T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ చరిత్రలో అద్భుతం చేసిన ఉగాండ బౌలర్
Frank Nsubuga created history: ప్రపంచకప్‌లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. టోర్నీల్లో అతి తక్కువ ఎనాకమీతో పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా ఉగాండా బౌలర్ సుబుగా రికార్డు నెలకొల్పాడు.
Uganda Star Frank Nsubuga Creates T20 World Cup History: నిన్న గాక మొన్న మొదలైన టీ20 వరల్డ్ కప్ 2024 (T20 World Cup) అప్పుడే సంచలనాలకు స్థానంగా మారుతోంది. అనామక జట్లు అనుకున్నవే పెద్ద పెద్ద టీమ్స్‌కు గట్టి పోటీ ఇస్తున్నాయి. టీ 20 అంటే పరుగుల వరదే అని భావించే ప్రేక్షకులు బౌలర్ల దెబ్బకి బ్యాటర్లు బెంబేలెత్తిపోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక మ్యాచ్ ల ప్రారంభం నుంచి రికార్డులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా గురువారం గయానాలో ఉగాండా-పాపువా న్యూగినియా(PNG vs UGA) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 43 ఏళ్ల ఉగాండ బౌలర్ ఫ్రాంక్ న్సుబుగా(Frank Nsubug) చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అతి తక్కువ ఎనాకమీతో పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో ఫ్రాంక్.. 4 ఓవర్ల స్పెల్‌లో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతని స్పెల్‌లో ఏకంగా 2 మెయిడిన్ ఓవర్లే. ఇక ఈ మ్యాచ్‌లో ఉగాండా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
ఛాంపియన్ టీమ్స్‌లోని హేమాహమీ బౌలర్లకే సాధ్యం కాని ఓ అద్భుత రికార్డును సాధించిన ఒక బౌలర్ ఉంగాడ పేరు ప్రపంచ క్రికెట్‌లో మారుమోగిపోయేలా చేశాడు. 43 ఏళ్ల వయసున్న ఫ్రాంక్ న్సుబుగా ఈ అరుదైన ఘనతను సాధించి తన జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఇతనిదే ఇప్పుడు అత్యుత్తమ ఎకానమీ(1.00) రేటు. గతంలో అత్యుత్తమ ఎకానమీ సౌతాఫ్రికా స్టార్ బౌలర్ అన్రిచ్ నోర్జే పేరిట ఉండేది. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లోనే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నోర్జే 4 ఓవర్లలో కేవలం 7 రన్స్ ఇచ్చి 1.8 ఎకానమీ నమోదు చేశాడు. ఆ తర్వాత శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్, బంగ్లాదేశ్ బౌలర్ మొహమ్మదుల్లా, శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా 4 ఓవర్లలో 8 పరుగులు ఇచ్చి 2 ఎకానమీతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. అన్నట్టు అత్యుత్తమ ఎకానమీతో పాటు టీ20 క్రికెట్‌లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు వేసిన బౌలర్‌గాను న్సుబుగా ప్రస్తుతం రికార్డులలో ఉన్నాడు.
మ్యాచ్ విషయానికి వస్తే..
గురువారం టీ 20 ప్రపంచ కప్‌లో భాగంగా ఉగాండా - పపువా న్యూగినియా (UNG vs PNG) జట్లు తలపడ్డాయి. టాస్ నెగ్గిన ఉగాండా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన పపువా న్యూగినియా 19.1 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌటైంది. ఉగాండా బౌలర్లలో అల్పేష్, సుబుగా, కోస్మస్ , జుమాలు రెండేసి వికెట్లు తీశారు, మసాబా ఒక వికెట్ తీశారు. తరువాత పపువా న్యూగినియా నిర్దేశించిన 78 పరుగుల టార్గెట్‌ను ఉగాండా 7 వికెట్లను కోల్పోయి ఛేదించింది. వీరిలో 33 పరుగులు చేసిన రియాజత్ టాప్ స్కోరర్ కాగా.. అతడితోపాటు జుమా మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశాడు. పపువా న్యూగినియా బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో ఉగాండా కాస్త ఇబ్బంది పడినప్పటికీ చివరికి 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది.ఈ మ్యాచ్‌లో ఉగాండా మూడు వికెట్ల తేడాతో పీఎన్‌జీని ఓడించింది. వరల్డ్ కప్‌ల్లో ఆ జట్టుకు ఇదే తొలి గెలుపు.