ODI World Cup 2023: సెమీస్‌లో వర్షం పడి మ్యాచ్ రద్దయితే , అప్పుడు ఫైనల్ చేరే జట్టు ఏదంటే..?
ODI World Cup 2023: ఒకవేళ ప్రకృతి ప్రతాపం చూపించి వర్షం పడితే నాకౌట్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంది కాబట్టి బుధవారం వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతే దానిని గురువారం నిర్వహిస్తారు.
స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో నాకౌట్‌కు టీమిండియా సిద్ధమైంది. ఈ మహా సంగ్రామంలో వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్ సేన.. అదే ఊపుతో కివీస్‌ను మట్టికరిపించాలని భావిస్తోంది. బ్యాటింగ్‌లో బ్యాట్స్‌మెన్లు అదరగొడుతుండగా.. బౌలింగ్‌లో పదునైన పేస్‌తో పేసర్లు బెదరగొడుతున్నారు. స్పిన్నర్లు బ్యాటర్లను కట్టడి చేస్తుండగా.. ఫీల్డర్లు కూడా మైదానంలో చురుగ్గా కదులుతున్నారు. ఇలా ఎటు చూసినా ఏ విభాగంలో చూసినా టీమిండియా చాలా పటిష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో వర్షం పడితే పరిస్థితి ఏంటన్న ప్రశ్న అభిమానులను వేధిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో వర్షం పడే అవకాశాలు లేవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ వర్షం పడితే ఏమవుతుందంటే...
భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ ముంబైలోని వాంఖడే వేదికగా జరగనుంది. ఈ సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం కురిసే అవకాశమే లేదని వెదర్ డాట్ కామ్ సంస్థ స్పష్టం చేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మ్యాచ్ జరిగే రోజు( బుధవారం) వాతావరణం తేమగా ఉంటుందని, వేడి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 35 సెంటిగ్రేడ్‌లు ఉంటాడని వెల్లడించింది. మ్యాచ్ జరిగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా వర్షం కురిసే అవకాశాలైతే ససేమిరా లేవని వెల్లడించింది. ఒకవేళ ప్రకృతి ప్రతాపం చూపించి వర్షం పడితే నాకౌట్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంది కాబట్టి బుధవారం వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతే దానిని గురువారం నిర్వహిస్తారు. గురువారం కూడా ఆట సాధ్యం కాకుంటే మాత్రం పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. అలా జరిగితే భారత్‌కే ఫైనల్ చేరుతుంది. లీగ్ దశలో ఆడిన తొమ్మిదింటిలో తొమ్మిది గెలిచిన భారత్.. 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. 9 మ్యాచ్‌లలో ఐదు మాత్రమే గెలిచిన కివీస్‌కు 10 పాయింట్లున్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ లో కూడా ఈ రెండు జట్ల మధ్యే తొలి సెమీస్ జరిగింది. వర్షం కారణంగా రిజర్వ్ డే కు మారిన ఆ మ్యాచ్‌లో పలితం భారత్‌కు అనుకూలంగా రాలేదు.
2019 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌లో టీమిండియా ఆశలపై నీళ్లు చల్లిన న్యూజిలాండ్‌పై ఈ నాకౌట్ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. ఈ ప్రపంచకప్‌లో అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత జట్టు.. అప్రతిహాత విజయాలతో సెమీఫైనల్లో అడుగు పెట్టింది. ఈ ప్రపంచకప్ సెమీస్‌లోనూ న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ఓసారి ప్రతీకారం తీర్చుకుంది. కానీ అసలు సిసలు ప్రతీకారం తీర్చుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. అన్ని విభాగాల్లో దుర్బేధ్యంగా రోహిత్ సేన ఇక న్యూజిలాండ్‌పై విజయం సాధించడం ఒక్కటే మిగిలింది. 2019 ప్రపంచకప్‌లో కోహ్లీ సేన కివీస్‌తో సెమీస్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల కృషితో కివీస్ 50 ఓవర్లలో 239 పరుగులకే పరిమితం చేయగా లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది. 49.3 ఓవర్లలో 221 పరుగులకే చాపచుట్టేసింది. ఈ మ్యాచ్‌లో ధోని రనౌట్ ఇప్పటికీ భారత అభిమానులకు ఓ పీడకలలా వేధిస్తూనే ఉంది. ఈ ఓటమికి బదులు తీర్చుకునేందుకు ఇప్పుడు భారత్ ముందు సువర్ణావకాశం అంది.