పాక్ ప్రధానికి నివేదికను అందజేయనుంది. దాని ప్రకారం షెహబాజ్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
క్రీడల్లోకి రాజకీయాలు తెస్తున్నారు : మజారీ
భారత ప్రభుత్వం క్రీడల్లోకి రాజకీయాలను తీసుకొస్తుందని మజారీ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియా క్రీడల్లోకి రాజకీయాలను తీసుకొస్తుంది. భారత క్రికెట్ జట్టును పాకిస్తాన్ కు ఎందుకు పంపడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. కొద్దిరోజుల క్రితమే భారత బేస్‌బాల్ జట్టు పాకిస్తాన్‌కు వచ్చింది.. బ్రిడ్జ్ టీమ్ కూడా పాకిస్తాన్‌కు వచ్చింది. ఆ టీమ్‌లో సుమారు 60 మంది దాకా ఉన్నారు. ఆ ఫైనల్ ఈవెంట్‌కు నేనే చీఫ్ గెస్ట్‌గా వెళ్లా. పాకిస్తాన్ జట్టు కూడా ఇటీవలే ఫుట్‌బాల్, హాకీ, చెస్ టీమ్స్‌ను భారత్‌కు పంపింది..’ అని వ్యాఖ్యానించారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial