Virat Kohli Retirement: టెస్టుల నుంచి నేను తప్పుకుంటా- బీసీసీఐకి సమాచారం ఇచ్చిన కోహ్లీ
Virat Kohli Retirement: టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటానంటూ బీసీసీఐకు విరాట్ కోహ్లీ సమాచారం ఇచ్చాడు. పునఃపరిశీలించాలని బోర్డు కోరినట్టు సమాచారం.

Virat Kohli Retirement: జూన్ 20న ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ పర్యటనకు ముందే టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్టు భారత్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ నిర్ణయాన్ని తెలియజేశాడు. బోర్డులో ఉండే సీనియర్ అధికారి మాత్రం వారించినట్టు చెప్పుకుంటున్నారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కోహ్లీకి సూచించినట్టు వార్తలు వస్తున్నాయి.
కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కొద్ది రోజులకే కోహ్లీ ఈ ప్రకటన చేశారు. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ టీ 20 క్రికెట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. అప్పుడు కూడా రోహిత్, కోహ్లీ ఒకేసారి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పుడు కూడా రోహిత్ తన నిర్ణయాన్ని ప్రకటించిన కొద్దిరోజులకే కోహ్లీ బీసీసీఐతో తన అభిప్రాయపంచుకున్నాడు.
జూన్‌లో ఇంగ్లండ్ టూర్‌కు టీమిండియా వెళ్లనుంది. దీని కోసం జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సన్నాహాలు చేస్తోంది. ఇంతలో రోహిత్ మొదట తప్పుకున్నాడు. ఇప్పుడు కోహ్లీ కూడా అదే బాటలో వెళ్తున్నాడు. టెస్టు ఛాంపియన్ షిప్ రేస్ మొదలుకానుంది. ఇలాంటి టైంలో ఇంగ్లండ్ టూర్‌కు కీలకమైన ఇద్దరు సీనియర్లు లేకపోవడం పెద్ద లోటు కానుంది. అందుకే రోహిత్‌ను ఎలాగో అపలేకపోయిన బీసీసీఐ, కోహ్లీనైనా ఆపాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది.
టెస్టుల్లో అడుగు పెట్టినప్పటి నుంచి కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. కేవలం గతేడాది నుంచి మాత్రమే కోహ్లీ ఫామ్‌లో ఉండటం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చాలా ఇబ్బంది పడ్డాడు. ఐదు టేస్టులు ఆడిన కోహ్లీ కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. పెర్త్‌లో సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చినట్టే అనిపించుకున్నా తర్వాత మ్యాచ్‌లలో ప్రభావం చూపలేకపోయాడు. నాలుగు మ్యాచ్‌లలో కేవలలం 85 పరుగులు మాత్రమే చేశాడు. ఈ టెస్టు సిరీస్‌లో పది సార్లు అవుటైన కోహ్లీ 8సార్లు కూడా స్లిప్‌లోనే క్యాచ్ ఇచ్చిన తన బలహీతను బహిర్గతం చేసుకున్నాడు.
ఇప్పటి వరకు కోహ్లీ 123 టెస్టులు ఆడాడు. అందులో 30 సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా 9,230 పరుగులు చేశాడు.




















