Sanju Samson: 6 వరల్డ్ కప్‌ల తరువాత సంజూ శాంసన్‌కు ఛాన్స్ - రింకూ సింగ్ కష్టాలు తక్కువేమీ కాదు!
T20 World Cup 2024: దశాబ్దం కిందటే భారత జట్టు తలుపు తట్టినా లక్ కలిసిరాకపోవడంతో సంజూ శాంసన్‌కు 6 వరల్డ్ కప్ లలో ఛాన్స్ దక్కలేదు. టాలెంట్ ఉంటే పేదరికం అడ్డుకాదని రింకూ సింగ్ నిరూపించాడు.
Sanju Samson and Rinku Singh selected for T20 World Cup 2024- సంజూ శాంసన్, రింకూ సింగ్ ఇద్దరూ ఇద్దరే. క్రికెట్‌లో ఆణిముత్యాలు అని చెప్పవచ్చు. కేరళలో పుట్టి ఢిల్లీలో పెరిగిన సంజూ శాంసన్ ఎప్పుడో పదేళ్ల క్రితమే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా ఒక్క వరల్డ్ కప్ ఆడేందుకు... ఆరు వరల్డ్ కప్‌ల వరకు ఎదురు చూశాడు. వరుస అవకాశాలు రాకపోవడంతో తానేంటో నిరూపించుకోలేక పోయిన బెస్ట్ బ్యాటర్ శాంసన్.
2015, 2019, 2023ల్లో వన్డే వరల్డ్ కప్పులో స్థానం దక్కించుకోలేకపోయిన శాంసన్... 2016, 2021, 2022ల్లో జరిగిన టీ20 వరల్డ్ కప్పుల్లోనూ నిరాశనే ఎదుర్కొన్నాడు. టీమిండియాకు కూడా అడపాదడపా ఆడుతూ మళ్లీ స్థానం కోల్పోయే శాంసన్.. తనలోని టాలెంట్ ను మాత్రం ఎప్పుడూ డిస్కరేజ్ చేసుకోలేదు. ఏడాదికోసారి జరిగే ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున తానేంటో ఏంటో ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. ఈ ఏడాది కూడా అంతే రాజస్థాన్ రాయల్స్ ను కెప్టెన్ గా ఎవడూ అందుకోలేనంత ఎత్తుకు చేర్చాడు.
రాజస్థాన్ రాయల్స్ (RR) ఆడిన 9 మ్యాచుల్లో 1 మాత్రమే ఓడిపోయి 16పాయింట్లతో మరే టీమ్ కు అందనంత ఎత్తులో నిలబడి ఆల్మోస్ట్ క్వాలిఫైయర్స్ కి అర్హత సాధించింది. వ్యక్తిగతంగా శాంసన్ కూడా మంచి టచ్ లో ఉన్నాడు. 9 మ్యాచుల్లో 4హాఫ్ సెంచరీలు 161 స్ట్రైక్ రేట్ తో 385పరుగులు చేశాడు. రాజస్థాన్ ను విజయాల బాట పట్టిస్తూ ఇప్పుడు తన వరల్డ్ కప్ కలను నెరవేర్చుకున్నాడు. పంత్ కు బ్యాకప్ కీపర్ గా సెలెక్ట్ అయినా స్పెషలిస్ట్ బ్యాటర్ గానూ శాంసన్ ను టీమ్ ఇండియా వాడుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
రిజర్వ్ ప్లేయర్‌గా రింకూ సింగ్
ఇక మరో వైపు కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ కూ టీమిండియా వరల్డ్ కప్ ఆపర్చునిటీ వచ్చింది. మెయిన్ స్క్వాడ్ లో లేకపోయినా రిజర్వ్ ప్లేయర్ గా జట్టుతో పాటే రింకూ కూడా వరల్డ్ కప్ కు హాజరవుతాడు. ఒకవేళ ఎవరైనా ఆటగాళ్లు గాయాలబారిన పడితే మ్యాచ్ లు ఆడే అవకాశం రింకూకు దక్కనుంది. యూపీలోని అలీఘర్ లో గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో పుట్టిన రింకూ సింగ్ చిన్నతనంలో తండ్రితో పాటు గ్యాస్ బండలు మోసేవాడు. పెద్దయ్యాక ఓ స్పోర్ట్ అకాడమీలో పనివాడిగా వాటర్ బాటిల్స్ మోస్తూ, అకాడమీ క్లీన్ చేస్తూ క్రికెట్ ట్రైనింగ్ తీసుకున్న రింకూ... 2023 ఐపీఎల్ లో ఫినిషర్ గా తళుక్కున మెరిసి టీమిండియా తలుపు తట్టాడు. ఇప్పుడు వరల్డ్ కప్ కు రిజర్వ్ ప్లేయర్ గానూ ఎంపికై ఆటకు, పేదరికానికి సంబంధం లేదని ప్రూవ్ చేశాడు.