Varun Record: వరుణ్ ఖాతాలో మరో రికార్డు- అతి పెద్ద వయసులో డెబ్యూ.. 1974 తర్వాత ఇదే తొలిసారి..
Varun Chakravarthy: 33 ఏళ్ల వయసులో డెబ్యూ చేసిన అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. వరుణ్ కోసం ఈ మ్యాచ్ లో కుల్దీప్ కు రెస్ట్ ఇచ్చారు. నిజానికి గతేడాది అక్టోబర్ తర్వాత కుల్దీప్ అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు.

Ind Vs Eng Odi Series News: కటక్ లో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ప్లేయర్ వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల జరిగిన టీ20 సిరీస్ లో తన మిస్టరీ బౌలింగ్ తో 14 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. దీంతో రెండో వన్డేలో తనను టీమిండియాలోకి మేనేజ్మెంట్ తీసుకుంది. దీంతో 33 ఏళ్ల వయసులో డెబ్యూ చేసిన అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. వరుణ్ కోసం ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ కు రెస్ట్ ఇచ్చారు. నిజానికి గతేడాది అక్టోబర్ తర్వాత కుల్దీప్ అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. నాలుగు నెలల తర్వాత ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత ఆటగాడికి విశ్రాంతినిచ్చామని చెప్పడం కాస్త ఆశ్చర్యంగా ఉంది.
A beautiful speech by Ravindra Jadeja while giving the Debut Cap to Varun Chakravarthy 🌟 pic.twitter.com/Y0Sq8IGqda
— Johns. (@CricCrazyJohns) February 9, 2025
ఆకట్టుకున్న వరుణ్..
ఇక రెండో వన్డేలో తనపై ఉన్న అంచనాలను వరుణ్ నిలబెట్టుకున్నాడు. తను వేసిన రెండో ఓవర్లోనే ప్రమాదకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ ను పెవిలియన్ కు పంపించాడు. దీంతో 84 పరుగుల తొలి ఇన్నింగ్స్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక ఈ మ్యాచ్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి రావడంతో గత మ్యాచ్ లోనే డెబ్యూ చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ పై వేటు పడింది. తను తొలి వన్డేలో విఫలమయ్యాడు. కోహ్లీకి చోటు కోసం తనను తప్పించారు. జట్టులోకి విరాట్ రావడంతో భారత బ్యాటింగ్ లైనప్ లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. గత వన్డేలో వన్డౌన్ లో 87 పరుగులు చేసిన శుభమాన్ గిల్ ఈ మ్యాచ్ లో ఓపెనింగ్ లో బరిలోకి దిగుతాడు. వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ తో కలిసి తను ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు.
రికార్డుపై కన్నేసిన కోహ్లీ..
రెండో వన్డేలో అందరి కళ్లు కోహ్లీ పైనే ఉన్నాయి. ఇటీవల ఫామ్ కోల్పోయి విమర్శల పాలు అవుతున్న కోహ్లీ.. ఈ వన్డే సిరీస్ లో రాణించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈనెల 19 నుంచి ప్రారంభం కాబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగగలడు. ఈ ఫార్మాట్ కు కొట్టిన పిండి. ఎన్నో రికార్డులు తన పేరిట ఉన్నాయి. 50 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా తను బద్దలు కొట్టాడు. మరోసారి అలాంటి ప్రదర్శనే తన నుంచి అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇటీవల ప్రాక్టీస్ కోసం రంజీల్లో ఆడినా పెద్దగా ప్రయోజనం కోహ్లీకి లేకపోయింది. కేవలం ఆరు పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే వన్డేల్ల్లో ఎలా రాణించాలో కోహ్లికి బాగా తెలుసని, తనను వేధిస్తున్న ఔట్ సైడ్ ఆఫ్ బలహీనతకు కూడా అధిగమిస్తాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
ఇక ఈ ఫార్మాట్లో మరో 94 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 14 వేల పరుగుల మార్కును చేరిన క్రికెటర్ గా కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కుతాడు. ఇప్పటివరకు కేవలం ఇద్దరు మాత్రమే ఈ ఫార్మాట్లో ఈ మార్కును చేరారు. సచిన్ టెండూల్కర్ (18,456 పరుగులు కెరీర్ రన్స్) 350 ఇన్నింగ్స్ ల్లో, కుమార సంగక్కర (14, 234 పరగులు కెరీర్ రన్స్) 378 ఇన్నింగ్స్ ల్లో ఈ మార్కును చేరకున్నారు. కెరీర్లో 283వ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ అత్యంత వేగంగా ఈ మైలురాయిని రెండో వన్డేలోనే చేరకుంటాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ రికార్డు సాధించడంతోపాటు సెంచరీ చేస్తే అంతకుమించి ఏముంటుందని పేర్కొంటున్నారు.




















