(Source: ECI/ABP News/ABP Majha)
Sourav Ganguly: ఒక్క రోజులో అంబానీ, మోదీ అవ్వలేరు - రీసెంట్ డెవలప్‌మెంట్స్‌పై దాదా కామెంట్స్!
Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడిగా రెండోసారి ఎంపికవ్వకపోవడంపై సౌరవ్ గంగూలీ స్పందించాడు. తాను చాలాకాలంగా క్రికెట్ పాలకుడిగా పనిచేస్తున్నానని అన్నాడు.
Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడిగా రెండోసారి ఎంపికవ్వకపోవడంపై సౌరవ్ గంగూలీ స్పందించాడు. తాను చాలాకాలంగా క్రికెట్ పాలకుడిగా పనిచేస్తున్నానని అన్నాడు. శాశ్వతంగా ఎవరూ నాయకుడిగా ఉండలేరని పేర్కొన్నాడు. ఒక్కరోజులోనే ఎవరూ అంబానీ, నరేంద్రమోదీ అవ్వలేరని స్పష్టం చేశాడు. మరో పెద్ద పని వైపు వెళ్తున్నానని వెల్లడించాడు. బంధన్ బ్యాంకు ఈవెంట్లో దాదా మాట్లాడాడు.
బోర్డు అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ రెండోసారి నామినేషన్ వేయలేదు. మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ అతడి స్థానంలో నామినేషన్ దాఖలు చేశాడు. బీసీసీఐలో ఇప్పటి వరకు ఎవరూ వరుసగా రెండుసార్లు అధ్యక్ష పదవి చేపట్టలేదు. పైగా దాదాకు మద్దతు ఇచ్చేందుకు ఏ రాష్ట్ర సంఘమూ ముందుకు రాలేదు. దాంతో అతడు పదవిని త్యాగం చేయక తప్పడం లేదు.
'నేను చాలా కాలంగా పాలకుడిగా ఉన్నాను. నేనికపై మరో పని చూసుకోవాల్సి ఉంటుంది. టీమ్‌ఇండియాకు ఆడటమే నా జీవితంలో అత్యుత్తమమైన రోజులు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడిక మరో పెద్ద పని కోసం వెళ్లాలి. ఎప్పుడూ ఆటగాడిగా ఉండలేం. అలాగే ఎప్పుడూ పాలకుడిగా ఉండలేరు. ఈ రెండూ చేయడం గొప్పే' అని దాదా అన్నాడు.
'నేనెప్పుడూ చరిత్రను నమ్మను. అత్యున్నత స్థాయిలో ఆడే ప్రతిభావంతులు తూర్పు వైపు లేరన్న భావన ఉండేది. ఏదేమైనా ఒక్కరోజులో అంబానీ లేదా నరేంద్ర మోదీ అవ్వలేరు. ఆ స్థాయికి చేరుకోవాలంటే నెలలు, సంవత్సరాలు కష్టపడాలి' అని గంగూలీ పేర్కొన్నాడు. టీమ్‌ఇండియాకు కెప్టెన్సీ చేసిన అనుభవం గురించి మరోసారి వివరించాడు.
'ఆరుగురు కెప్టెన్లు జట్టును నడిపించారు. వన్డే జట్టులోంచి రాహుల్ ద్రవిడ్‌ను దాదాపుగా తప్పిస్తున్నప్పుడు నేను అతడివైపు నిలిచాడు. జట్టును ఎంపిక చేసేందుకు వారి సలహాలు తీసుకున్నాను. జట్టు వాతావరణంలో వీటిని గమనించకుండా ఉండలేరు. నేను చేసిన పరుగుల్ని మాత్రమే కాదు మిగతా వాటినీ జనాలు గుర్తుంచుకుంటారు. ఒక నాయకుడిగా చేయాల్సింది ఇదే' అని దాదా అన్నాడు.