ODI World Cup 2023: తేల్చుకుంటారా తేల్చమంటారా? - రోహిత్, కోహ్లీల టీ20 భవితవ్యం అతడి చేతిలోనే!
భారత క్రికెట్ వెటరన్ స్టార్స్ ప్రస్తుత, మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు, గతేడాది ఆస్ట్రేలియాలో ముగిసిన టీ20 వరల్డ్ కప్ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ODI World Cup 2023: టీమిండియాకు పుష్కరకాలానికంటే పైగానే సేవలు అందిస్తున్న వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీ20ల నుంచి తప్పించనుందా..? ఇప్పటికే పొట్టి ఫార్మాట్ లో ఈ ద్వయాన్ని పక్కనబెట్టిన బీసీసీఐ.. త్వరలోనే టీ20లలో వీరి భవితవ్యం తేల్చడానికి సిద్ధమైంది. బీసీసీఐ కొత్తగా నియమించబోయే చీఫ్ సెలక్టర్ (అజిత్ అగార్కర్ పేరు రేసులో ఉంది) కు ముందున్న అతి పెద్ద టాస్క్ కూడా ఇదేనని బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది.
కొత్తగా ఎంపికయ్యే సెలక్టర్ ను చీఫ్ సెలక్టర్ గా నియమించనున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అతడికి బీసీసీఐ కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. 2007 తర్వాత భారత జట్టు టీ20 వరల్డ్ కప్ నెగ్గలేదు. గతేడాది సెమీస్ చేరిన భారత జట్టు.. ఇంగ్లాండ్ చేతిలో బోల్తా కొట్టింది. అయితే ఐపీఎల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న బీసీసీఐ.. తన సొంత జాతీయ జట్టును ప్రపంచ ఛాంపియన్ గా చేయడం లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్ కప్ ను దక్కించుకునేందుకు బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగానే పలువురు సీనియర్లకు ఈ ఫార్మాట్ నుంచి శాశ్వతంగా వీడ్కోలు పలికేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది.
సీనియర్లందరికీ..
ఇందులో భాగంగానే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, షమీ, కెఎల్ రాహుల్ వంటి వారిని ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోమని కోరనున్నట్టు తెలుస్తున్నది. కొత్తగా వచ్చే చీఫ్ సెలక్టర్ కు ఈ పని అప్పజెప్పునున్నారని బీసీసీఐ ప్రతినిధి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్ కు తెలిపారు. కోహ్లీ - రోహిత్ లు ఆల్ ఫార్మాట్ ప్లేయర్లుగా ఆడుతూనే ఐపీఎల్ కూడా ఆడుతున్నారు. ఇది వారికే గాక టీమ్ పైన కూడా భారీ టోర్నీలలో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. అదీగాక వీళ్ల వయసు కూడా ఈ ఫార్మాట్ నుంచి వీరిని తప్పించడానికి కారణమవుతున్నది. కొత్త చీఫ్ సెలక్టర్ కూడా ఈ విషయంలో నిర్ణయం వాళ్లకే వదిలేయడం కాకుండా వారితోనే ‘మేం తప్పుకుంటున్నాం’ అని చెప్పించే విధంగా చేయాలని బోర్డు కోరుకుంటున్నది.
వయసు.. ఫామ్ కూడా..
టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో కోహ్లీ, రోహిత్ లు ప్రపంచవ్యాప్తంగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కోహ్లీ .. 115 మ్యాచ్ లలో 4,008 పరుగులు చేయగా రోహిత్.. 148 మ్యాచ్ లలో 3,853 రన్స్ చేశాడు. రోహిత్ కు ఇప్పుడు 36 ఏండ్లు కాగా విరాట్ 35లో ఉన్నాడు. ఫిట్నెస్ పరంగా రోహిత్ కంటే కోహ్లీ కాస్త బెటర్ గానే ఉన్నా బీసీసీఐ.. గత టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరినీ పక్కనబెట్టింది. గతేడాది టీ20లలో రోహిత్.. చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ చేయలేదు. పొట్టి ప్రపంచకప్ లో కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ లో కూడా అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. రోహిత్ తో పోలిస్తే కోహ్లీ అంతర్జాతీయ స్థాయిలో మెరుగ్గానే ఆడుతున్నాడు. ఐపీఎల్ లో రాణించాడు. కానీ క్రీజులో కుదురుకునేదాకా నెమ్మదిగా ఆడుతుండటం.. ఆ తర్వాత తాపీగా బ్యాట్ ఝుళిపించడం వంటివి కోహ్లీకి ఆటంకంగా మారుతున్నాయి.
వన్డే వరల్డ్ కప్ తర్వాత కీలక నిర్ణయం..
ఇప్పటికిప్పుడు రోహిత్, కోహ్లీలను టీమ్ నుంచి తొలగించకపోయినా వాళ్లకు మళ్లీ ఛాన్స్ అయితే కష్టమేనని బీసీసీఐ గత కొంతకాలంగా చెప్పకనే చెబుతున్నది. అధికారికంగా కూడా వన్డే వరల్డ్ కప్ తర్వాత దీనిమీద ఓ ప్రకటన కూడా చేసే అవకాశముంది. వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లీ మరికొంతకాలం క్రికెట్ ఆడినా రోహిత్ అయితే ఆడటం కష్టమనే అనిపిస్తోంది. నవంబర్ తర్వాత అతడు టీ20, వన్డేలలో రిటైర్మెంట్ పై కీలక నిర్ణయం కూడా వెల్లడించొచ్చు. అదే జరిగితే నెక్స్ట్ టార్గెట్ కోహ్లీనే అవుతాడు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, రింకూ సింగ్, జితేశ్ శర్మ, సాయి కిషోర్ వంటి కుర్రాళ్లు దూసుకొస్తున్న వేళ వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ లో హార్ధిక్ పాండ్యాకు పూర్తి స్థాయి పగ్గాలు అప్పజెప్పి అతడి సారథ్యంలోనే భారత జట్టును ప్రిపేర్ చేయనున్నట్టు తెలుస్తున్నది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial