Indian Cricket Team: ద్రవిడ్, లక్ష్మణ్ కాదు! ఐర్లాండ్ టూర్లో టీమ్‌ఇండియా కొత్త కోచ్ ఈయనే!
Indian Cricket Team: ఐర్లాండ్ టీ20 సిరీసులో టీమ్‌ఇండియా అభిమానులకు కొన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. యువ భారత జట్టు కొత్త కోచ్ నేతృత్వంలో ఆడబోతోందని సమాచారం.
Indian Cricket Team:
ఐర్లాండ్ టీ20 సిరీసులో టీమ్‌ఇండియా అభిమానులకు కొన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. ఎందుకంటే ఈ సిరీసులో యువ భారత జట్టు కొత్త కోచ్ నేతృత్వంలో ఆడబోతోందని సమాచారం. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), సబ్‌స్ట్యిటూట్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం.
టీమ్‌ఇండియా ఐర్లాండ్‌లో (IND vs IER) పర్యటించడం ఇది రెండోసారి. రెండు జట్లూ మూడు టీ20లు ఆడనున్నాయి. ఆగస్టు 18, 20, 23 తేదీల్లో డబ్లిన్‌లోని మలహైడ్ వేదికగా పోటీలు జరుగుతాయి. ఈ సిరీసుకు పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాను (Jasprit Bumrah) సారథిగా ఎంపిక చేశారు. రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైశ్వాల్, జితేశ్ వంటి యువ ఆటగాళ్లపై ఆసక్తి నెలకొంది. వరుస సిరీసులు ఉన్నప్పుడు, చిన్న దేశాలతో ఆడేటప్పుడు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సెలవు తీసుకుంటున్నాడు. అలాంటప్పుడు ఎన్‌సీఏ అధినేత వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వస్తున్నాడు.
సాధారణంగా ద్రవిడ్ అందుబాటులో లేకుంటే వీవీఎస్ వచ్చే సంగతి తెలిసిందే. అయితే ఈసారి అలాగే జరుగుతుందని అనుకున్నారు. కానీ బెంగళూరులో కుర్రాళ్లకు హై పెర్ఫామెన్స్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇది మూడు వారాల పాటు కొనసాగుతుండటంతో ఆగస్టు 18న అందుబాటులో ఉండటం లేదు. దాంతో ఎన్‌సీఏలో టీమ్‌ఇండియా-ఏ హెడ్‌కోచ్ శీతాన్షు కొటక్‌కు బాధ్యతలు అప్పగించబోతున్నారని తెలిసింది.
శీతాన్షు కొటక్‌తో పాటు బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే రానున్నారు. 'ఐర్లాండ్‌తో టీ20 సిరీసుకు జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని టీమ్‌ఇండియాకు కొటక్, సాయిరాజ్ వస్తున్నారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరిగే హై పెర్ఫామెన్స్ క్యాంప్ వల్ల వీవీఎస్ లక్ష్మణ్ రావడం లేదు. అభిషేక్ శర్మ, ధ్రువ్ జోరెల్, రియాన్ పరాగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, సాయి సుదర్శన్, ఆకాశ్ సింగ్, రాజ్‌వర్థన్ హంగర్‌గేకర్, దివ్యాన్ష్ సక్సేనా వంటి కుర్రాళ్లను బీసీసీఐ ఈ శిబిరానికి ఎంపిక చేసింది' అని బీసీసీ వర్గాలు తెలిపాయి.
ఒకప్పటితో పోలిస్తే ఐర్లాండ్ ప్రదర్శన ఎంతో మెరుగైంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో సత్తా చాటుతోంది. ఆఖరి వరకు మ్యాచులను వదిలేయడం లేదు. అంతేకాకుండా ఏడాదికి పైగా టీమ్‌ఇండియాకు దూరమైన సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం చేస్తున్నాడు. శస్త్రచికిత్స తర్వాత కోలుకొని, ఎన్‌సీఏలో రిహబిలిటేషన్‌కు వెళ్లి ఫిట్‌నెస్ సాధించాడు. అంతేకాకుండా రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైశ్వాల్, రింకూ సింగ్, జితేశ్ శర్మ వంటి ఫైర్ ఉన్న కుర్రాళ్లు ఆడుతుండటంతో సిరీస్‌పై ఆసక్తి పెరిగింది.
శీతాన్షు గతంలో రెండేళ్లు భారత్-ఏకు హెడ్‌కోచ్‌గా పనిచేశారు. ఐర్లాండ్ టూర్‌లో కోచ్‌గా వెళ్లడం ద్వారా భవిష్యత్తులో టీమ్‌ఇండియాకు ఆడే కుర్రాళ్లతో పనిచేసే అవకాశం దొరుకుతుంది. అలాగే టీమ్‌ఇండియా కోచింగ్‌కు రెడీ అవ్వొచ్చు.
ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు
జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్, జితేష్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్