Shubman Gill: ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు- రిషబ్ పంత్ గాయంపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక ప్రకటన
Did Rishabh Pant to Play 4th Test against England | వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయంపై టీమిండియా కెప్టెన్ కీలక ప్రకటన చేశాడు. అతడ్ని మైదానంలో చూడాలని ఉందన్నాడు.

India vs England 4ht Test: లార్డ్స్ టెస్టులో భారత్ పోరాడి ఓడింది. టెయిలెండర్లతో కలిసి రవీంద్ర జడేజా వీరోచితంగా పోరాడినా భారత్‌కు మరో ఓటమి తప్పలేదు. దాంతో సిరీస్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరో రెండు టెస్టులు జరగాల్సి ఉంది. అయితే మూడో టెస్టులో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాంచెస్టర్‌లో జరిగే నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో అందుబాటులో ఉంటాడని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. మూడో టెస్ట్ ముగిసిన అనంతరం సోమవారం నాడు గిల్ మాట్లాడుతూ.. రిషబ్ పంత్ తరువాత టెస్ట్ ఆడేందుకు ఫిట్‌గా ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. స్కానింగ్‌లో పంత్ వేలికి పెద్ద గాయం కాలేదని తేలింది.
ఇంగ్లండ్‌తో ముగిసిన మూడో టెస్ట్ మొదటి రోజున రెండో సెషన్‌లో రిషబ్ పంత్ ఎడమ చూపుడు వేలికి గాయం కావడంతో మైదానాన్ని వీడాడు. దీనిపై మ్యాచ్ అనంతరం గిల్ మీడియాతో మాట్లాడుతూ, "పంత్ స్కానింగ్ కోసం వెళ్లాడు. పెద్ద గాయం కాలేదని స్కానింగ్ లో తేలింది. కాస్త విశ్రాంతి తీసుకుని మాంచెస్టర్‌లో జరిగే నాల్గవ టెస్ట్‌కు రిషబ్ పంత్ ఫిట్‌గా ఉంటాడు" అని గిల్ పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 34వ ఓవర్లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఎడమవైపు డైవ్ చేసిన తర్వాత పంత్ నొప్పికి గురయ్యాడు. ఆ తర్వాత అతను వికెట్ కీపింగ్ చేయలేదు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ కీపింగ్ చేశాడు. పంత్ అయితే భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అంత సౌకర్యంగా కనిపించలేదు. 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా, కీలకమైన నాల్గవ టెస్ట్ జూలై 23న ప్రారంభమవుతుంది. మరోవైపు 9 రోజుల విరామం తర్వాత ప్రారంభం కానున్న తదుపరి టెస్ట్‌కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అని అని సందేహాలు నెలకొన్నాయి.
మూడో టెస్ట్‌లో పోరాడి ఓడిన భారత్
భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మూడో మ్యాచ్ నెగ్గి ఆధిక్యంలోకి వెళ్లాలనున్న పర్యాటక జట్టుకు నిరాశే ఎదురైంది. కేఎల్ రాహుల్ మినహా టాపార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో లార్డ్స్ టెస్టులో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో టెస్ట్‌లో విజయం సాధించడానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 193 పరుగులు లక్ష్యంగా బరిలోకి దిగింది. నాలుగో రోజే భారత్ టాపార్డర్ బ్యాటర్లు ఔటయ్యారు. మొదట్లో రాహుల్ శ్రమించగా.. దురదృష్టవశాత్తూ అతడు ఔట్ కావడంతో విజయంపై భారత్ ఆశలు సన్నగిల్లాయి. తక్కువ టార్గెట్ అని అంతా అనుకున్నారు. కానీ విజయం అంత ఈజీ కాదని నాలుగో రోజే తేలిపోయింది. అయితే నెంబర్ వన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పట్టుదలతో బ్యాటింగ్ చేయడంతో భారత్ పరువు కాపాడుకుంది. లేకపోతే స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యేది. బషీర్ బౌలింగ్ లో సిరాజ్ డిఫెన్స్ ఆడిన బంతి తిరిగి వెనక్కి వచ్చి వికెట్ కు తాకడంతో బెయిల్ కింద పడింది. ఇంగ్లాండ్ ఆటగాళ్ల సంబరాలు మొదలయ్యాయి. భారత్ 170 పరుగులకే కుప్పకూలింది.





















