T20 World Cup: ఎందుకు అతని బుర్ర పాడుచేస్తున్నారు.. ఓపెనింగ్ చర్చపై రవిశాస్త్రి ఫైర్
T20 World Cup: టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లే ఉండాలని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. దీనిపై అనవసరమైన చర్చ జరుగుతోందని అన్నారు.
T20 World Cup: ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆసియా కప్ లో భారత్ సూపర్- 4 దశలోనే నిష్క్రమించింది. గాయం నుంచి కోలుకుని వచ్చిన భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అంతగా రాణించలేదు. సూపర్- 4 లో అఫ్ఘనిస్థాన్ తో మ్యాచులో ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ తన సెంచరీ కరవును తీర్చుకోవటంతో పాటు.. కెరీర్లో మొదటి టీ20 సెంచరీ సాధించాడు. అద్భుత బ్యాటింగ్ తో 122 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అప్పట్నుంచి చాలామంది మాజీ ఆటగాళ్లు, క్రికెట్ నిపుణులు కోహ్లీ ఓపెనింగ్ చేయాలంటూ సూచిస్తున్నారు. అభిమానుల మధ్య ఓపెనింగ్ స్థానంపై చర్చ నడుస్తోంది. దీనిపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కొంచెం ఘాటుగా స్పందించారు.
భారత్ కు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు రెగ్యులర్ ఓపెనర్లు. వారు గాయపడినా లేదా అందుబాటులో లేకపోయినా మరో ప్రత్యామ్నాయం ఆలోచించాలి. రాహుల్ గాయపడినప్పుడు చాలా మంది ఆటగాళ్లను ఓపెనర్లుగా పరీక్షించారు. అయితే వారెవరు అనుకున్నంతగా రాణించలేదు. ఆసియా కప్ సమయానికి రాహుల్ గాయం నుంచి కోలుకుని జట్టులో చేరాడు. అయితే ఆ టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేదు. అదే టైంలో కోహ్లీ ఓపెనర్ గా వచ్చి శతకం బాదటంతో.. అతనే ఇన్నింగ్స్ ప్రారంభించాలన్న చర్చ ప్రారంభమైంది. దీనిపై స్టార్ స్పోర్ట్స్ తో జరిగిన సమావేశంలో రవిశాస్త్రి స్పందించారు.
వారిద్దరే ఫస్ట్ ఛాయిస్
భారత ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లే ఉండాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. వారిద్దరూ అందుబాటులో లేకపోతేనే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలని సూచించాడు. ఇలాంటి చర్చ వల్ల రాహుల్ మానసికంగా ఇబ్బందిపడే అవకాశం ఉందన్నారు. ఇలాంటి ఆలోచనలు అతని ప్రపంచకప్ సన్నద్ధతను ప్రభావితం చేస్తాయని అన్నాడు. కోహ్లీకి మిడిలార్డర్ నప్పుతుంది. మిడిల్ లో అనుభవజ్ఞుడైన ఆటగాడం ఉండడం జట్టుకు మేలు చేస్తుంది. ఓపెనర్లు త్వరగా ఔటైనప్పుడు వన్ డౌన్ లో వచ్చే ఆటగాడు జట్టును నడిపించాలి. అలాంటి స్థానంలో కోహ్లీ ఉంటే భారత్ పని తేలికవుతుంది. అని రవిశాస్త్రి అన్నారు.
ఓపెనర్ గా రాహుల్ ది బెస్ట్
ప్రస్తుతం రాహుల్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని రవిశాస్త్రి అన్నారు. లయ అందుకున్నాడని.. అనవసరంగా అతని బుర్రను పాడుచేయవద్దని సూచించారు. అతని మైండ్ లో ఓపెనింగ్ గురించి ప్రశ్న లేవనెత్తకూడదని అన్నారు. ఓపెనర్ గా తన స్థానం సుస్థిరమైనదనే భరోసాతో రాహుల్ బాగా బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్లు చేస్తాడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ లో భారత్ చివరి మ్యాచులో, ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ మొదటి మ్యాచులో రాహుల్ వరుస అర్థశతకాలు బాదాడు.
#KLRahul is batting beautifully at top.Why cloud his imagination? Why confuse him?Why sow a seed in his mind that he might not be opening?u don't want that,u don't want that guy to have clarity of thought absolutely clear in his mindset he is going to open.
— KL Siku Kumar (@KL_Siku_Kumar) September 24, 2022
-Ravi Shastri pic.twitter.com/m7FmbOX6wD