Duckworth Lewis: డక్‌వర్త్ లూయిస్ చూసుకోకపోతే డకౌటే - పెద్ద జట్లకు డేంజర్ బెల్స్!
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి కీలకంగా మారింది.
టీ20 వరల్డ్‌కప్‌లో పెద్ద జట్లకు షాక్‌లు తగలడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ నిజంగా చిన్న జట్లు అద్భుతంగా ఆడి ఆ షాక్‌లను ఇస్తే అభినందించదగ్గ విషయమే. కానీ ఆస్ట్రేలియాలో జరుగుతున్నది వేరు. ఇక్కడ వర్షం కీలకపాత్ర పోషిస్తుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వేల మధ్య మ్యాచ్ ఫలితం లేకుండా, ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ ఐదు పరుగులతో విజయం సాధించినా దానికి ప్రధాన కారణం వర్షం, పరిస్థితులపై దక్షిణాఫ్రికా ఇంగ్లండ్‌లకు అవగాహన లేకపోవడమే.
దక్షిణాఫ్రికా, జింబాబ్వే మ్యాచ్ మరో మూడు నిమిషాలు జరిగి ఒక్క ఓవర్ బౌల్ అయి ఉంటే దక్షిణాఫ్రికా విజయం సాధించేది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొమ్మిది ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 7 ఓవర్లలో 64 పరుగులకు కుదించారు. వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడిన దక్షిణాఫ్రికా మూడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. అయితే మరొక్క ఓవర్ పడితే మ్యాచ్ గెలిచినట్లే అనగా వర్షం రావడంతో దక్షిణాఫ్రికా పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది.
ఇక ఇంగ్లండ్‌పై కూడా ఐర్లాండ్ దాదాపు ఇదే విధంగా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లండ్ 14.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం పడింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో చేయాల్సిన పరుగుల కంటే ఐదు పరుగులు వెనకబడటంతో ఐర్లాండ్ విజయం సాధించింది. నిజానికి ఆ సమయానికి ఇంగ్లండ్ 5.3 ఓవర్లలో 53 పరుగులు చేసింది. క్రీజులో మొయిన్ అలీ, లియాం లివింగ్‌స్టోన్ వంటి హార్డ్ హిట్టర్లు ఉన్నారు. కాబట్టి లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ డక్‌వర్త్ లూయిస్‌ను దృష్టిలో పెట్టుకోకుండా ఆడటం కారణంగానే ఇంగ్లండ్ ఓటమి పాలైంది.
ప్రపంచకప్ లాంటి టోర్నీల్లో ఇలాంటి ఫలితాలు కచ్చితంగా పెద్ద జట్ల భవితవ్యాన్ని మార్చేయచ్చు. ఇప్పుడు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలు మిగతా పెద్ద జట్ల మీద గెలిచినా వేరే మ్యాచ్‌ల ఫలితాలు వీరికి వ్యతిరేకంగా వస్తే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో మ్యాచ్‌లో ఎప్పటికప్పుడు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజీని మార్చుకుంటూ ఉండాలి. రెండోసారి బ్యాటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు వర్షం ప్రమాదం ఉంటే పవర్‌ప్లేలో వీలైనన్ని పరుగులు రాబట్టుకునే ప్రయత్నం చేయాలి
అలాగే ఫీల్డింగ్ జట్లు కూడా కేవలం తుది లక్ష్యం మాత్రమే కాకుండా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఓవర్, ఓవర్‌కు మారే లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ కొట్టాల్సిన స్కోరు కంటే ముందుంటే వికెట్లు తీయడంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే వికెట్లు తీసినప్పుడు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో లక్ష్యం పెరుగుతుంది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆడితేనే టీ20 ప్రపంచకప్‌లో పెద్దజట్లు ముందుకు వెళ్లగలవు. లేకపోతే ఎంత పెద్ద జట్టు అయినా వర్షంలో కొట్టుకుపోక తప్పదు.