India vs Pakistan Match Cancel: పాకిస్తాన్‌తో ఆడేందుకు భారత ఆటగాళ్లు నిరాకరణ, మ్యాచ్ రద్దు చేసిన WCL నిర్వాహకులు
WCL 2025 లో భాగంగా జరగాల్సిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అయింది. జులై 20న జరగాల్సిన మ్యాచ్ ను నిర్వాహకులు రద్దు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

World championship of legends 2025 | భారత్, పాకిస్తాన్ మధ్య నేడు జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 నిర్వాహకులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటానికి భారత ఆటగాళ్లు నిరాకరించడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో WCL ఈ నిర్ణయం తీసుకుందని ప్రకటనలో పేర్కొన్నారు. యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ తదుపరి మ్యాచ్ జూలై 22న దక్షిణాఫ్రికాతో జరగనుంది.
క్షమాపణలు కోరిన WCL నిర్వాహకులు
అభిమానుల మనోభావాలను దెబ్బతీసినందుకు భారత ఆటగాళ్లకు, అభిమానులకువరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ నిర్వాకులు క్షమాపణలు కోరారు. తాము కేవలం అభిమానులకు మంచి మ్యాచ్ చూపించాలనుకున్నామని ఓ ప్రకటనలో వారు పేర్కొన్నారు.
WCL ప్రకటనలో ఏముందంటే..
"వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ఎల్లప్పుడూ క్రికెట్‌ను గౌరవించింది, ఆటను ప్రేమిస్తుంది. మా ఏకైక లక్ష్యం క్రికెట్ అభిమానులకు కొన్ని మంచి, ఆనందకరమైన క్షణాలు అందించడం. ఈ సంవత్సరం పాకిస్తాన్ హాకీ జట్టు భారత్‌కు వస్తోందని విన్నాము. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య వాలీబాల్, కొన్ని ఇతర గేమ్స్ తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికుల కోసం మంచి జ్ఞాపకాలను అందించడానికి WCLలో కూడా ఈ మ్యాచ్‌ని షెడ్యూల్ చేశాం " అని పేర్కొంది.
డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు మాట్లాడుతూ, "భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంతో ఉత్కంఠ నెలకొంటుంది. కానీ ఈ మ్యాచ్ రద్దు కావడం చాలా మంది మనోభావాలను దెబ్బతీసి ఉండవచ్చు. దేశానికి ఎంతో పేరు తెచ్చిన భారత క్రికెట్ దిగ్గజాలకు తెలియకుండానే మేం వారికి అసౌకర్యం కలిగించాము. మేము బ్రాండ్‌లను కూడా ప్రభావితం చేశాం. భారత్ ఆటగాళ్లు పాక్ తో ఆడేందుకు నిరాకరించిన కారణంగా, మేము భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించుకున్నాము. మాజీ క్రికెటర్ల మనోభావాలను దెబ్బతీసినందుకు మరోసారి క్షమాపణలు కోరుతున్నాం. మేము కేవలం అభిమానుల కోసం కొన్ని ఆనందకరమైన క్షణాలు ఇవ్వాలని మాత్రమే భావించాం. క్రికెట్ ప్రేమికులు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము."
Dear all , pic.twitter.com/ViIlA3ZrLl
— World Championship Of Legends (@WclLeague) July 19, 2025
భారత్ ఛాంపియన్స్ జట్టు
యువరాజ్ సింగ్ (కెప్టెన్), సురేష్ రైనా, గుర్కీరత్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధావన్, స్టువర్ట్ బిన్నీ, రాబిన్ ఊతప్ప (వికెట్ కీపర్), అంబటి రాయుడు (వికెట్ కీపర్), యూసుఫ్ పఠాన్, అభిమన్యు మిథున్, పీయూష్ చావ్లా, హర్భజన్ సింగ్, పవన్ నెగి, వరుణ్ ఆరోన్, సిద్ధార్థ్ కౌల్, వినయ్ కుమార్.





















