Virat Kohli Retirement: టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ, సోషల్ మీడియాలో భావోద్వేగంతో పోస్ట్
Kohli Retirement: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టు క్రికెట్ ఆటతో పాటు జీవిత పాఠాలు నేర్పిందన్నాడు కోహ్లీ.

Virat Kohli Retires from Test Cricket after 14 glorious years | టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెప్పగా, ఇక విరాట్ కోహ్లీ వంతు వచ్చింది. మరికొంత కాలం టెస్టులు ఆడతాడనుకుంటే, రిటైర్మెంట్ ప్రకటించి కోహ్లీ తన అభిమానులకు షాకిచ్చాడు. రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగంతో పోస్ట్ పెట్టాడు కింగ్ కోహ్లీ. టీమిండియాకు 14 ఏళ్లపాటు టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించినందుకు గర్వంగా ఉందన్నాడు.
2011లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. టెస్టు కెరీర్‌లో 123 టెస్టు మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 30 శతకాలు, 31 అర్ధ శతకాల సాయంతో 9,230 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 254 నాటౌట్. కాగా, 2025 జనవరి 3వ తేదీన ఆస్ట్రేలియాతో తన చివరి టెస్టు ఆడాడు కోహ్లీ. టెస్టుల్లో 210 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 16608 బంతులు ఎదుర్కొని 55.57 సగటుతో పరుగులు సాధించాడు.
View this post on Instagram
విరాట్ కోహ్లీ పోస్టులో ఏముందంటే..
‘బ్యాగీ బ్లూ క్యాప్ తొలిసారి ధరించి 14 ఏళ్లు అవుతోంది. ఈ ఫార్మాట్ నన్ను ఎంతో ముందుకు తీసుకెళ్తుందని ఊహించలేదు. ఈ ఫార్మాట్ నన్ను పరీక్షించింది, ఓ మంచి క్రికెటర్‌గా తీర్చిదిద్దింది. ఆటలోనే కాదు జీవితంలోనే పాఠాలు నేర్పింది టెస్టు ఫార్మాట్.
ఈ వైట్ జెర్సీ పార్మాట్‌లో ఆడటంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఎంతో ప్రశాంతమైన ఆటతీరు, సుదీర్ఘమైన ఫార్మాట్, ఎవరూ చూడని చిన్న క్షణాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి. ఈ ఫార్మాట్ నుండి వైదొలగడం అంత సులభం కాదు. కానీ అది సరైన నిర్ణయమని నాకు అనిపించింది. నేను చేసిన దాని కంటే ఆట నాకు ఎక్కువే తిరిగి ఇచ్చింది.
ఈ సుదీర్ఘ ఫార్మాట్లో నాతో కలిసి ఆడిన వారికి, నా ఆటను కొనసాగేలా చేసిన వారికి, నాకు మార్గనిర్దేశం చేసిన వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెబుతున్నాను. నా టెస్ట్ కెరీర్‌ను చిరునవ్వుతో తిరిగి చూసుకుంటాను. #269, సైనింగ్ ఆఫ్’ అని విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు.
బీసీసీఐ ఎంత రిక్వెస్ట్ చేసినా నిర్ణయం తీసేసుకున్న కోహ్లీ..
వాస్తవానికి ఇటీవల రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా.. అంతలోనే కోహ్లీ సైతం టెస్టులకు రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు బీసీసీఐకి తెలిపాడు. కొందరు మాజీలు అయితే కోహ్లీ మరికొంత కాలం కొనసాగాలని.. ఒకేసారి రోహిత్, కోహ్లీలు టెస్టులకు దూరమైతే టీమిండియాను ఈ ఫార్మాట్లో నడిపించేది ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుందన్నారు. కనుక బీసీసీఐ సైతం కోహ్లీని కొంతకాలం ఈ ఫార్మాట్లో కొనసాగాలని, టెస్టు పగ్గాలు చేపట్టాలని కోరగా, ఆ ప్రతిపాదనను విరాట్ సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది.
గంభీర్‌కు ఇష్టం లేదు..
విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై వెనక్కి తగ్గాలని టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ భావించలేదని కథనాలు వస్తున్నాయి. కోహ్లీకి తిరిగి టెస్టు పగ్గాలు అప్పగించడానికి గంభీర్ సిద్ధంగా లేడని.. కోహ్లీని సైతం రిటైర్మెంట్ కొంతకాలం వాయిదా వేసుకోవాలని గౌతీ కోరలేదన్న వాదన తెరమీదకు వచ్చింది. ఏది ఏమైతేనేం విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. దాంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చినట్లు అయింది. వారు కేవలం వన్డే ఫార్మాట్లో కొనసాగనున్నారు.





















