Temba Bavuma: సఫారీ సారథి బవుమా సూపర్ రికార్డ్ - ఏంటీ ‘క్యారీ హిస్ బ్యాట్’?
వన్డేలలో సౌతాఫ్రికా సారథి టెంబ బవుమా ఆస్ట్రేలియాతో నిన్న ముగిసిన తొలి వన్డేలో అరుదైన ఘనత సాధించాడు. ‘క్యారీ హిస్ బ్యాట్’ ఘనత సాధించిన రెండో సఫారీ బ్యాటర్ అయ్యాడు.
Temba Bavuma: ‘క్యారీ హిస్ బ్యాట్’.. ఎప్పుడైనా ఈ పేరు విన్నారా..? తాజాగా సౌతాఫ్రికా సారథి టెంబ బవుమా దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా మధ్య గురువారం ముగిసిన తొలి వన్డేలో క్యారీ ది బ్యాట్ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తంగా వన్డే క్రికెట్‌లో ఇటువంటి ఘనతను అందుకున్న 13వ ఆటగాడిగా నిలిచాడు.
ఏంటీ క్యారీ ది బ్యాట్..
క్రికెట్‌లో ఒక మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఓ బ్యాటర్ సదరు ఇన్నింగ్స్‌లో తన జట్టు మొత్తం ఔట్ అయినా తాను మాత్రమే నాటౌట్ గా ఉంటే అప్పుడు దానిని ‘క్యారీ హిస్ బ్యాట్’ లేదా క్యారీ ది బ్యాట్ అంటారు. ‘వోయబ్బో.. ఇలాంటివి మేం చిన్నప్పుడు అమృతం సీరియల్‌లోనే చూశాం లేవో.. ఆ సీరియల్‌లోని ఓ ఎపిసోడ్‌లో క్రికెట్ మ్యాచ్ ఆడితే మా అమృతం (శివాజీ రాజా) ఓపెనర్‌గా దిగి లాస్ట్ వరకూ ఉండటం మేం చూడలేదా..?’ అంటారా.. సరే, ఇది కూడా అలాంటిదే అనుకోండి.
తాజాగా సఫారీ వన్డే టీమ్ సారథి కూడా ఇలాంటి ఘనతే అందుకున్నాడు. బ్లూమ్‌ఫౌంటెన్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీమ్ తడబడింది. ఓపెనర్‌గా డికాక్‌తో కలిసి బరిలోకి దిగిన బవుమా.. చివరివరకూ నిలిచాడు. 142 బంతులు ఆడి 114 పరుగులు చేశాడు. డికాక్‌తో పాటు డసెన్, మార్క్‌రమ్, క్లాసెన్, మిల్లర్, జాన్‌సేన్, కోయెట్జ్, మహారాజ్, రబాడా, ఆఖరికి పదో బ్యాటర్ లుంగి ఎంగిడి కూడా ఔట్ అయ్యాడు. కానీ బవుమా మాత్రం నాటౌట్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా తరఫున క్యారీ ది బ్యాట్ ఘనత సాధించినవారిలో మాజీ ఆటగాడు హెర్షల్ గిబ్స్ తర్వాత స్థానం బవుమాదే కావడం గమనార్హం.
గతంలో క్యారీ ది బ్యాట్ ఘనత (వన్డేలలో) సాధించిన క్రికెటర్లు..
గ్రాంట్ ఫ్లవర్ (జింబాబ్వే)
సయీద్ అన్వర్ (పాకిస్తాన్)
నికోలస్ నైట్ (ఇంగ్లాండ్)
ఆర్‌డీ జాకబ్స్ (వెస్టిండీస్)
డీఆర్ మార్టిన్ (ఆస్ట్రేలియా)
హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా)
అలెక్స్ స్టీవార్ట్ (ఇంగ్లాండ్)
జావేద్ ఓమర్ (బంగ్లాదేశ్)
అజార్ అలీ (పాకిస్తాన్)
టామ్ లాథమ్ (న్యూజిలాండ్)
ఉపుల్ తరంగ (శ్రీలంక)
కరుణరత్నె (శ్రీలంక)
బవుమా (దక్షిణాఫ్రికా)
వన్డేలలో ఈ రికార్డు తొలిసారి గ్రాంట్ ఫ్లవర్ పేరిట నమోదైంది. జింబాబ్వే - ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగి 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ జాబితాలో తొలిసారి సెంచరీ చేసింది సయీద్ అన్వర్. అన్వర్‌తో పాటు పైన పేర్కొన్న వారిలో నైట్, స్టీవార్ట్, తరంగ, బవుమాలు సెంచరీలు చేశారు. మిగిలినవారు సెంచరీ లోపే పరుగులు చేశారు. బంగ్లాదేశ్ ఓపెనర్ జావేద్ ఓమర్ 33 పరుగులే చేశాడు. ఇక క్యారీ ది బ్యాట్ ఘనత సాధించినవారిలో 2017లో ఉపుల్ తరంగ తర్వాత సెంచరీ చేసిన బ్యాటర్ బవుమానే కావడం విశేషం. ఇక సౌతాఫ్రికా - పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భాగంగా 168 పరుగుల లక్ష్య ఛేదనలో సఫారీలు 101 పరుగులకే ఆలౌట్ కాగా ఆ మ్యాచ్‌లో గిబ్స్ 59 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
వన్డేలలో 13 సార్లు బ్యాటర్లు ఈ ఘనత సాధించగా టెస్టులలో మాత్రం 56 సార్లు నమోదైంది. టీ20లలో ఇప్పటిదాకా ఈ రికార్డు ఒకే ఒక్క బ్యాటర్ పేరిట ఉంది. అతడెవరో కాదు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్. 2009 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 101 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో గేల్.. 63 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial